జీవో 7 అందుకోసమే..
14 లక్షల మంది విద్యార్థులకు వెన్నుపోటు
వైఎస్ పథకాలకూ పాతరేస్తున్న సర్కారు
విద్యార్థిలోకం గర్జిస్తే మంత్రులు రోడ్లపై తిరగరు
రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రేండున్నరేండ్ల కాంగ్రెస్ అసమర్థ పాలనలో ఇప్పటికే విద్యావ్యవస్థను కుప్పకూలిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. ఇప్పుడు ఏకంగా ఉన్నత చదువులకు నిరుపేదలను పూర్తిగా దూరం చేసేలా విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తారా?అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు కొండంత అండగా నిలిచే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేసే కుట్ర భయంకరమైనదని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ ఏడును తెచ్చిందని విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆదివారం లేఖ రాశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పాతరేసేందుకు చేస్తున్న కుటిల ఎత్తుగడ అని తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందని పేర్కొన్నారు. ఈ జీఓ వచ్చిన క్షణం నుంచి విద్యార్థులకే కాదు, లక్షలాది మంది నిరుపేద తల్లిదండ్రులకు కూడా కంటి మీద కునుకు కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖను విధ్వంసం చేసేందుకే ఆ శాఖను పర్యవేక్షిస్తున్నారా?అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ స్కీంలనే కాకుండా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలనూ పాతరేస్తారా?అని అడిగారు. ఓవైపు గురుకులాలను దెబ్బతీసి ఉన్నత విద్యకూ ఉరివేస్తారా?అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దుర్మార్గమైన జీవో నెంబర్ ఏడును వెంటనే వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో ఉన్న 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేద విద్యార్థులతో దండుకట్టి కాంగ్రెస్ సర్కారుపై సమరశంఖం పూరిస్తామని తెలిపారు. ఇప్పటికే అన్నదాతల ఆందోళనలతో అట్టుడుకుతున్న రాష్ట్రంలో దగాపడ్డ విద్యార్థులు గర్జిస్తే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, మంత్రులు రోడ్లపై తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దుకు కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



