“పట్టుదలకి ప్రతిఫలం – విద్యార్థులకు ఘన సన్మానం”
గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-మక్తల్
మక్తల్ మండలంలోని మాధ్వార్ గ్రామంలో విద్యా ప్రాధాన్యతను ప్రతిబింబించే విధంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో SSC మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఘనంగా అభినందన సన్మాన సభ నిర్వహించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో విజయాన్ని సాధించిన సుమారు 50 మంది విద్యార్థులను శాలువాలతో సత్కరించి, ప్రోత్సాహకంగా రామకృష్ణ మఠం వారు ప్రచురించిన “మేలుకో నేస్తమా” అనే పుస్తకాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు శివశంకర్ మాట్లాడుతూ, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్ కెరీర్‌పై సమగ్ర మార్గదర్శకత్వం అందించారు. SSC, ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న వివిధ కోర్సులపై అవగాహన కల్పిస్తూ, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి అవసరమైన నైతిక విలువలు, మంచి అలవాట్లు, సానుకూల దృక్పథం, మంచి స్నేహితుల ప్రాధాన్యతను వివరించారు.
లక్ష్య సాధనకు ఆత్మవిశ్వాసం ముఖ్యమని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా కవి కాళోజీ నారాయణరావు గారి “పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంత దేశానిదే” అనే స్ఫూర్తిదాయకమైన మాటలను గుర్తు చేస్తూ, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులను ప్రేరేపించారు.గ్రామ పెద్దలు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షిస్తూ, ఉన్నత విద్య కోసం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అంబేద్కర్ సంఘం నాయకులు మరియు లతారాజా ఫౌండేషన్ వరి“డా. అంబేద్కర్ ఎవరు? ఆయన ఏం చేశారు? భారత భాగ్య విధాత బాబాసాహెబ్ జీవితం – కార్యాచరణ” అనే పుస్తకాన్ని విద్యార్థులకు బహుమతిగా అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ రిటైర్డ్ హెచ్ఎం జగదీష్ కుమార్, జంగం బసవరాజ్, పాఠశాల హెచ్ఎం వెంకట్రాములు, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ఉప సర్పంచ్ శివాని,డాక్టర్ ఆశప్ప, బాట నరసింహ గణపురం నగేష్, కురువ మల్లేష్, బాట జయమ్మ, గుడిసె తిమ్మయ్య, గాల్ల రాములు, బిచ్చలి బ్యాంకు నరసింహ, పంచాయతీ కార్యదర్శి నస్లాయి తిమ్మయ్య నస్లాయి, నాగరాజు, ఆర్ఎంపీ రామకృష్ణ, శివపుల్ల లక్ష్మయ్య, వడ్ల భాను ప్రసాద్, బుడబోయి చంద్రప్ప, పోలీస్ లక్ష్మారెడ్డి గుడిసె రాజు, బాట రాజు,బాట బీమాప్ప, జంగం నరసింహులు తదితరులు, గ్రామ యువకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



