Sunday, May 3, 2026
E-PAPER
Homeజాతీయండబ్బుల్ సోదాలు

డబ్బుల్ సోదాలు

- Advertisement -

ఈడీ సోదాలు రెట్టింపు
• తగ్గిన అరెస్టులు.. పెరిగిన ఆస్తుల అటాచ్‌‌మెంట్‌
న్యూఢిల్లీ:
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాల సంఖ్య గతంలో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. అరెస్టులు తగ్గి.. ఆస్తుల అటాచ్‌‌మెంట్‌ ‌కేసులు పెరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈడీ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు పేర్కొన్నారు. సోదాలు పెరిగి.. అరెస్టులు తగ్గాయంటే ఆ కేసుల్లో బలమైన ఆధారాలు లేవనే విషయం స్పష్టమవుతోందని విశ్లేషుకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వ ప్రభుత్వం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని ఈడీ, సీబీఐ ద్వారా అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తోందన్న విమర్శలున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈడీ వార్షిక నివేదికలోని అంశాలు కూడా వారి విమర్శలకు బలం చేకూర్చుతున్నాయి. 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో మనీలాండరింగ్ కేసులతో ముడిపడిన ఈడీ సోదాల సంఖ్య రెట్టింపు అయ్యి 2,892కు పెరగాయి. అంతకుముందు ఏడాది సోదాల సంఖ్య 1491గా ఉంది. అలాగే2024-25లో214మందిని అరెస్టు చేయగాల్ ఈ ఏడాది 27శాతం తగ్గి 156గా నమోదయ్యాయి. అత్యధికంగా 2023-24లో 272 మందిని అరెస్టు చేశారు. అలాగే దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత భారీగా రూ.81వేల కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులను ఇడి అటాచ్ చేసింది.
2025 ఏప్రిల్1 నుంచి 2026 మార్చి 31 మధ్యకాలంలో దర్యాప్తు చేసిన మనీలాండరింగ్ కేసులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు.నివేదికలోని కీలక అంశాలివీ -పక్కా ఆధారాలు లభించిన మనీ లాండరింగ్ కేసుల్లోనే అరెస్టులు చేస్తున్నామని,అందుకే అరెస్టులు తగ్గాయని వార్షిక నివేదికలో ఇడి అంగీకరించింది. 2025-26లో తమ ఉన్నతాధికారుల నుంచి అందిన712ఆదేశాల అమలులో భాగంగానే రూ.81,422కోట్లు విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్‌‌మెంట్ చేశామని ఇడి తెలిపింది.ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్తుల అటాచ్‌‌మెంట్‌లు 171శాతం పెరిగాయని పేర్కొంది. 2024 -25లో ఉన్నతాధికారులు జారీచేసిన 461ఆదేశాల అమలులో భాగంగా రూ.30,036కోట్లు విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. 2025-26లో రూ.32,678కోట్లు విలువైన ఆస్తులను ఆయా కేసుల్లో మోసపోయిన వారు, బాధితుల కోసం ఈడీ పునరుద్ధరించింది. రిలీజైన ఈ ఆస్తుల్లో రూ.15,582కోట్లు విలువైనవి పెర్ల్స్ అగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీఏసీఎల్)తో ముడిపడిన పోంజీ కేసుకు సంబంధించినవే అని పేర్కొంది. మనీలాండరింగ్ కేసుల బాధితుల్లో ఇండ్ల కొనుగోలుదారులు, బ్యాంకులు, ఇన్వెస్టర్లు ఉన్నారు.
2024-25లో రూ.15,263కోట్ల ఆస్తులను ఈడీ పునరుద్ధరించి బాధితులకు అందించింది. 2025-26లో రూ.15వేల కోట్లు విలువైన ఆస్తుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకోగా..రెట్టింపు స్థాయిలో పునరుద్ధరించారు. 2025-26లో 812 ఛార్జ్‌షీట్‌లను కోర్టుల ఎదుట దాఖలు చేయగా.. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 457 ఛార్జ్‌షీట్‌లనే ఈడీ దాఖలు చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు తేదీ నుంచి తుది తీర్పు వెలువడే వరకు ఉండే వ్యవధిని నిర్దిష్ట కేసుకు చెందిన లైఫ్ సైకిల్ అంటారు.తమ కేసుల సగటు లైఫ్ సైకిల్ ఇంతకుముందు 3 నుంచి 4 ఏండ్లు ఉండేదని, దీన్నదినుంచి ఒకటిన్నర ఏండ్లకు తగ్గించామని ఇడి తెలిపిందిదే
విదేశాలకు విన్నపాలు..
మనీ లాండరింగ్ కేసుతో సంబంధాలున్న ఎవరైనా వ్యక్తి విదేశంలో ఉంటే, ఆ దేశంలోని కోర్టు ద్వారా అతడిని విచారణ పరిధిలోకి తీసుకొచ్చేందుకు లెటర్స్ రొగేటరీ (ఎల్‌ఆర్‌)ని ఈడీ ఉపయోగించుకుంటుంది. ఇందులో భాగంగా కేసు దర్యాప్తులో న్యాయ సహాయాన్ని కోరుతూ భారత్‌లోని ఒక కోర్టు ద్వారా విదేశంలోని మరొక కోర్టుకు లెటర్స్ రొగేటరీ అనే విన్నపాన్ని పంపిస్తుంది.ఈ వ్యవహారం రెండు దేశాల కోర్టుల మధ్యే నడుస్తుంది. ఇక దర్యాప్తునకు సంబంధించిన కేసుల్లో సమాచారాన్ని, ఆధారాలను ఇచ్చి పుచ్చుకునేందుకు రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని మూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ (ఎంఎల్‌ఏటీ) అంటారు. – 2025-26లో వివిధ దేశాలకు మొత్తం 353లెటర్స్ రొగేటరీ, ఎంఎల్‌ఏటీ విన్నపాలను ఇడి పంపింది. వీటిలో అత్యధికంగా 69విన్నపాలు (19.6శాతం) యూఏఈలో పెండింగ్ దశలో ఉన్నాయి. సింగపుర్‌లో55, బ్రిటన్‌లో39, హాంకాంగ్‌లో36, అమెరికాలో26, స్విట్జర్లాండ్‌లో23, మారిషస్‌లో15 విన్నపాలు పెండింగ్‌లో ఉన్నాయి. 2025-26లో వివిధ దేశాల నుంచీ ఇడికి ఇలాంటి 246విన్నపాలు అందాయి. వీటిలో అత్యధికంగా 79విన్నపాలు (32.9శాతం) బ్రిటన్‌ నుంచి, సింగపుర్ నుంచి 33, అమెరికా నుంచి 32, ఫ్రాన్స్ నుంచి 7 విన్నపాలు అందాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -