నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలో బుధవారం తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు అసెంబ్లీ ముందు చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి తరలివెళ్తున్న సర్పంచులను పోలీసులు అరెస్టు చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అసెంబ్లీ ముందు నిరసన తెలపాలని సర్పంచుల సంఘం పిలుపునిచ్చిన నేపథ్యంలో సర్పంచులు హైదరాబాద్ తరలి వెళ్తుండగా, ఎస్సై ఉదయ్ కిరణ్ నేతృత్వంలో పోలీసులు వారిని మార్గమధ్యలో అడ్డుకుని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా జిల్లా జేఏసీ అధ్యక్షులు, టంగుటూరు సర్పంచ్ జూకంటి అనిల్ మాట్లాడుతూ..తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, సర్పంచులకు తగిన గౌరవం ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీ ముందు నిరసనకు వెళ్తుంటే అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని ఆరోపించారు. వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ పురం సర్పంచ్ వడ్ల శోభన్ బాబు, కొలనుపాక సర్పంచ్ యాకమ్మ వెంకటేష్, రాఘపురం సర్పంచ్ పరిదే మమత సంతోష్, గుండ్లగూడెం సర్పంచ్ ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి, శల్పనాపురం సర్పంచ్ మొగులుగాని నరసయ్య తదితరులు పాల్గొన్నారు.



