Sunday, May 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమళ్లీ యుద్ధ మేఘాలు

మళ్లీ యుద్ధ మేఘాలు

- Advertisement -

టెహ్రాన్ : శ్చిమాసియాలో ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఓవైపు శ్వేతసౌధంలో ట్రంప్ మాట్లాడుతూ యుద్ధం ముగిసిందని ప్రకటింశ్చి వెంటనే అంత తోందరేముందంటూ మాట మార్చారు. దీంతో అమెరికాతో మళ్లీ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని ఇరాన్కు చెందిన ఓ సీనియర్ సైనికాధికారి శనివారం తెలిపారు. ఇరాన్ తాజాగా పంపిన చర్చల ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కొన్ని గంటలకే ఇరాన్ సైనికాధికారి నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. వాస్తవానికి ఇరాన్ గురువారం సాయంత్రం తన ముసాయిదా ప్రతిపాదనలను మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ కు అందజేసింది. అయితే అందులోని అంశాలను ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించలేదు.
ఈ నేపథ్యంలోనే, అమెరికాతో ఇరాన్ చేస్తున్న యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఖాటం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్దార్ అసదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ, అది అత్యంత బలహీనంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఎలాంటి ఒప్పందాలకు, నిబంధనలకు కట్టుబడి ఉండదని అసదీ విమర్శించారు.
‘అమెరికా అధికారుల చర్యలు, ప్రకటనలు కేవలం మీడియా ప్రచారం కోసమే. చమురు ధరలు పడిపోకుండా చూసుకోవడం సహా, తమకు తాము సృష్టించుకున్న గందరగోళం నుంచి బయట పడడమే వారి ప్రధాన లక్ష్యం. అమెరికన్ల నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడులనైనా, మూర్ఖపు చర్యలనైనా ఎదుర్కొనేందుకు మా సాయుధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి’ అని సర్దార్ అసదీ స్పష్టం చేశారు.
అమెరికా సైనిక స్థావరాలకు భారీ నష్టం!
గల్ఫ్ ప్రాంతంలోని వివిధ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు ఇరాన్ ఊహించని స్థాయిలో నష్టం కలిగించిందని సీఎన్ఎస్ పరిశోధనాత్మక నివేదిక వెల్లడించింది. కువైట్లోని క్యాంప్ బ్యూరింగ్లో ఒకప్పుడు అమెరికాకు చెందిన సైనిక కేంద్రం ఉండేది. ఇది గల్ఫ్లోనే అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం కావడం గమనార్హం. అయితే అది నేడు ఇరాన్ దెబ్బకు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల దాడిలో ఈ స్థావరం తీవ్రంగా దెబ్బతిన్నట్టు సీఎన్ఎన్ పేర్కొంది. అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ రక్షణ సామర్థ్యాలపై దాడులు చేస్తున్నప్పటికీ, ఇరాన్ దాదాపు ఎనిమిది దేశాల్లోని కనీసం 16 అమెరికా సైనిక స్థావరాలను, సైనిక వ్యవస్థలను ధ్వంసం చేసింది. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం, ఈ గల్ఫ్ ప్రాంతంలోని మెజారిటీ అమెరికా సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయి. వాటిలో కొన్ని పూర్తిగా ఉపయోగించలేని స్థితికి చేరుకున్నాయి.
ఇరాన్ ఆదాయానికి గండి
ఒమన్ గల్ఫ్, పరిసర సముద్ర మార్గాల్లో అమెరికా విధిస్తున్న ఆంక్షల వల్ల ఇరాన్ దాదాపు 4.8 బిలియన్ డాలర్ల మేర చమురు ఆదాయాన్ని కోల్పోయినట్టు యాక్సియోస్ వార్తా సంస్థ పేర్కొంది. పెంటగాన్ అంచనాల ప్రకారం, అమెరికా అమలు చేస్తున్న ఆపరేషన్ల వల్ల టెహ్రాన్పై ఆర్థిక ఒత్తిడి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా చమురు వాణిజ్యంపై అమెరికా ఆంక్షలు విధించడంతో ఇరాన్కు దక్కాల్సిన సుమారు 5 బిలియన్ డాలర్ల ఆదాయం నిలిచిపోయిందని రక్షణ శాఖ అంచనా వేస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నివేదిక వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇరాన్ కు టోల్ కడితే ఆంక్షలు విధిస్తాం
హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ టోల్ వసూలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా యూఎస్ ట్రెజరీ శాఖ కీలక హెచ్చరికలు చేసింది. ఇరాన్కు టోల్ చార్జీలు చెల్లించే షిప్పింగ్ సంస్థలపై ఆంక్షలు విధిస్తామని పేర్కొంది. అంతేకాదు ఇరాన్ సైన్యానికి మద్దతు ఇచ్చే వారిపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని స్పష్టం చేసింది.
ఫిబ్రవరి చివరిలో అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ మధ్య ప్రారంభమైన యుద్ధం, ఏప్రిల్ 8 నుంచి తాత్కాలికంగా నిలిచిపోయింది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదరడమే ఇందుకు కారణం. కానీ ఇరుదేశాల మధ్య ఇప్పటి వరకు శాంతి ఒప్పందం ఇంకా కుదరలేదు. పైగా ఇప్పుడు మళ్లీ యుద్ధం ప్రారంభమ్యయే సూచనలు కనిపిస్తుండడం గమనార్హం.
‘మేం సముద్ర దొంగల్లాంటి వాళ్లం
ఇరాన్‌కు రూ.45వేల కోట్లు నష్టం
ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి తీవ్రతరం : పెంటగాన్ అంచనా

