నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ బయట బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. అదే ఉద్రిక్త నడుమ ఉదయం 10 గంటల అసెంబ్లీ సెషన్స్ మొదలయ్యాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభించారు. అంతలోనే బీజేపీ సభ్యులు ఆందోళన ప్రారంభించారు. 22ఏ పై వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబు కలగజేసుకుని ప్రభుత్వం దీనిపై కచ్చితంగా చర్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. దయచేసి సభకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. బీఏసీలో నిర్ణయించాక చర్చిస్తామని స్పీకర్ చెప్పినా.. వినకుండా పోడియం వద్ద బైఠాయించారు. వారిచేతిలో ఉన్న ప్లకార్డులను మార్షల్స్ కు ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు. కాగా.. ఈ సమావేశాల్లో 21 ఏళ్లకే రాజకీయాల్లోకి ఎంట్రీపై ప్రభుత్వం తీర్మానం చేస్తుందా లేదా? అన్నదానిపై అందరి ఆసక్తి నెలకొంది.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు.. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సెంట్రల్ హాల్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్పీకర్, మండలి ఛైర్మన్ హాజరయ్యారు. ఈ సెంట్రల్ హాల్ కు మాజీ స్పీకర్, దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టారు.



