నిమిషాల్లో 2 వేల బస్తాలు క్లోజ్..
ఆగ్రహంతో రోడ్డెక్కిన అన్నదాతలు
ఆన్‌లైన్ బుకింగ్ తీరుపై మండిపాటు
స్మార్ట్‌ఫోన్ లేని రైతులకు తీవ్ర ఇబ్బందులు
నవతెలంగాణ-రామాయంపేట
నిమిషాల వ్యవధిలోనే 2 వేల బస్తాల యూరియా క్లోజ్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు రామాయంపేట-మెదక్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. యూరియా కోసం కష్టాలు పడుతున్న రైతులు రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం ఆందోళనకు దిగారు. యాప్‌లో యూరియా బుక్ అవ్వకపోవడంతో, రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పంటలకు కీలకమైన సమయంలో ఎరువులు అందక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట అదును తప్పిన తర్వాత యూరియా చల్లితే ఆశించిన ఫలితం ఉండదని, సమయానికి ఎరువులు అందకపోవడంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. యూరియా నిల్వలు వచ్చిన విషయాన్ని అధికారులు రైతులకు సమాచారం ఇచ్చేలోపే ఆన్‌లైన్ బుకింగ్ పూర్తవుతోందని రైతులు మండిపడ్డారు. రెండు, మూడు మండలాలకు సంబంధించిన యూరియా నిల్వలను ఒకేసారి యాప్‌లో చూపిస్తుండటంతో ఇతర ప్రాంతాల రైతులతో పోటీ పడాల్సి వస్తోందని, దీంతో రామాయంపేట మండల రైతులకు యూరియా దక్కకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోకాలంగా యూరియా కోసం ఎదురుచూస్తున్నా తమకు ఒక్క బస్తా కూడా అందడం లేదని పలువురు వాపోయారు. మండలంలోని ఇతర గ్రామాలతో పోలిస్తే తమ ప్రాంతంపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. ఆన్‌లైన్ బుకింగ్ విధానం వల్ల స్మార్ట్‌ఫోన్ లేని రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు వదిలి యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని రైతులు తెలిపారు. యూరియా సమస్యతో వ్యవసాయం చేయడమే భారంగా మారిందని తెలిపారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి స్థానిక రైతులకు సరిపడా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. యూరియా కొరత ఇలాగే కొనసాగితే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.
రామాయంపేట-మెదక్ రహదారిపై రాస్తారోకో
యూరియా సమస్యతో రైతులు రామాయంపేట-మెదక్ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో రహదారిపై ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రైతులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు. వెంటనే అధికారులు స్పందించి యూరియా సరఫరా సమస్యను పరిష్కరించాలని, లేకపోతే తమ పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
యూరియా కోసం రైతుల రాస్తారోకో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


