మండుటెండలో కార్మిక వర్గం కవాతు
ఆకట్టుకున్న చికాగో
అమరవీరుల స్మృతి చిహ్నం
ప్రత్యేక ఆకర్షణగా మహిళల కోలాట ప్రదర్శన
పూలతో స్వాగతం పలికిన ఎస్‌ఎఫ్‌ఐ బృందం
దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేసిన కార్మికులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా సీఐటీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కార్మికవర్గం కవాతు చేసింది. నారాయగూడలోని వైఎంసీఏ చౌరస్తా నుంచి గోల్కొండ క్రాస్‌రోడ్డులోని సీఐటీయూ సిటీ కార్యాలయం వరకు ప్రదర్శన సాగింది. ర్యాలీ ముందుభాగంలో ఓ వాహనంపై ఏర్పాటు చేసిన చికాగో పోరాట అమరవీరుల స్మృతి చిహ్నం అందర్నీ ఆకట్టుకున్నది. మహిళా కార్మికుల కోలాట ప్రదర్శన, డప్పుకళాకారుల ఆటాపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘మేడే వర్థిల్లాలి…కార్మిక వ్యతిరేక మోడీ సర్కార్ డౌన్‌డౌన్…తిప్పికొడతాం..తిప్పికొడతాం..లేబర్‌కోడ్లను తిప్పికొడతాం… అణచివేసేకొద్దీ పోరాట జ్వాలలమై ఎగిసిపడతాం…ఎగిసిపడతాం. కార్మిక హక్కుల్ని కాపాడుకుంటాం…కాపాడుకుంటాం. కనీస వేతనం రూ.26 వేల కోసం పోరాడుతాం..పోరాడుతాం. చికాగో అమరవీరులకు జోహార్లు..’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా కార్మికులు దారిపొడుగుతా నినాదాలు చేశారు. రహదారిపై వెళ్లే వారిలో చాలామంది కార్మికుల ర్యాలీకి అభివాదం చేశారు. కార్మికవర్గం కవాతుపై నారాయణగూడ ఫ్లైఓవర్ మీద నుంచి ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నేతలు పూలవర్షం కురిపించారు. చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో కార్మికులకు వాటర్‌ప్యాకెట్లు అందించారు. ర్యాలీ ప్రారంభం సందర్భంగా సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు డాక్టర్ కె.హేమలత మాట్లాడుతూ.. చికాగో పోరాట అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని తెలిపారు. పెట్టుబడుదారుల లాభాపేక్షను తీర్చేందుకు కార్మిక వర్గానికి వేతనాలను పెంచకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికవర్గాన్ని దోపిడీ చేస్తున్నదని విమర్శించారు.
యూపీలోని నోయిడా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లో కార్మికులు వేతనాల పెంపు, లేబర్‌కోడ్‌లకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మోడీ పాలనలో కార్మికుల వేతనాలు పెరగలేదుగానీ నిత్యావసర సరుకుల ధరలు అనేక రెట్లు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులను మోడీ ప్రభుత్వం హననం చేస్తున్నదని విమర్శించారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో రానున్న కాలంలో కార్మికులు తమ హక్కుల కోసం సమరశీల పోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ర్యాలీ ముగింపు సందర్భంగా సీఐటీయూ సిటీ కార్యాలయం వద్ద గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ శ్రామిక మహిళా కన్వీనర్ డి.కిరణ్మయి అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేష్, ఎం పద్మశ్రీ, ఎం.వెంకటేష్, హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.దశరథ్, జె.కుమారస్వామి, కోశాధికారి కె.అజరు బాబు, ఉపాధ్యక్షులు జి రాములు, టి మహేందర్, వి కామేష్ బాబు, సహాయ కార్యదర్శులు జి నరేష్, పి శ్రీనివాస్, ఎస్ శ్యామలీల, ఆర్ అశోక్, నగర నాయకులు ఎం సత్యనారాయణ, డిఎల్ మోహన్, టీవీకే ప్రసాద్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
మేడే స్ఫూర్తితో సమరశీల పోరాటాలు : డాక్టర్ కె.హేమలత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



