- Advertisement -
పక్కలో కలలు వొదిలేసి
ఆత్రమాత్రం అంగి లాగు తొడిగి
అల్లరి కష్ణుడిని రోలుకు బంధించినట్టు
కళ్ళద్దాలు చెవులకు కట్టుకుని
యుద్ధమేదో ఊడిపడుతున్నట్టు
రెండు పయ్యల గుర్రమెక్కి బయళుదేరు
రాచకార్యం
లౌడు స్పీకర్ ఏదో మింగేసినట్టు
అంత పెద్ద నోరేసుకుని
క్షణాల్లో ఇంటింటికి చేరిపోయే కరపత్రం
వాడ వాడలా
గణ గణ మ్రోగే వాట్సాప్ సందేశం
పొద్దు పొద్దున్నే సూర్యుడు వొచ్చినట్టు
గుండె దరువు మీద
అలుపెరుగని పాట ఎత్తుకుని ప్రచారం
మనిషి మనిషికీ పంచిపెట్టు
రాజన్న ఫలహారం
మైకు లేక పోయినా
సభ దద్దరిల్లి పోయేలా ఉపన్యసించే వక్తలా
ఊరంతా అదిరిపోయే కంచు కంఠం
పెద్దల కంటికి అగుపడని చిన్నోడు
పై మెట్టు ఎక్కడం రాని
ఆకలి డొక్కల జీతగాడు.
– గజ్జెల రామకష్ణ, 8977412795
- Advertisement -



