Tuesday, May 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజూన్‌ 1 నుంచిఇంటర్‌ క్లాసులు

జూన్‌ 1 నుంచిఇంటర్‌ క్లాసులు

- Advertisement -

ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

2026-27 విద్యా సంవత్సరానికిగా నూ జూన్‌ 1నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభం కానున్నట్టు తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి తెలిపింది. ఈ మేరకు సోమవారం విద్యామండలి కార్యదర్శి అభిలాష అభినవ్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగంలోని ఇంటర్మీడియట్‌ విద్యను అందిస్తున్న అన్ని కళాశాలలు విధిగా జూన్‌ 1 నుంచి తరగతులను ప్రారంభిస్తున్నట్టు ఆమె తెలిపారు. మొదటి దశలో ఆయా కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ మే 8న ప్రారంభమై మే 31న దరఖాస్తులకు గడువు ముగుస్తుందని స్పష్టం చేశారు. జూన్‌ 30 నాటికి మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తుందనీ, ఇంటర్నెట్‌ నుంచి తీసుకున్న ఎస్సెస్సీ మార్కుల మెమో ఆధారంగా తాత్కాలిక అడ్మిషన్లు ఇవ్వొచ్చని తెలిపారు. అయితే ఒరిజినల్‌ ఎస్సెస్సీ పాస్‌ సర్టిఫికెట్‌ , టీసీ స్కూల్‌ నుంచి తెచ్చి ఇస్తేనే అడ్మిషన్‌ను ఖరారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సామాజిక తరగతుల వారీగా ఆయా వర్గాల విద్యార్థులకు రిజర్వేషన్లు ప్రభుత్వ నిబంధనల మేరకు అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. బాలికల కోసం ప్రత్యేకంగా కళాశాలలు లేని చోట మొత్తం సీట్లలో వారికి మూడింట ఒక వంతు సీట్లు ప్రతి క్యాటగిరీలో రిజర్వేషన్‌ అమలు చేయాలని సూచించారు. కాలేజీలు ప్రత్యేకంగా ఎస్సెస్సీలో వచ్చిన జీపీఏ, సబ్జెక్ట్‌ వైజ్‌ గ్రేడ్‌ పాయింట్‌ ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని, విద్యార్థి ఆధార్‌ నెంబర్‌ నమోదు తప్పనిసరి అని, ఒక్కో సెక్షన్‌ లో 88 మందిని మంచి తీసుకోవద్దని తెలిపారు. అదే విధంగా బోర్డు రద్దు చేసిన కాంబినేషన్లలో అడ్మిషన్లు ఇవ్వకూడదని, అదనపు సెక్షన్లు కావాలంటే బోర్డు అనుమతి తప్పనిసరని, ఉల్లంఘిస్తే జరిమానా విధింపుతో పాటు అనుబంధ గుర్తింపును రద్దు చేస్తారని తెలిపారు. ప్రతి రోజు సెక్షన్ల వారీగా, భర్తీ అయిన సీట్ల వివరాలను అప్‌ లోడ్‌ చేయాలని వివరించారు. ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నిర్వహించడానికి వీల్లేదని, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు ప్రలోభ పెట్టే ప్రకటనలు ఇస్తే చర్యలు తప్పవని, విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరే ముందు దాని అనుబంధ గుర్తింపును తనిఖీ చేసుకోవాలని కార్యదర్శి సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -