మొక్కజొన్న కొనుగోలు పై రాష్ట్ర ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేదు
మండుటెండలు, అగ్ని, గాలి దుమారంతో రైతులు తీవ్ర అవస్థలు
సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరైనా విజయ్ చంద్ర
రైతుల ఆందోళనతో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక సమావేశం రసాభాస
తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు
నవతెలంగాణ – బోనకల్
ప్రతి సంవత్సరం ప్రైవేటు వ్యాపారులు రైతులను ఆర్థికంగా ముంచుతారని, కానీ ఈ ఎడాది ప్రభుత్వమే రైతులను ఆర్థికంగా, అనేక రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ నష్టపరుస్తుందని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, మధిర డివిజన్ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోనే బోనకల్ రైతు వేదిక నందు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు గురువారం ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం బోనకల్ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం రైతు వేదికలో సుమారు రెండు గంటలకు పైగా ఆందోళన నిర్వహించి రైతులను ఉక్కిరిబిక్కిరి చేశారు. అధికారులు సమాధానం చెప్పలేక ప్రాధేయపడటం విశేషం. మండల తహసిల్దార్ కార్యాలయం ముందు మహాధర్న నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే అనూహ్యంగా మండల రైతు వేదిక నందు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు, పీఎం కుసుం, వ్యవసాయ యాంత్రీకరణ- డ్రోన్స్ పై వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ అధికారులు సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశానికి మధిర వ్యవసాయ శాఖ ఏడిఏ స్వర్ణ విజయ్ చంద్ర, మండల వ్యవసాయ శాఖ అధికారి పసునూరి వినయ్ కుమార్ హాజరయ్యారు. ఈ విషయం తెలంగాణ రైతు సంఘం నాయకులకు, రైతులకు తెలియటంతో మహా ధర్నా కార్యక్రమాన్ని రైతు వేదకకు మార్చారు. స్వర్ణ విజయ్ చందర్ మాట్లాడుతుండగా బొంతు రాంబాబు, పొన్నం వెంకటేశ్వరరావు, మడిపల్లి గోపాలరావు, కిలారు సురేష్ ఒక్కసారిగా ఏడిఏ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కాదు కావాల్సింది, ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న మొక్కజొన్న సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా బోనకల్లు మండలంలోని అత్యధికంగా 21,332 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశారన్నారు. మండలంలో ప్రస్తుతం ఆరు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ద్వారా 3 లక్షల 50 వేలకు పైగా మొక్కజొన్న బస్తాలను కొనుగోలు చేశారన్నారు. కానీ కనీసం 83 వేల బస్తాలను కూడా గోదాములకు తరలించలేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో, కల్లాలలో, పొలాలలో సుమారు 2.60 లక్షల బస్తాలు మూలుగుతున్నాయి అన్నారు. కొనుగోలు చేయకుండా కల్లాలలో, పొలాలలో కొన్నివేల బస్తాలు ఉన్నాయని, వాటిని ఎప్పటికల్లా కొనుగోలు చేస్తారు, కొనుగోలు చేసిన మొక్కజొన్న బస్తాలను వెంటనే తరలించాలని వారు పట్టుబట్టారు.
లక్ష్మీపురం సొసైటీ పరిధిలో కొనుగోలు చేసిన మొక్కజొన్నలను ప్రభుత్వం లారీలు పంపించకపోతే రైతులే లారీలను కిరాయికి తెచ్చుకొని గోదాములకు పంపిస్తున్నారని ప్రభుత్వ తీరుపై వారు మండిపడ్డారు. ప్రభుత్వానికి మొక్కజొన్న కొనుగోలు పై చిత్తశుద్ధి గాని, రైతులను ఆదుకోవాలని ఆలోచన కానీ లేదని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాన్ని నడవనివ్వబోమని అడ్డుకున్నారు. స్పష్టమైన హామీ ఇవ్వాలని నిలదీశారు. అయినా ఏడిఏ నుంచి స్పష్టమైన హామీ రాలేదు. దీంతో రైతు వేదిక లోనే రైతులు ఆందోళనకు దిగారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని వారు ఏ డి ఏ కి స్పష్టం చేశారు. సమావేశం జరగకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. రైతులు ఆందోళన తీవ్ర రూపం దాల్చుతుండటంతో ఏ డి ఏ మార్క్ఫెడ్ డి ఎం శ్యామ్ కుమార్ కు ఫోన్ చేశారు. అయినా ఆయన నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. పావుగంట తర్వాత చెబుతానని డిఎం ఫోన్ పెట్టేశారు. డి ఎం సమాధానం చెప్పే వరకు సమావేశాన్ని నడవనివ్వబోమని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన తీవ్రతరం చేశారు. ఓ పది నిమిషాల తర్వాత డిఎం ఫోన్ చేసి వెంటనే 10 లారీలను పంపిస్తున్నామని ఏ డి ఏ కి ఫోన్ చేసి హామీ ఇచ్చారు.
మిగిలిన మొక్కజొన్న పంటను కూడా వేగంగా కొనుగోలు చేసి కొనుగోలు కేంద్రాల్లో, కల్లాలలో కొనుగోలు చేసిన బస్తాలను తరలించడానికి ప్రతిరోజు లారీలను యుద్ధ ప్రాతిపదిక మీద పంపిస్తామని డిఎం హామీ ఇచ్చారు. దీంతో రైతులు తమ ఆందోళన విరమించారు. అధికారులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే గురువారం మండల తహసిల్దార్ కార్యాలయం ముందు మరల పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని వారి అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం సొసైటీ అధ్యక్షులు మాదినేని వీరభద్రరావు తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గుడ్డురి ఉమ, తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కొమ్మినేని నాగేశ్వరరావు తుళ్లూరు రమేష్ రైతు సంఘం నాయకులు దొండపాటి సత్యనారాయణ, ఎర్రగాని నాగరాజు, ఏడునూతల లక్ష్మణరావు, బంధం శ్రీనివాసరావు, నల్లమోతు నాగేశ్వరరావు, చిట్టిమోదు నాగేశ్వరరావు, నీలకంఠం రాము, తమ్మారపు లక్ష్మణరావు, నల్లమోతు వాణి, నోముల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.



