Monday, June 29, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపెట్టుబడిదారీ విధానం, ఉపాధి కల్పన - చరిత్ర ఏం చెప్తోంది?

పెట్టుబడిదారీ విధానం, ఉపాధి కల్పన – చరిత్ర ఏం చెప్తోంది?

- Advertisement -

పద్దెనిమిదవ శతాబ్దం చివరి భాగంలోను, 19వ శతాబ్దం తొలి భాగంలోను బ్రిటన్‌లో పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందుతున్న కాలంలో కొత్తగా తెచ్చిన యంత్రాల మీద తయారైన సరుకుల వలన చాలామంది చేతివృత్తిదారుల ఉపాధి పోయింది. అది యంత్రాల ప్రవేశానికి వ్యతిరేకంగా సాగిన లుడ్డైట్ ఉద్యమానికి దారితీసింది. నిరు ద్యోగం పెరగడంతో పేదరికం కూడా పెరిగింది. అయితే కొన్ని ఏళ్ల అనంతరం 19వ శతాబ్దం తర్వాతి భాగంలో ఆ దేశంలో దారిద్య్రంతో బాధపడే ప్రజానీకం శాతం తగ్గింది. నిరుద్యోగంతో బాధపడేవారి సంఖ్య కూడా తగ్గింది.
అప్పటి బ్రిటన్ అనుభవం పెట్టుబడిదారీ విధానంలో ఇమిడివున్న ఒక స్వభావసిద్ధ లక్షణం అని చెప్తూ దానిని మొత్తం పెట్టుబడిదారీ దశకే వర్తింపజేస్తుంటారు కొందరు. పెట్టుబడి ప్రవేశించినప్పుడు మొదట్లో కొంత నిరుద్యోగానికి అది దారి తీయవచ్చునని, అయితే ఆ పెట్టుబడి ప్రవేశం వలన మొత్తం మీద ప్రజానీకపు స్థితిగతులు మెరుగుపడతాయని, క్రమేణా, ఆర్థిక అసమానతలు పెరిగినా, అంతకు మునుపటి కన్నా ప్రజలందరి జీవన ప్రమాణాలూ మెరుగుపడతాయని వారు వాదిస్తుంటారు. ఈ వాదన చాలా విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఏ దేశంలోనైనా భారీ స్థాయిలో నిరుద్యోగ సమస్యను చవిచూస్తున్నప్పుడు ఆ దేశం తన వద్ద పెట్టుబడులు పెట్టేలా పెట్టుబడిదారులను ఆకర్షించడమే పరిష్కారమని వాళ్లు సలహా ఇస్తూంటారు. ఇప్పుడు మన దేశంలోని ఏ రాష్ట్రానికైనా ఈ పరిష్కారాన్నే ఒక మంత్రం లాగా వాళ్లు చెప్తున్నారు. “మీది పేద రాష్ట్రం అయితే పెట్టుబడిదారులకు భారీగా రాయితీలివ్వండి. అప్పుడు వాళ్లు వచ్చి మిమ్మల్ని పేదరికం నుంచి బయటకు తీసుకొస్తారు.” ఇదే ఆ మంత్రం.

ఇలా చెప్పడానికి వారి దగ్గర ఎటువంటి సిద్ధాంతపరమైన ప్రాతిపదికా లేదు సరికదా, వాళ్లు చరిత్రలో వాస్తవంగా జరిగిందేమిటో తెలుసుకోవడంలో పూర్తిగా పొరపాటు పడుతున్నారు. కొత్త యంత్రాలను ప్రవేశ పెట్టడం అనేది ఒకే ఒక్కసారి మాత్రమే జరిగే వ్యవహారం. అయితే అప్పుడు మాత్రమే, అది కూడా పోగుబడ్డ పెట్టుబడిని మళ్ళీ పెట్టుబడి పెట్టే వేగం తగ్గకుండా కొనసాగితేనే, ఆ యంత్రాల ప్రవేశం కారణంగా మొదట్లో తలెత్తిన నిరుద్యోగాన్ని అధిగమించడం, అదనంగా ఉద్యోగాలను కల్పించడం సాధ్యపడుతుంది. కాని, పారిశ్రా మిక పెట్టుబడిదారీ విధానంలో నిరంతరం కొత్త యంత్రాల కోసం, కొత్త సరుకుల ఉత్పత్తి కోసం పరిశోధనలు, ప్రయత్నాలు కొనసాగుతూనే వుంటాయి. అందువలన నిరంతరం కార్మికులకు ఉన్న ఉద్యోగాలు పోతూనే వుంటాయి. అందుచేత పెట్టుబడిదారీ విధానం వలన ఏర్పడిన నిరుద్యోగం ఆ వ్యవస్థలో ఎన్నటికీ అదృశ్యం కాదు. పెట్టుబడిదారీ విధానం నిరుద్యోగాన్ని లేకుండా చేసేస్తుందని చెప్పడానికి ఎటువంటి సైద్ధాంతిక ప్రాతిపదికా లేదు.

ఇక చారిత్రికంగా చూద్దాం. అప్పట్లో యంత్రాల ప్రవేశం కారణంగా తలెత్తిన నిరుద్యోగం లుడ్డైట్లను ఆగ్రహావేశాలకు గురి చేసింది. కాని ఆ తర్వాత నిరుద్యోగం ఉపశమించింది. దానికి కారణం పెట్టుబడిదారీ విధానంలో స్వభావసిద్ధంగా ఉన్న లక్షణం ఏదీ కాదు. అప్పుడు నిరుద్యోగం తగ్గడానికి మూడు స్పష్టమైన కారణాలు ఉన్నాయి. బ్రిటన్ నుండి, ఐరోపా ఖండం నుండి కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాలకు దాదాపు ఐదు కోట్ల మంది వలసలు వెళ్లారు. అక్కడికి వలసలు పోయి, స్థానికులను ఊచకోత కోసి, తరిమివేసి ఆ ప్రాంతాలను ఆక్రమించు కున్నారు. వ్యవసాయదారులుగా మారారు. 1815 నుండి 1914 మధ్య శతాబ్దం కాలంలో బ్రిటన్‌లో ఎంతమంది కొత్తగా జనాభా పెరిగారో, వాళ్లలో సగం మంది ఈ కొత్త ప్రాంతాలకు వలసపోయారు. దీని ఫలితంగా బ్రిటన్‌లో నిరుద్యోగం గణనీయంగా తగ్గింది.
ఇక రెండో కారణం చూద్దాం. ఈ పెట్టుబడిదారీ దేశాలు కొన్ని ఇతర దేశాలను తమ పెత్తనం కిందకు తెచ్చుకున్నాయి. భారతదేశం కూడా వాటిలో ఒకటి. 19వ శతాబ్దం మొత్తం ఈ వలస దేశాల్లో జీవించే స్థానిక వత్తిదారుల ఉత్పత్తులను దెబ్బ తీస్తూ తమ వద్ద యంత్రాల మీద ఉత్పత్తి అయిన సరుకులను తెచ్చి గుమ్మరించారు. దాంతో స్థానిక చిన్న ఉత్పత్తిదారులు నాశనమయ్యారు. ఈ క్రమాన్నే పారిశ్రామిక వినాశనం (డీ ఇండస్ట్రియలైజేషన్) అని అంటారు. అంటే యంత్రాల ద్వారా జరిగిన ఉత్పత్తి అక్కడ బ్రిటన్‌లో పెద్దగా నిరుద్యోగానికి దారి తీయలేదు కాని ఇక్కడ వలస దేశాల్లో భారీ నిరుద్యోగానికి దారి తీసింది.
ఇక మూడవ కారణం: మొదట్లో యంత్రాల తయారీకి చాలా పెద్ద సంఖ్యలో మనుషులు అవసరమయ్యారు. అందుచేత యంత్రాల ప్రవేశం వలన పనులు పోతున్నా, యంత్రాల తయారీకి కూడా పెద్ద సంఖ్యలో మనుషులు అవసరమైనందున మొత్తం మీద ఉద్యోగాలు తగ్గిపోవడం అనేది పరిమితంగానే ఉండేది.

