వరి వంగడాల పేర్లు సూచిస్తూ వ్యవసాయ శాఖ ప్రచారం
కొన్ని రకాలనే సూచించడంతో రైతులు అయోమయం
నవతెలంగాణ – మల్హర్ రావు
వానకాలంలో సాగు చేసే సన్న రకాల వరిలో తాము సూచించే ఎనిమిది రకాలనే సాగు చేయండి. బోనస్ పొందండి అంటూ వ్యవసాయ శాఖ విస్తృత ప్రచారం చేపట్టింది. సన్నాలలో ఎన్నో రకాలు ఉండగా కేవలం ఎనిమిది రకాలనే ప్రమోషన్ చేస్తూ ప్రచారం చేస్తుండటంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. సన్న రకాలను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ గా చెల్లిస్తున్న విషయం విదితమే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వానకాలం సీజన్లో కొనుగోలు చేసిన సన్న రకాలకు బోనస్ ను అందించారు. మొదట్లో సన్నాల్లో ఏ రకం సాగు చేసి విక్రయించినా తేడా చూపకుండానే ప్రభుత్వం బోనస్ ను అందించింది. 2026 వానకాలం సీజన్ కు సంబంధించి మాత్రం 8 రకాలనే ప్రమోషన్ చేయాలని నిర్ణయించడం రైతులను అయోమయానికి గురిచేస్తోంది. ఒక వేళ ప్రభుత్వం సూచించిన 8 రకాలనే సాగు చేయాలంటే విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయా అనే సంశయం నెలకొంది.
సన్నాలలో ఎన్నో రకాలు ఉండగా రోగాల బారిన పడని, తక్కువ వ్యవధిలో పంట చేతికి వచ్చేవి, కలుపు ఇబ్బందులు లేని రకాలను సాగు చేయడా నికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సూచించిన రకాలలో కొన్నింటికి దిగుబడి ఆశించినంతగా రాదని రైతులు చెబుతున్నారు. అలాగే రోగాల బారిన పడే రకాలు ఉన్నాయని తెలిపారు. ప్రమోషన్ చేయాలని సూచించిన 8 రకాల కంటే ఎంతో నాణ్యమైన విత్తనాలు మార్కెట్లో ఉన్నాయని రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సన్న రకాలకు బోనస్ అనే హామీకి ప్రభుత్వం కట్టుబడి రైతులు కోరుతున్నారు.
వ్యవసాయశాఖ సూచించిన వరి రకాలు…
రకం.. పంటకాలం
1, బిపిటి 5204 (సోనామసూరు)…140-150.
2, తెలంగాణ సోన (ఆర్ఎన్ఆర్ 15048)…120-125.
3, కెఎన్ఎం 1638….120-125.
4, జైశ్రీరామ్.. 130-135.
5, హెచ్ఎంటి (సోన).. 135-145.
6, డబ్యుజిఎల్ 962.. 125-130.
7, డబ్యుజిఎల్- 44 (సిద్ధి)..140-145
8, జెజిఏల్ 1798..120-125.
అన్ని రకాలకు బోనస్ వర్తింప చేయాలి: అక్కల బాపు..రైతు కార్మిక సంఘం నాయకుడు
అన్ని రకాల సన్నా లకు బోనస్ను వర్తింప చేయాలి. ప్రభుత్వం కొన్ని రకాలకే బోనస్ ఇస్తామ ల్ని చెప్పడం సరికాదు. రైతులు తమకు అందుబాటులో ఉన్న సన్న రకాల విత్తనాలనే కొనుగోలు చేస్తారు. ఎన్నో రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.కొన్నింటినే ప్రమోషన్ చేయడం మంచిదికాదు. రైతుల సహనం పరీక్షించవద్దు.



