‘‘ఇజ్రాయిల్‌కు ఇండియాలో తయారైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా’’ అన్న శీర్షికతో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక పరిశోధనాత్మక నివేదికను తాజాగా ప్రచురిం చింది. గాజాలో ఇజ్రాయిల్ చాలా దుర్మార్గంగా మానవ హననానికి పాల్పడుతున్న ప్రస్తుత తరుణంలో ఇండియా నుంచి ఆ హంతక దేశానికి ఆయుధాల సరఫరా సాగుతున్న వైనాన్ని ఆ నివేదిక వివరంగా వెల్లడించింది. ఇండియా నుంచి తరలిస్తున్న సామగ్రిలో ఇజ్రాయిల్ పౌర వినియోగానికి సంబంధించిన సరఫరాలను నివేదిక మినహా యించింది. వాటితోబాటు, దేశ రక్షణ నిమిత్తం వినియో గించే యాంటీ-మిసైల్ ఆత్మరక్షక ఆయుధాలను సైతం మినహాయించింది. ఇండియా సరఫరా చేసిన వాటిలో ఇజ్రాయిల్ ఎదురుదాడి చేయడానికి ఉపయోగించే ఆయుధాల జాబితాను మాత్రమే ప్రత్యేకించి ఆ జాబితాలో పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం 2023 అక్టోబర్ 7 నుంచి 2025 నవంబర్ 30 మధ్య కాలంలో ఇండియా ఇజ్రాయిల్‌కు 2596 సార్లు ఆయుధ సామగ్రిని నౌకల్లో పంపింది. చిన్న ఆయుధాలు, వాటిలో ఉపయోగించే మందుగుండ్లు, సైనిక వాహనాల విడిభాగాలు ఉన్నాయి. భారీ స్థాయి పేలుడు కోసం ఉపయోగించే 155 మి.మీ గుండ్లు, డ్రోన్‌ల ద్వారా ప్రయోగించే గుండ్లు, 5,64,970 భాగాలను పంపింది. 3,90,516 చిన్న ఆయుధ భాగాలను చేరవేసింది. 298 సైనిక వాహన భాగాలను పంపింది.
వీటన్నింటినీ గాజా మీదే ప్రయోగించారని ఖాయంగా చెప్పవచ్చు. ఐరాస గాజాలోని నసీరాత్‌లో నిర్వహిస్తున్న ఒక స్కూల్ భవనంలో రక్షణ పొందుతున్న శరణార్ధుల మీద ఇజ్రాయిల్ బాంబు దాడి చేసి 33మందిని హతమార్చింది. అక్కడ ‘‘మేడ్ ఇన్ ఇండియా’’ అని రాసివున్న మిసైళ్ల ముక్కలు లభించాయి. ఇటువంటి ఆయుధాల సరఫరా ఇజ్రాయిల్‌కు చేయడానికి స్పెయిన్, కెనడా వంటి సంపన్న దేశాలు నిరాకరించాయి. కాని ఇండియా మాత్రం ఇజ్రాయిల్ సాగించే మానవ హననానికి వత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తోంది. చెన్నై నుండి ఇజ్రాయిల్‌కు 27 టన్నుల పేలుడు పదార్ధాలను రవాణా చేస్తున్న ‘మారియానా డానికా’ అనే నౌకకు స్పెయిన్ తన కార్టాజెనా రేవు లోకి అనుమతించ డానికి నిరాకరించింది. ఇలా ప్రజలను హతమార్చే ఆయుధాలను ఇండియా నుండి సరఫరా చేస్తున్న కంపెనీలలో ప్రయివేటు రంగంలోని అదానీ డిఫెన్స్, ఎయిరో స్పేస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇవి ఇజ్రాయిల్‌లోని ఎల్బీట్ సిస్టమ్స్, ఇజ్రాయిల్ వెపన్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలతో జాయింట్ వెంచర్లుగా నడుస్తున్నాయి. వాటితోబాటు ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల నుండి కూడా ఇజ్రాయిల్‌కు సరఫరా చేస్తున్నారు.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక మీద భారత ప్రభుత్వం ఏమాత్రమూ స్పందించలేదు. విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధిని ఒక ప్రెస్‌మీట్‌లో ఈ విషయమై అడిగినప్పుడు అదంతా అంతర్జాతీయ న్యాయసూత్రాలకు లోబడే జరుగుతోందని చెప్పి దాటవేశారు. ఈ విధంగా సమర్ధించుకునేందుకు ప్రయత్నించడంలో అర్ధం లేదు. ఆయుధాల సర ఫరా న్యాయసూత్రాలకు లోబడి జరిగినప్పటికీ, ఆ ఆయుధాలను ఉపయో గించి వేలాది పాలస్తీనా ప్రజల్ని గాజాలో ఊచకోత కోస్తున్నందువలన ఆ దుర్మార్గానికి ఇజ్రాయిల్‌తో బాటు ఇండియా కూడా నైతిక బాధ్యత వహించ వలసి వుం టుంది. స్పెయిన్, కెనడా వంటి సామ్రాజ్యవాద శిబిర దేశాలు సైతం ఇజ్రాయిల్ కు ఆయుధ సరఫరా నిలిపివేశాయి. అందుచేత చట్ట సమ్మతమా కాదా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. వేలాది అమాయక పౌరుల ప్రాణాలకు సంబంధించి ఒకానొక దేశం ఎటువంటి వైఖరి తీసుకుంటుంది అన్నది ఇక్కడ ప్రధానం. ఇటీవలి వరకూ మూడవ ప్రపంచ దేశాలలో ఎక్కడ ప్రజలు అణచివేతకు గురైనా వెంటనే దాన్ని వ్యతిరేకిస్తూ స్పందించడంలో భారతదేశం ముందుంటూ వచ్చింది. ఆ విధంగా మనం సంపాదించుకున్న ప్రతిష్ట ఇప్పుడు మంటలో కలిసింది. చట్టపరంగా చూసినా, ఇండియా చేసినది తప్పే అవుతుంది. జాతి హత్యాకాండ నిరోధంపై ఐరాస సాధారణ సభ నిర్ణయాలు 1948 డిసెంబర్ 9 నుంచి అమల్లోకి రాగా, ఇండియా 1949 నవంబర్ 29న ఆమోదించింది. 1959 ఆగస్టు 27న అధికారికంగా ప్రకటించింది. పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ సాగించిన, ఇంకా సాగిస్తున్న నరమేధం జాతి హత్యా కాండే. ఐరాస నిబంధనలను ఆమోదించిన దేశాలు జాతి హత్యాకాండకు పాల్పడటం, ఉపేక్ష వహించడం శిక్షార్హమవు తుంది. అంతేగాక అలాంటి జాతి హననాన్ని ఆపాల్సిన బాధ్యతను అప్పగించింది.
ఇజ్రాయిల్ గాజాలో సాగిస్తున్నది ‘జాతి హననం’ అని ఇంకా చట్టపరంగా ప్రకటించలేదు కదా అని చెప్పి మోడీ ప్రభుత్వం తప్పించుకోడానికి ప్రయత్నించవచ్చు. కాని ఆ సాకు చెల్లదు. దక్షిణాఫ్రికా 2023 డిసెంబర్ 29న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇజ్రాయిల్ గాజాలో సాగిస్తున్న నరమేధం ‘మానవజాతి హననం’గా ప్రకటించాలని కోరింది. అందుకు గాను దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిని, ఆమె కుటుంబ సభ్యులను హతమారు స్తామంటూ బెదిరింపులు, ఆన్‌లైన్ ప్రకటనలు వెలువడ్డాయి. ఆ వెంటనే దక్షిణా ఫ్రికాకు మద్దతుగా బ్రెజిల్, స్పెయిన్, మెక్సికోలతోబాటు మరో ఇరవై దేశాలు నిలిచాయి. దక్షిణాఫ్రికాకు వ్యతిరేకంగా అమెరికా, హంగరీ, ఫిజి దీవులు మాత్రమే నిలబడ్డాయి. అంతర్జాతీయ కోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదు. అది కొన్నేళ్లు పడుతుంది. కాని మానవజాతి హననాలను అడ్డుకోవాలని, బాధితులను అన్ని విధాలా ఆదుకోవా లన్న చట్టపరమైన బాధ్యతలు అన్ని దేశాలకూ ఉన్నాయి కదా. మన దేశాన్ని అంతర్జాతీయంగా మానవ జాతి హననానికి పాల్పడిన నేరస్తురాలిగా నిలబెట్టడానికి నసీరాత్‌లో 33 మంది పాలస్తీనియన్ శరణార్ధులను హతమార్చడానికి ఉపయోగించినవి ఇండియా సరఫరా చేసిన ఆయుధాలే అన్న ఒక్క విషయం చాలు. అందుచేత ఇండియా చేసినది అనైతికమే కాదు చట్టవిరుద్ధం కూడా.
అంతేకాదు, ఇజ్రాయిల్ దుర్మార్గాలపై ఐరాస ప్రత్యేక కమిటీ 2024 నవంబర్‌లో తన నివేదికను అందజేసింది. ఇజ్రా యిల్ ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాలలో జరిగిన ఘటనలపై ఐరాస నియమించిన మరొక కమిషన్ 2025 సెప్టెంబర్ 16న ఇంకొక నివేదిక ఇచ్చింది. ఈ రెండు నివేదికలూ ఇజ్రాయిల్ గాజాలో మానవజాతి హననానికి పాల్పడిందని నిర్ధారిం చాయి. గాజాలోని ప్రజలకు ఆహారం అందనివ్వకుండా చేసి వారి ఆకలి చావులకు ఇజ్రాయిల్ కారణమైందని ప్రత్యేక కమిటీ నివేదిక వెల్లడించింది. ఆక్రమిత ప్రాంతాల్లోని నిస్సహాయులైన ప్రజలకు మానవతా సహాయం అందడానికి అను మతించాలన్న అంతర్జాతీయకోర్టు ఆదేశాలను ఇజ్రాయిల్ ఉల్లంఘించింది. ఐరాస నియమించిన ఈ రెండు కమిటీల లోనూ అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్నారు. వారి నిర్ధారణలు చాలా ప్రాధాన్యత కలిగివున్నాయి. వాటిని కొట్టిపారేయడానికి వీల్లేదు.
జాతి హనన చర్యలను అధ్యయనం చేసే పండితుల అంతర్జాతీయ సంస్థ ఒకటి ఉంది. అందులో ప్రపంచంలోని అత్యుత్తమ న్యాయ నిపుణులు, చరిత్రకారులు, మానవ హక్కుల నేతలు, రాజకీయ పండితులు ఐదువందల మంది సభ్యులు ఉన్నారు. ఇజ్రాయిల్ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం మానవ జాతి హననానికి, పలు నేరాలకు విస్తృతంగా పాల్పడిం దని, ఇవన్నీ యుద్ధనేరాలుగా పరిగణించబడతాయని తీర్మానించింది. ఇంత పెద్ద సంఖ్యలో, ప్రపంచంలో ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నప్పుడు, జాతి హనన వ్యతిరేక సదస్సు తీర్మానం మీద సంతకం చేసిన దేశాలన్నీ ఇజ్రాయిల్ నేరాలను అడ్డుకోడానికి, దాన్ని శిక్షించడానికి పూనుకోవలసి వుంది. అలా చేసే బదులు దానికి పూర్తి విరుద్ధంగా ఇజ్రాయిల్‌కు ఆయుధా లను సరఫరా చేయడం అంటే మానవత్వ మీద దాడి చేయడమే. నైతికంగా గాని, చట్టపరంగా కాని ఇది గర్హనీయం. ఇటువంటి పనికి పూనుకున్న మోడీ ప్రభుత్వం మన దేశాన్ని తలెత్తుకోలేని స్థితికి దిగజార్చింది. ఈ ప్రభుత్వం అనుసరించే దేశీయ విధానాలలో నైతికత పూర్తిగా లోపించింది. దానితో బాటు విదేశాంగ విధానమూ నైతికంగా డొల్లగా అయిపోయింది.
పోనీ, పాలస్తీనా సమస్య విషయంలో ఈ ప్రభుత్వం ప్రకటించిన విధానానికైనా కట్టుబడి వ్యవహరిస్తోందా అంటే అదీ లేదు. నరేంద్ర మోడీ తమ ప్రభుత్వం ‘‘రెండు రాజ్యాల ఏర్పాటు’’ సూత్రానికి కట్టుబడి వుందని పదే పదే ప్రకటిస్తూ వచ్చింది. కాని ఇజ్రాయిల్ ఈ సూత్రాన్ని తిరస్కరించింది. గతంలో ఓస్లో ఒప్పందం సమయంలో పరిమిత అధికారాలుగల పాలస్తీనా ప్రభుత్వం ఉనికిని ఇజ్రాయిల్ అంగీకరించింది. ఆ తర్వాత దాని మీద వెనక్కి పోయింది. మొత్తం గాజా భూభాగం అంతా తన పెత్తనం కిందికి రావాలని అంటోంది. ఇటువంటి దురాక్రమణ చర్య మోడీ ప్రభుత్వం ప్రకటించిన విధానానికి వ్యతిరేకం. అయినప్పటికీ ఇండియా ఆయుధాల సరఫరాకి సిద్ధపడింది. కానీ ఇదేమీ మోడీ ప్రభుత్వానికి పట్టినట్టు లేదు. మోడీ ప్రభుత్వానికి సంబంధించినంత వరకూ ట్రంప్‌ను ఏదో విధంగా సంతృప్తిపరచడం, అదానీ వంటి క్రోనీల ప్రయోజ నాలను కాపాడుతూ వుండడం అనేదే ప్రధానం అయిపోయింది. ఈ ఆయుధాల సరఫరా ద్వారా అదానీ కంపెనీలకు లాభాలు బాగా వచ్చిపడుతున్నాయి. ఇక దేశం, ప్రజలు, నైతికత, మానవత్వం, దేశ ప్రతిష్ట వంటివి మంటగలిసినా, ఇతర దేశాల ముందు తలెత్తుకోలేని స్థితి ఏర్పడినా మోడీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్
గాజా రక్తపుటేరుల్లో ‘మేడ్ ఇన్ ఇండియా’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