ఈ మూడు కారణాలూ ఏ విధంగా చూసినా, పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావసిద్ధ లక్షణం నుంచి వచ్చినవి కానేకావు. మొదటి రెండు కారణాలూ వలస విధానం పర్యవసానంగా వచ్చాయి. ఇక మూడవ కారణం కూడా ఆ ప్రత్యేక సందర్భంలో ఉన్నదే కాని పెట్టుబడిదారీ విధానపు స్వభావం నుంచి వచ్చినది కాదు. అటువంటిది అన్ని సందర్భాల్లోనూ ఏర్పడదు. అందుచేత పెట్టుబడిదారీ విధానం వలన తాత్కాలికంగా నిరుద్యోగం పెరిగినా, మొత్తం మీద దీర్ఘకాలంలో అభివద్ధి జరుగుతుందని, ప్రజల స్థితిగతులు మెరుగుపడతాయని చెప్పడానికి ఎటువంటి ఆధారమూ లేదు. అది ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. ఆ కాలంలో ఒక ప్రత్యేక సందర్భంలో ఐరోపా ఖండంలో జరిగిన ప్రత్యేక పరిణామాలను మొత్తం ప్రపంచానికంతటికీ, మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్థ అంతటికీ వర్తింపజేయబూనుకోవడం సరి కాదు.
ఇంకా చెప్పాలంటే నేటి పెట్టుబడిదారీ విధానం “అభివృద్ధి” అనేదానికే వ్యతిరేకంగా ఉంది. కొన్ని గణాంకాలను పరిశీలిస్తే ఇది కనిపిస్తుంది. 2010-2020 మధ్య దశాబ్ద కాలంలో ప్రపంచ జీడీపీ వార్షిక వృద్ధి రేటు 2.6 శాతం. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలం మొత్తం మీద ఇది ఏ దశాబ్దానికన్నా తక్కువగా ఉంది. ఈ దశాబ్దంలోని మొదటి ఐదు సంవత్సరాల్లో ప్రపంచ శ్రామిక ఉత్పాదకత ఏటా 1.8 శాతం చొప్పున పెరిగితే తర్వాత ఐదు సంవత్సరాల్లో అది 1.4 శాతానికి పడిపోయింది. అంటే సగటును మొత్తం దశాబ్ద కాలానికి 1.6 అని అనుకోవచ్చు. జీడీపీ వృద్ధి రేటుకి, ఉత్పాదకత పెరుగుదల రేటుకి మధ్య తేడా ఎంత ఉంటుందో ఉపాధి కూడా అదే రేటులో పెరుగుతుంది. అంటే ఈ దశాబ్దకాలంలో ఉపాధి వృద్ధి ఒక శాతం మాత్రమే. కాని ప్రతే ఏటా కార్మికుల సంఖ్య 1.5 చొప్పున పెరుగుతోంది. అంటే ప్రపంచం మొత్తం మీద నిరుద్యోగం పెరుగుతూనే పోతోంది. కరోనా అనంతర కాలంలో ప్రత్యేకంగా ప్రభుత్వాల వ్యయాలు పెరిగినే కాలం ఇది ఈ దశాబ్దంలోనే పరిస్థితి ఇలా ఉందంటే కరోనాకు ముందరి దశాబ్ద కాలంలో, అంటే ప్రభుత్వ వ్యయం బాగా తక్కువ స్థాయిలో ఉన్న కాలంలో, నిరుద్యోగం ఇంకా ఎక్కువ మోతాదులో ఉండి వుండాలి.

పెట్టుబడిదారీ వ్యవస్థ తాజా దశ అయిన నయా ఉదారవాద కాలంలో జీడీపీ వృద్ధి వేగం తగ్గిపోతోంది. దీనికి కారణం ఆ విధానాల అమలు ఫలితంగా అసమానతలు బాగా ఎక్కువగా పెరిగిపోవడం, ప్రభుత్వాలు జోక్యం చేసుకునే శక్తి బాగా తగ్గిపోవడం. అందుచేత నయా ఉదారవాద పెట్టుబడిదారీ దశలో ఉపాధి కల్పనలో కూడా అభివద్ధి వేగం తగ్గిపోతుంది. కార్మికుల సంఖ్య పెరిగే వేగం కన్నా కూడా తగ్గిపోతుంది. అందుచేత నయా ఉదారవాద విధానాలలోనే స్వభావసిద్ధంగా నిరుద్యోగాన్ని పెంచే లక్షణం ఉంది.

అయితే, పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేసే దేశాలన్నీ కూడా నిరుద్యోగాన్ని పరిష్కరించడంలో విఫలమై తీరుతాయని అనుకోనక్కర్లేదు. ఏ దేశాలైతే తమ వద్ద ఉన్న నిరుద్యోగాన్ని పరిష్కరిస్తాయో అవి అందుకోసం ఇతర దేశాల్లో నిరుద్యోగం పెరిగిపోడానికి కారణమౌ తాయి. అంటే అన్ని దేశాలూ పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేసి అన్నీ అభివద్ధి దిశగా పురోగమించడం అనేది అసాధ్యం. ఇక్కడ అభివృద్ధి అంటే పేదరికాన్ని అధిగమించడం అని గ్రహించాలి. ప్రపంచం మొత్తంగా కలిపి చూసినప్పుడు పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగించడం అనేది పేదరికాన్ని అనివార్యంగా పెంచుతుంది.
ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల మేథోపరమైన హస్తలాఘవం ఇక్కడే మనకు కనిపిస్తుంది. కొన్ని దేశాలు పెట్టుబడిదారీ అభివృద్ధి మార్గాన నడిచి తమ పేదరికాన్ని అధిగమించాయి. వాటినే ఉదాహరణలుగా చూపి ప్రపంచం మొత్తం ఇదే విధంగా అధిగమించగలుగుతుంది అని ప్రపంచ బ్యాంక్ బోధిస్తుంది. ఉదాహరణలుగా చూపిన ఆ దేశాలు తమ పేదరికాన్ని అధిగమించే సమయంలోనే దాని ఫలితంగా మరికొన్ని దేశాల పేదరికం మరింత పెరిగిందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనంతటినీ కలిపి చూసినప్పుడు పేదరికం పెరుగుతున్న తీరు వేగం పుంజుకుంటున్నదని కనిపిస్తుంది. ప్రపంచబ్యాంక్ చెప్తున్నదానికి ఇది పూర్తి విరుద్ధం.
వాస్తవానికి కొన్ని దేశాలు, సాపేక్షంగా చిన్న దేశాలు, తమ వద్ద ఉండే కొద్దిపాటి నిరుద్యోగాన్ని అధిగ మించాయి. అందుకోసం అవి సంపన్న దేశాల నుండి పెట్టుబడులను ఆహ్వానించాయి (ఆసియా పులులు ఒక ఉదాహరణ). కాని ఇవి అరుదైన మినహాయింపులే తప్ప సర్వసాధారణ ఉదాహరణలు కాలేవు. ఇటువంటి చిన్న చిన్న దేశాలకు వర్తించే అనుభవాలు అపారంగా నిరుద్యోగం ఉన్న భారతదేశం వంటి పెద్ద దేశాలకు అస్సలు వర్తించవు. మనకి ఈ నిరుద్యోగం వలస పాలనా కాలం నుంచీ, వారి దోపిడీ పుణ్యమా అని ఒక శాపంలాగా చుట్టుకుంది. పెద్ద ఎత్తున వ్యవసాయ రంగం ఉండడంతో దాని మాటున ఈ నిరుద్యోగం నివురుగప్పిన నిప్పు లాగా ఉంది. పెట్టుబడిదారీ మార్గాన ఇటువంటి దేశం వెనుకబాటుతనాన్ని అధిగమించి అభివృద్ధి సాధించి నిరుద్యోగాన్ని రూపుమాపుతుంది అని ఆశించడం అర్ధం లేనిది. నయా ఉదారవాద విధానాల ప్రవేశానికి ముందరి కాలంలో ఈ వాస్తవాన్ని బాగానే అర్ధం చేసుకున్నారు. అందుకే ప్రభుత్వ జోక్యంతో కొంతమేరకు అభివద్ధి సాధించారు. కాని నయా ఉదారవాద దశలో పెట్టుబడిదారీ భక్తి ఎంత ఎక్కువగా ఎక్కిస్తున్నారంటే గతంలో అర్ధం చేసుకున్నది ఇప్పుడు మరిచిపోయారు. భ్రమల్లో పడ్డారు. ఈ భ్రమల నుంచి ప్రజలు ఎంత వేగంగా బయట పడగలిగితే అంత తొందరగా దేశీయ మార్కెట్‌ను బలోపేతం చేయగల ప్రత్యామ్నాయ విధా నాల వైపు అడుగులు వేయడానికి వీలౌతుంది. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దేశీయ మార్కెట్‌ను బలోపేతం చేసి తద్వారా అభివృద్ధి క్రమం వేగాన్ని నిలకడగా పెంచుకుంటూ పోవడం సాధ్య పడుతుంది. పెట్టుబడులు దేశ సరిహద్దులు దాటిపోడానికి వీలు లేకుండా నియంత్రించి, ప్రభుత్వ రంగాన్ని బలంగా నిలబెట్టి తద్వారా పెట్టుబడిదారుల ఒత్తిళ్లను తిప్పికొట్టి ముందుకు పోవడం కుదురుతుంది. ఇదెంత తొందరగా జరిగితే మానవాళికి అంత మేలు.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -