Sunday, July 5, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం

- Advertisement -

100 రోజుల్లో 185 కేసులు
121 టన్నుల కల్తీ ఆహార పదార్థాల స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో

తినే అన్నంలో కల్తీలు.. తాగే పాలలో రసాయనాలు.. చివరకు పసిబిడ్డలకు పట్టే పాలపొడిలోనూ ప్రాణాంతక పదార్థాలు! కేవలం లాభార్జనే పరమావధిగా సాగుతున్న నిశ్శబ్ద ముప్పుపై హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ ఉక్కుపాదం మోపుతోంది. ప్రజారోగ్యాన్ని నిలువునా దెబ్బతీస్తూ నగరవాసుల ఆయుష్షును హరిస్తున్న కల్తీ ముఠాల ఆటకట్టించేందుకు రంగంలోకి దిగిన హైదరాబాద్‌ ఫుడ్‌ అడల్టరేషన్‌ సర్వైలెన్స్ టీమ్‌ (హెచ్-ఫాస్ట్) ఏర్పాటై 100 రోజులను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మార్చి 19న శంఖారావం పూరించిన ఈ ప్రత్యేక విభాగం జీహెచ్‌ఎంసీ, ఫుడ్‌ సేఫ్టీ, వెటర్నరీ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతర దాడులు, ఆకస్మిక తనిఖీలతో నగరంలో ఆహార కల్తీపై రాజీలేని సమరం సాగిస్తోంది.

​ఆరోగ్యానికి గొడ్డలిపెట్టు.. ఆహార కల్తీ​
ఆహార కల్తీ అనేది కేవలం ఒక చట్టపరమైన నేరమో, వ్యాపార మోసమో కాదు.. అది యావత్ సమాజంపై జరుగుతున్న నిశ్శబ్ద దాడి. రసాయనాలు, నాణ్యత లేని నిల్వ పదార్థాల వాడకం వల్ల పసిబిడ్డల ఎదుగుదల దెబ్బతింటోంది. యువత, వృద్ధులు క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులు, గుండె జబ్బుల బారిన పడుతున్నారు.

​వంద రోజుల సమరంలో విస్తుపోయే నిజాలు
టాస్క్ ఫోర్స్ డీసీపీ నేతృత్వంలో 36 మంది అధికారులు, సిబ్బందితో హెచ్‌-ఫాస్ట్‌ విభాగం వంద రోజుల్లో నగరవ్యాప్తంగా వివిధ జోన్ల పరిధిలో మొత్తం 185 కేసులు నమోదు చేసింది. సుమారు 121.87 టన్నుల ప్రమాదకరమైన కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. జోన్ల వారీగా వివరాలు పరిశీలిస్తే అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్‌లో 55 కేసులు నమోదు కాగా, గోల్కొండ జోన్‌లో 44, సికింద్రాబాద్ జోన్‌లో 35, చార్మినార్ జోన్‌లో 21, శంషాబాద్ జోన్‌లో 13, జూబ్లీహిల్స్ జోన్‌లో 12, ఖైరతాబాద్ జోన్‌లో 5 కేసులు నమోదయ్యాయి. నిత్యం వాడే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌కు సంబంధించి 27 కేసుల్లో ఏకంగా 27,024.7 కేజీల నకిలీ నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. కృత్రిమ రసాయనాలతో పండ్లను మగ్గబెట్టే 16 ముఠాల గుట్టురట్టు చేసి 25,845 కేజీల పండ్లను సీజ్ చేశారు. చికెన్ వ్యర్థాల విక్రయాలకు సంబంధించిన 6 కేసుల్లో ఏకంగా 60 టన్నుల కంటే ఎక్కువ చికెన్‌ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. వీటితో వందల కేజీల్లో పచ్చళ్లు, కల్తీ కోవా, నకిలీ టీ పొడి, నాణ్యత లేని చికెన్/మాంసంతోపాటు డ్రై ఫ్రూట్స్/ఖర్జూరం, కల్తీ పాలు, పెరుగు గుట్టుచప్పుడు కాకుండా వందల కిలోల జంక్‌ ‌ఫుడ్స్‌‌ను మార్కెట్‌‌లో సరఫరా చేస్తున్నారు. పోలీసు చర్యలతో పాటు జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్(ఎఫ్ఎస్ఓ)కు తదుపరి చర్యల నిమిత్తం 247 కేసులు అప్పగించారు. మల్కాజిరిగి మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, వాటి వంట గదులు కల్తీ, నాసీరకం పదార్ధాలతో నిండి ఉన్నాయి. ఇటీవల ఎంఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కార్పొరేషన్ పరిధిలోని ప్రముఖ హోటళ్లపై జరుపుతున్న వరుస తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక హోటల్‌‌కు జరిమానా, మరో హోటల్‌‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

​వ్యాపారులకు స్పష్టమైన ఆదేశాలు
కల్తీ నియంత్రణతో పాటు నివారణ చర్యలపై కూడా పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, తదితర తయారీ కేంద్రాలకు చెందిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వ్యాపారం పేరిట ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే పద్ధతులను ఏమాత్రం సహించబోమని హైదరాబాద్‌ ‌సీపీ వీసీ సజ్జనార్‌ ‌హెచ్చరించారు. ప్రత్య‌క్షంగా కానీ, ప‌రోక్షంగా గానీ ఫుడ్ బిజినెస్ తో సంబంధం ఉన్న ప్ర‌తీ ఒక్క‌రు విధిగా పాటించాల‌ని స్ప‌ష్టం చేశారు. హెచ్-ఫాస్ట్ ప్రారంభించిన తక్కువ రోజుల్లోనే ఈ విభాగం సిబ్బంది క్షేత్రస్థాయిలో అత్యంత సమర్థవంతంగా పనిచేసి ఆశించిన ఫలితాలను సాధించడం అభినందనీయమని సీపీ అన్నారు. జీహెచ్‌ఎంసీ, ఫుడ్‌ సేఫ్టీ, వెటర్నరీ విభాగాల స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తూ ఈ బృందం దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని, ఆహార కల్తీ నియంత్రణకు హెచ్-ఫాస్ట్ కు సహకరిస్తోన్న ఆయా ప్రభుత్వ విభాగాల అధికారులకు, ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆహార కల్తీ మహమ్మారిని అరికట్ట డంలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పిలుపునిచ్చారు. ఆహార పదార్థాల కల్తీ జరుగుతున్నట్టు తెలిస్తే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ నంబర్ 8712661212కు వాట్సాప్, ఫోన్ ద్వారా సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

విభాగాల సమన్వయంతోనే కల్తీకి చెక్!
ఆహార కల్తీ నివారణ అనేది కేవలం ఒకే విభాగానికి పరిమితమైన అంశం కాదని, బహుళ ప్రభుత్వ విభాగాల ఉమ్మడి బాధ్యత అని పోలీసులు తెలిపారు. అందుకే హెచ్‌-ఫాస్ట్‌ విభాగం, జీహెచ్‌ఎంసీ, ఫుడ్‌ సేఫ్టీ, వెటర్నరీ విభాగాల అధికా రులతో సంపూర్ణ సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -