వారితో లోపాయికారి ఒప్పందంతోనే.. బీఆర్‌ఎస్‌ను బలహీనపరిచేలా నిరాధర ఆరోపణలు
కేసీఆర్‌కు కష్టకాలంలో అండగా ఉంటున్నది మేమే..
ఎంపీగా ఓడినా.. రెండుసార్లు ఎమ్మెల్సీ అయ్యేందుకు
కృషి చేశా : బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
పార్టీలోకి మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయారంటూ కవితపై విమర్శ
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/భీంగల్
కాంగ్రెస్ నాయకులను కలిసి మంతనాలు జరిపిన తర్వాతే.. బీఆర్‌ఎస్‌ను బలహీన పరిచేలా కవిత నిరాధర అరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను, కవితను కలిపేందుకు తాను ఎంత ప్రయత్నం చేశానన్నది కేసీఆర్‌కు తెలుసని.. పార్టీ లైన్ దాటిన తర్వాతే కవితపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ను పార్టీ శ్రేణులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌కు (అప్పటి టీఆర్‌ఎస్) తన తండ్రి సురేందర్‌రెడ్డితో పాటు తాను వ్యవస్థాపక సభ్యుడినని, పార్టీ ఏర్పాటు 2001 కంటే ముందు నుంచే ఉన్నామని తెలిపారు. కవిత మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయిందన్నారు. ప్రస్తుతం కష్టకాలంలో కేసీఆర్‌కు అండగా ఉంది తానా.. కవితనా.. అని ప్రశ్నించారు. అసెంబ్లీ లోపల, బయట, జిల్లాలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 33 నెలలుగా పోరాటం చేస్తుంది కవితనా.. తానా.. అనేది అందరికీ తెలుసన్నారు. ఈ రోజు లక్ష్మినర్సింహస్వామి సన్నిధిలో ఉన్నానని, కాంగ్రెస్‌లో చేరేందుకు మంతనాలు జరపలేదని, జరపబోనని దేవుని సాక్షిగా చెబుతున్నానని, కవిత రహస్యంగా కాంగ్రెస్ వారిని కలిసింది చెప్పగలరా.. అని సవాల్ విసిరారు. నిరాధరమైన ఆరోపణలు చేసి తమ లాభం కోసం ఎదుటివారి ఎజెండాను అమలు చేసి ఒక వ్యక్తి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం మంచిది కాదని తెలిపారు. కేసీఆర్‌కు దగ్గరగా ఎవరైతే ఉంటారో, బీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యులు ఎవరైతే ఉన్నారో నిరంజన్‌రెడ్డి కావొచ్చు, జగదీశ్వర్‌రెడ్డి, నాతో పాటు మిగతా వారిని, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి తద్వారా తమ నాయకత్వాన్ని బలహీనపరిచి పరోక్షంగా అధికార పార్టీకి లాభం చేస్తున్నారని విమర్శించారు.
కండ్ల నీళ్లు పెట్టుకోవడం సింపతి పొందేందుకా, రాజకీయం కోసమా అన్నది ఆమె వ్యక్తిగతమని ఎమ్మెల్యే అన్నారు. వీటన్నింటివల్ల కేసీఆర్ ఎంత బాధపడుతున్నారో కవిత ఆలోచించకపోవడం బాధాకరమన్నారు. ఆమె సొంత లాభం కోసం.. కన్నతండ్రి కేసీఆర్‌ను, సొంత అన్న కేటీఆర్‌ను .. తన మీద కవిత వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలగలేదని తెలిపారు. కానీ బాధగా ఉందని, ఆమెతో కలిసి పని చేశామని, ఆమె ఎంపీగా ఓడినా.. రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడంలో తన పాత్ర ఏంటో కేసీఆర్‌కు తెలుసని అన్నారు. కేసీఆర్ బిడ్డగా సమాజంలో ఉన్న కొద్దోగొప్పో మర్యాదను.. నిన్నటి సభతో కోల్పోయారని అన్నారు. ‘వెంటపడి ఓడిస్తా..’ అంటే ఆమె ఎవరికోసం పని చేస్తున్నారనేది అర్థమవుతుందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌ను తిట్టని రోజు, నామస్మరణ చేయని రోజు ఎప్ప్పుడైనా ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ డైరక్షన్‌లో కేటీఆర్ ఆధ్వర్యంలోనే పోరాటాలు చేస్తున్నామని, తమ పోరాటాలకు కేసీఆర్ మేధస్సే కారణమని, ఆయన ప్రతిపక్ష పాత్రను సరిగ్గా నిర్వర్తిస్తున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్‌కు కవిత పరోక్ష సహకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