తాము సముద్రపు దొంగల(పైరేట్స్) లాంటి వాళ్లమే అని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తాము ఒకరకంగా సముద్రపు దొంగల లాంటి వాళ్లమే కానీ, ఆటలు ఆడటం లేదని ఆయన తెలిపారు. కొన్ని రోజుల క్రితం గల్ఫ్ సముద్ర జలాల్లో ఒక నౌకను అమెరికా నౌకాదళం సీజ్ చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ శుక్రవారం రాత్రి ఫ్లోరిడాలో ఈ కామెంట్స్ చేశారు. ఓ నౌకను తాము సీజ్ చేసి అందులోని సరుకు, చమురును తీసుకున్నామని, అదొక లాభదాయక వ్యాపారమని చెప్పారు. ఇక తమ సైనిక ముట్టడి వల్ల ఇరాన్‌ ఇప్పటిదాకా దాదాపు రూ.45వేల కోట్ల (4.8 బిలియన్ డాలర్లు) చమురు ఆదాయాన్ని కోల్పోయిందని అమెరికా రక్షణ శాఖ వర్గాలు అంటున్నాయి. దీంతో ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి తీవ్రతరం అవుతోందని చెబుతున్నాయి.
ఇరాన్ వాణిజ్యానికి అంతరాయం
అమెరికా చేస్తున్న ముట్టడి వల్ల ఇరాన్‌కు జరుగుతున్న ఆర్థిక, వాణిజ్య నష్టంపై పెంటగాన్ అధికార వర్గాలు రూపొందించిన అంచనాల వివరాలతో ఓ అమెరికన్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం, అమెరికా నౌకాదళం ముట్టడి ఫలితంగా ఇరాన్ సముద్ర మార్గంలో వాణిజ్యాన్ని, చమురు ఎగుమతులను చేయలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ ముఖ్య అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ ముట్టడితో ముడిపడిన కీలక వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇటీవలి పెంటగాన్ తాత్కాలిక ప్రెస్ సెక్రెటరీ జోయెల్ వాల్డెజ్ చేసిన ప్రకటన వివరాలనూ ఇందులో ఆయన ప్రస్తావించారు.
ఇరాన్‌ను పాలిస్తున్న అగ్రనేతల వ్యవహార శైలి మురుగునీటి పైపులోని ఎలుకల్లా ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు. ‘వాళ్లు ఎలుకల్లా దాక్కొని ఉండబట్టే క్షేత్రస్థాయి వాస్తవాలను, బయటి ప్రపంచ పరిణామాలను తెలుసుకోలేక పోతున్నారు. అని పోస్ట్ చేశారు.
ఓడిపోయిన బాధలోనే ఇలాంటి మాటలు : ఇరాన్
అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ‘అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆయన బాస్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధంలో ఓడిపోయారని అందరికీ తెలుసు. యుద్ధంలో ఓడిపోయిన బాధలోనే మీరు ఇలాంటి స్వరంతో మాట్లాడుతున్నారు. గెలిచిన వాళ్లు ఇలా మాట్లాడరు. యుద్ధ క్షేత్రంతో పాటు సైబర్ విభాగంలోనూ అమెరికా ఓడిపోయింది. మూర్ఖుడా’ అని ఇరాన్ రాయబార కార్యాలయం వ్యాఖ్యలు చేసింది.
హార్ముజ్’పై ఉద్రిక్తతలు మరింత తీవ్రం
కొత్త నియమాలు ప్రకటించిన ఇరాన్

అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోవడంతో కఠిన నిర్ణయం
ప్రపంచ మార్కెట్లపై ప్రభావం
అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోవడంతో ఇరాన్ కఠిన నిర్ణయం తీసుకుంది. కీలక సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధిపై కొత్త నియమాలు అమలు చేస్తామని ప్రకటించింది. దీంతో హార్ముజ్ విషయంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. తాజా పరిణామం ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపనుందని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నౌకాదళం.. తమ తీర ప్రాంతం సుమారు 2000 కిలోమీటర్ల వరకు నియంత్రణను కట్టుదిట్టం చేస్తామని తెలిపింది. ఈ ప్రాంతాన్ని ‘ప్రాంతీయ భద్రత, అభివృద్ధికి కేంద్రం’గా మార్చుతామని ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇటు అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెస్సెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమలు చేస్తున్న నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. “ఫిబ్రవరి 27కు ముందు ఉన్నట్టుగా స్వేచ్ఛాయుత నావిగేషన్‌ను పునరుద్ధరించేంతవరకు ఈ చర్యలు ఆగవు” అని ఆయన స్పష్టం చేశారు.
నౌకలపై టోల్ వివాదం
ప్రస్తుతం ఈ సముద్రమార్గం గుండా వెళ్లే నౌకలను ఐఆర్‌జీసీ స్పీడ్ బోట్లు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. దీంతో నౌకలు ఇరాన్ జలాల్లో ప్రయాణించాల్సి రావడంతో ప్రతి నౌకపై సుమారు 2 మిలియన్ డాలర్ల వరకు టోల్ రూపంలో వసూలు చేస్తున్నట్టు పలు నివేదికలు వెల్లడించాయి. ఈ మార్గంపై తన సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని అమెరికాను ఇరాన్ డిమాండ్ చేస్తోంది.

యుద్ధం ముసుగులో దందా
పశ్చిమాసియా దేశాలకు అమెరికా భారీగా ఆయుధాల విక్రయం
వైట్ హౌస్ వేదికగా రూ. 81 వేలకోట్ల డీల్స్

అమెరికా అధ్యక్షుడే వ్యాపారవేత్త అయితే.. దీనికి తోడు యూఎస్ రక్షణశాఖ కార్యదర్శి హెగ్సెత్ కూడా మధ్యవర్తిగా మారితే ఏం జరుగుతుందో.. వైట్ హౌస్ కేంద్రంగా యుద్ధ వ్యాపారానికి తెరలేచింది. దీనికి సంబంధించిన కథనాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. రెండు నెలలపాటు జరిగిన ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదంలో ఖజానా నింపుకు న్నాయి. ఇరాన్‌ తో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ ఇజ్రాయిల్‌ సహా పశ్చిమాసియా దేశాలకు భారీగా ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధమైంది. ఓవైపు కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుండగానే ఇది చోటుచేసుకోవడం గమనార్హం.
ఇజ్రాయిల్‌, కువైట్‌, ఖతార్‌, యూఏఈ వంటి మిత్ర దేశాలకు దాదాపు 8.6 బిలియన్‌ డాలర్లకు పైగా (భారత కరెన్సీలో రూ.81 వేల కోట్లకు పైగా) విలువైన సైనిక ఆయుధాల విక్రయానికి యూఎస్‌ విదేశాంగశాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో అనేక అధునాతన సైనిక పరికరాలు ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇందులో ఖతార్‌ 4 బిలియన్‌ డాలర్ల విలువైన పేట్రియాట్‌ వాయు, క్షిపణి రక్షణ వ్యవస్థలతో పాటు అత్యంత కచ్చితత్వంతో కూడిన లక్ష్యాలను ఛేదించగల ఆయుధ వ్యవస్థలను అందుకోనుంది. కాగా.. కువైట్‌ కు సుమారు 2.5 బిలియన్‌ డాలర్ల ఆయుధాలు వెళ్లనున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయిల్‌, యూఏఈలకు గైడెడ్‌ రాకెట్‌ లాంఛర్లను యూఎస్‌ విక్రయించనుంది. సాధారణంగా ఆయుధ విక్రయాలను అమెరికా కాంగ్రెస్‌ రివ్యూ చేస్తుంటుంది. అయితే, ట్రంప్‌ యంత్రాంగం అత్యవసర అధికారాలను ఉపయోగించి, త్వరగా ఈ విక్రయాలు జరపాలని నిర్ణయించింది. ఈ చర్యను యూఎస్‌ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమర్థించుకున్నారు.

క్యూబా వైపు ట్రంప్ చూపు
ఇరాన్ యుద్ధంలో చేతులెత్తెసిన ట్రంప్.. ఇపుడు క్యూబా వైపు చూస్తున్నట్టు లీకులు వస్తున్నాయి. హవానా వైపు యూఎస్ యుద్ధ నౌక అబ్రహం లింకన్ ను క్యూబా సరిహద్దుల వైపు తరలిస్తున్నారు. ఇక జర్మనీలోని యూఎస్ భద్రతా బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.

ఆహారంపైనా యుద్ధమిది..
ఎరువుల సంక్షోభంతో ప్రపంచం అతలాకుతలం
ప్రమాదంలో వెయ్యి కోట్ల భోజనాలు

హార్ముజ్ జలసంధి మూతపడటంతో చమురే కాకుండా ఎరువుల సరఫరాపైనా పెను ప్రభావం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎరువుల వ్యాపారంలో (యూరియా, పొటాష్, అమ్మోనియా, ఫాస్పేట్‌) మూడింట ఒక వంతు ఈ మార్గం నుంచే జరుగుతోంది. ఇప్పుడు ఈ మార్గం మూసుకు పోవడంతో రానున్న రోజుల్లో ఆహార ఉత్పత్తి గణనీయంగా పడిపోనుందన్న ఆందోళనలు వ్యక్తమ వుతున్నాయి. ఇరాన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎరువుల ధరలు 80 శాతం వరకు పెరిగాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులిలానే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రపంచ ఆహార భద్రతకు పెనుముప్పు వాటిల్లే అవకాశాలున్నాయి. తత్ఫలితంగా వారానికి దాదాపు 1000 కోట్ల భోజనాల(మీల్స్‌)కు ముప్పు తప్పదని, నిరుపేద దేశాలకు ఇది శరాఘాతమేనని ప్రపంచ ప్రఖ్యాత ఎరువుల కంపెనీల అధిపతుల్లో ఒకరైన స్వీన్‌ టోర్‌ హల్‌సెథర్‌ హెచ్చరిస్తున్నారు. ఎరువుల రవాణాను ఆపేయడమంటే ఒకరకంగా ఆహారంపై యుద్ధం ప్రకటించడమేనని, ధనిక, పేదల మధ్య మరింత అంతరాన్ని పెంచడమేనని ‘యారా’ ఎరువుల కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అయిన స్వీన్‌ అభిప్రాయపడ్డారు. సంపన్న దేశాల్లోనూ ఆహార ధరలు మండిపోవచ్చునని ఆయన చెప్పారు.
ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దాదాపు 5 లక్షల టన్నుల నత్రజని ఎరువును ఉత్పత్తి చేయలేకపోతున్నామని స్వీన్‌ వివరించారు. నత్రజని వేయకపోతే పంటకాలం తొలిసీజన్‌లో దాదాపు 50 శాతం దిగుబడి తగ్గిపోతుందని విశ్లేషించారు. ఆసియా, ఆగ్నేయాసియా, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా దేశాలు దీనివల్ల తీవ్రంగా నష్టపోతాయని చెప్పారు. వారానికి వెయ్యికోట్ల భోజనాల్ని ఉత్పత్తిచేయలేకపోతే పేద దేశాల్లో ఆహార సంక్షోభం తప్పదన్నారు. ఎరువులు ఎక్కువగా నిల్వచేసుకున్న దేశాలకు తాత్కాలికంగా ఉపశమనం కలిగినా.. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే వాటికీ ముప్పు తప్పదని సింగపుర్‌లో ఆహార భద్రత సీనియర్‌ పరిశోధకులు ప్రొఫెసర్‌ పాల్‌ తేంగ్‌ అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -