సోషలిజానికి పెరుగుతున్న ఆదరణదేశంలో మతరాజ్య స్థాపనకు మోడీ కుట్ర
రాష్ట్రంలో రేవంత్ సర్కార్‌పై ప్రజల్లో అసంతృప్తి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
‘నవతెలంగాణ’ కార్యాలయంలో ఘనంగా ‘మేడే‘
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సామ్రాజ్యవాదం పతనావస్థకు చేరుకుందనీ, అదే సందర్భంలో సోషలిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌లోని నవతెలంగాణ దినపత్రిక ప్రధాన కార్యాలయంలో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జెండాను ఆవిష్కరించారు. అనంతరం పత్రిక ఎడిటర్ రాంపల్లి రమేశ్ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ 1990లో సోవియట్ యూనియన్ పథనం తర్వాత అనేక కమ్యూనిస్ట్ దేశాలు తమ పంథాను మార్చుకున్నాయని గుర్తు చేశారు. ప్రపంచ నియంతగా వ్యవహరిస్తున్న అమెరికా మూడు దశాబ్దాల కాలంలో ఆర్థిక, సైనిక శక్తితో పాటు డాలర్‌ను ప్రపంచ మారకంగా విస్తరించడం ద్వారా బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నించిం దన్నారు. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు అమెరికా డొల్లతనాన్ని బట్టబయలు చేశాయని తెలిపారు. అమెరికా, ఇజ్రాయిల్ కలిసికట్టుగా ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంతో తేటతెల్లమైం దన్నారు. మొదటి రోజు జరిపిన దాడిలో ఆ దేశపు సుప్రీం నేత అయతుల్లా ఖమైనీ మృతి చెందడంతో లొంగి పోతుందనుకున్న ఇరాన్ 60 రోజులుగా సాగిస్తున్న యుద్ధం అమెరికాకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నదని ఎద్దేవా చేశారు. చైనాతో పాటు రష్యా తదితర కమ్యూనిస్ట్ దేశాలు అందిస్తున్న సహకారంతోనే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక శక్తి చిన్నాభిన్నం కావడం, సైనిక పాటం డొల్ల అని తేలడం, డాలర్ స్థానంలో చైనా యువాన్‌కు ఆదరణ లభించడం అమెరికా సామ్రాజ్యవాద పథనానికి నాంది అని పేర్కొన్నారు. రష్యా, చైనాలు బలమైన మల్టీఫోర్ సిస్టమ్‌గా ఎదగడం ప్రపంచానికి శుభపరిణామ మన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం మత రాజ్య స్థాపనకు కుట్రలు పన్నుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులను, మత తత్వవాదులను పెంచి పోషిస్తూ ప్రజల్లో చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. హిందూ ఐడెంటీటిని గుర్తించి, మైనార్టీలను పారద్రోలే చర్యలకు పాల్పడుతోం దన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ దేశంలో ఒకే ఒక పార్టీ బీజేపీ ఉండేలా చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పార్టమెంట్‌లో నేడు అడుగు పెడుతున్న వారంతా డబ్బున్న బడా కార్పొరేట్లేనని గుర్తు చేశారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని వారిపై ఈడీ లాంటి సంస్థలను ప్రయోగించడం ద్వారా బీజేపీ తన దారిలోకి తెచ్చుకుంటోందన్నారు. ఇటీవల కేజ్రీవాల్ పార్టీ ఆమ్‌ఆద్మీకి చెందిన వారిని బీజేపీలో విలీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శ నమన్నారు. తెలంగాణలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి క్రమంగా పెరుగు తోందని అన్నారు. ప్రజల నుంచి ఉద్యమాలు రాకుండా ఉండేందుకు అస్థిత్వ, కుల, మత, ప్రాంతీయ ఉద్యమాలకు ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు.అన్నింటినీ తట్టుకుని రాష్ట్రంలో సీపీఐ(ఎం) బలమైన ప్రజా పోరాటాలను నిర్వహిస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలు దేశంతో పాటు తెలంగాణపైనా తీవ్ర ప్రభావం చూపు తాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో నవతెలంగాణ దిన పత్రిక మిగతా పత్రికలకు భిన్నంగా క్షేత్ర స్థాయిలో నిజమైన చిత్రాన్ని అందిస్తోందని కొనియాడారు. భవిష్యత్‌లో మరింత నైపుణ్యాన్ని సంతరించుకుని ముందుకు పోవాలని ఆకాం క్షించారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్, బుక్ హౌస్ మేనేజర్ కే.ఆనందాచారి, జనరల్ మేనేజర్లు పి.లింగారెడ్డి, ఎం.వెంకటేశ్, కె.రఘు, బోర్డు సభ్యురాలు ఎస్‌కే.సలీమా తదితరులు పాల్గొన్నారు.
పతనావస్థలో సామ్రాజ్యవాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



