నవతెలంగాణ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఈదురుగాలుల కారణంగా గోడ కూలి నలుగురు రైతులు మృతిచెందగా, మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పంటను కాపాడేందుకు రైతులు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది.
కరీంనగర్ జిల్లా గంపల పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పంటను కాపాడేందుకు వెళ్లిన యువ రైతు తునుగుల అభిరామ్ (22) ఈదురుగాలులకు రేకుల షేడ్ కూలి మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు మహిళలు, ఓ ఉపాధి కూలీ మృతిచెందారు. గత కొన్నిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పలు ప్రాంతాల్లో రైతులకు పాడి, పంట నష్టం జరిగింది.



