- మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-హైదరాబాద్: కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాలు ఖచ్చితంగా కొనసాగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కోర్టులో సమర్థవంతంగా పోరాడి, ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన మీడియా సమావేశంలో అన్నారు. కల్యాణ లక్ష్మి విషయంలో నాలుగైదు సార్లు అవకాశం ఇచ్చినా కౌంటర్ ఫైల్ చేయకపోవడానికి గల కారణం న్యాయవాదుల తప్పా, అధికారుల తప్పా తెలిసిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో బీఆర్ ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు.
కాగా, కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కోర్టు ఆదేశాలతో ఈ స్కీమ్ నగదు పంపణీ నిలిచిపోయింది. అయితే ప్రతిపక్ష బీఆర్ ఎస్ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ పథకాల అమలు విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వహిస్తోందని ఆయన ఆరోపించారు. హైకోర్టును సాకుగా చూపుతూ లక్షలాది నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించకుండా ఈ పథకాలను కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా ఎత్తివేస్తున్నదని బీఆర్ ఎస్ ఆరోపించింది.



