నవతెలంగాణ – బడంగ్ పేట/నాదర్గుల్
“పుట్టుక నీది.. చావు నీది..బతుకంతా దేశానిది” అంటూ ఎలుగెత్తి చాటిన మహాకవి. “అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి.. అన్యాయాన్ని ఎదిరించినవాడే నాకు ఆరాధ్యుడు”అంటూ ప్రకటించిన ప్రజాకవి కాళోజి నారాయణరావు జన్మదినం సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం కందుకూరు ఎస్సీ గురుకుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమం గురుకుల ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆవుల సైదులు మాట్లాడుతూ.. విద్యార్థులు మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని, కొన్ని ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని వాటిని సాధించేదిశగా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, చక్కని విద్యను అందజేసిన సంస్థకు, రాష్ట్రానికి దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
అదేవిధంగా సతీష్, రవీందర్ రెడ్డి, శ్రీను, రమేష్ రమాదేవిలు సంయుక్తంగా మాట్లాడుతూ.. విద్యార్థి జీవితమనేది ఎంతో విలువైనదనీ, దానిని సక్రమంగా వినియోగించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి.రామయ్య, టి.జి.ఎస్ డబ్ల్యూ.ఆర్.ఇ.టి.ఎల్.ఎ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆవుల సైదులు, ఉపాధ్యాయులు మోతిలాల్,రంగారావు, సుదర్శన్, శ్యాంసుందర్, జహేదా బేగం, వసంత, నాగమ్మ, శ్రీలత నవీన్, బోధనేతర సిబ్బంది శంకర్, శ్రీనివాసులు, ప్రసాద్, విజయ్, జైపాల్, పరమేష్, శివ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



