కేతిగాడు : అబ్బబ్బబ్బా… ఏం చెపితిరి.. ఏం చెపితిరి.. మీ ఆరెస్సెస్ నాయకుడు మోహన్ భగవత్. దిమ్మతిరిగి పోయిందనుకో – ‘ఏ నిరసనైనా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. అసలు నిరసన అంటేనే చర్చకు మరో రూపం. ఆ… ప్రజాస్వామ్యంలో అది చట్టబద్దం. అవును మరి సమస్యలను పట్టించుకోపోతే ఎవరైనా ఆందోళనలకు దిగరామరి. దిగుతారు. పిల్లలేంది? పెద్దలేంది? అది సహజం. జెన్.జి సమస్యలు నిజమైనవి. న్యాయమైనవి. వారి నిజాయితీ పట్ల నాకు విశ్వాసం ఉంది. వారిని దేశద్రోహులని నిందించడం సరికాదు. మన ఇరుగు పొరుగు దేశాలు చైనా, పాకిస్తాన్‌లతో సైతం మనం మన చర్చల ప్రక్రియను కొనసాగించాల్సిందే. శాశ్వత శత్రుత్వం, శాశ్విత విద్వేషం ఏ సమస్యనూ పరిష్కరించదు. ఇదివరలా కాదు ఇప్పటి యువత. గతంలో అంటే మా తరంలో పెద్దవాళ్లు ఓ మాట చెబితే మరోమాట లేకుండా కుర్రోళ్లు వినేవాళ్లు. పాటించేవాళ్లు. ఇప్పటిలా కాదు. కుర్రోళ్ల ప్రశ్నలకు మనం సహేతుకంగా సమాధానం చెప్పాలి. అది కూడా వారిని గౌరవిస్తూ.. తార్కికంగా ఒప్పించాలి. వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. ఒక్కమాటగా చెప్పాలంటే దేశ నిర్మాణ సాధకులుగా మన యువతను మనం మార్చుకోవాలి. మన విద్యావ్యవస్థను మనం నష్టపరుచుకుంటే చెడు ఫలితాలు వస్తాయి. మన భవిష్యత్ సర్వనాశనమై పోతుంది. అందుకే జి.డి.పి.లో విద్యారంగానికి ఆరుశాతం నిధులు కేటాయించాలి. అలాగే సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే. వివక్ష పోగొట్టేందుకే రిజర్వేషన్లు ప్రవేశపెట్టుకున్నాం. అది మర్చిపోతే ఎలా? మరో ముఖ్యవిషయం స్వలింగ సంపర్కులు కూడా మన సమాజంలో భాగమే. ఆ జంటలకు అవసరమయ్యే చట్ట సహకారం మనం అందించాలి.
అరె జుట్టుపోలుగా… నీవేమన్నా అనుకో. ఇంతలో ఎంత మార్పు. ఎంత జ్ఞానోదయం? ఇవన్నీ ఆ పెద్దాయన అన్న మాటలే. నా చెవుల్ని నేనే నమ్మలేకపోతున్నా.
జుట్టుపోలుగాడు : నీవేకాదు, నేను కూడా. ఇంకా ఏమన్నాడో చూడు, ‘నాయకుడంటే ఉపన్యాసాలు దంచడమే కాదు, అతగానికి తగినంత జ్ఞానం వుండాలి. ఇతరుల్లో వుండే మంచి గుణాలను ప్రశంసించే ఔదార్యం ఉండాలి. క్లిష్టసమయాల్లో యోధుడిగా మెలగాలి. పిరికివానిలా దాక్కోకూడదు. దక్కిన ప్రతి విజయం తానొక్కనిదే కాదని ప్రతి ఒక్కరితో పంచుకోవాలి. అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు (ప్రభావశీలురు) అయితే బాధ్యతగా వుండాలి అన్నారు.
కేతిగాడు : ఏరా.. ఇది ప్రత్యేకంగా ప్రధాని మోడిని ఉద్దేశించి అన్నాడా ఏంది? మీ అంధభక్తులు ఏమంటారు?
జుట్టుపోలుగాడు : ఏమోమరి. మా భక్తుల్లో మరి రెండు రకాల వాళ్లు ఉన్నారు. 1. ఆరెస్సెస్ భక్తులు, 2. మోడీ బిజెపి భక్తులు.
కేతిగాడు : ఇంతకీ నీవే భక్తుడివి. ఇంత జరుగుతున్నా ఏ భక్తుడూ కళ్లు తెరవడంలా. మొన్నటికి మొన్న జార్ఖండ్‌లో ఉద్యమకారిణి నేహాబోరాపై ఓ అంధ భక్తుడు పని గట్టుకుని దారుణంగా ఇంకు చల్లాడు.
బంగారక్క : (ప్రవేశం) అవును. ‘నన్ను అవమానించాలని, నా ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని పిరికిపందలు నాపై సిరా చల్లవచ్చు. ఆ సిరా చుక్కలతోనే నా దేశ చరిత్రను పునరుల్లేఖిస్తాను’ అన్నది ఆ ధీరవనిత నేహా బోరా.
కవి కాళోజీ వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక. పెల్లుబికిన జెన్.జి ఉద్యమాన్ని బిజెపి – ఆరెస్సెస్ వాళ్లు ఇప్పుడు మింగాలేక కక్కాలేక లక్ష డ్రామాలు ఆడుతున్నారు. ప్రతిపక్షాలను లొంగదీసుకుని ముక్క చెక్కలు చేసి, నయానా భయానా అణిచేేసినట్టు పౌరసమాజాన్ని, అందునా నవతరాన్ని అణచడం వారివల్ల కావడం లేదు.
ఒక ప్రజాస్వామ్య దేశంలో న్యాయం కావాలంటూ శాంతియుత సత్యాగ్రహ పద్ధతుల్లో రోడ్డెక్కిన విద్యార్థి యువతపై పెల్లుట్ల గన్స్‌తో కాల్పులా..? మేకులు దిగ్గొట్టిన లాఠీలతో చావమోదటమా..? దేశద్రోహులని ముద్ర వేస్తూ కేసులూ… అరెస్టులా..? అన్నింటికంటే ముఖ్యంగా ఇలాంటి అంధభక్తులకు లాఠీలిచ్చి ఉద్యమకారుల్ని కొట్టించడమా..? కన్నంలో పట్టుబడ్డ దొంగల్లా ఇప్పుడు దొరికిపోయారు. మహాత్ముడిని పొట్టన పెట్టుకున్న వారికి ఓ నీతా..? ఓ జాతా..? రేపిస్టులు, ద్వేషాన్నే ఊపిరిగా తీసుకుని హింసకు పాల్పడేవాళ్లు, అవాకులు, చవాకులతో పాటు నానా బూతులు మాట్లాడే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, గోడీ మీడియా – వీటన్నింటినీ చుట్టూ పెట్టుకుని ఇప్పుడు తగుదునమ్మా అంటూ నీతులు చెప్తాం అంటే ఎవరు నమ్ముతారు? ఇంకా ఎంతమంది చెవుల్లో కమలం పూలు పెడ్తారు? అరెరె అంతెందుకు ఆరెస్సెస్ మనదేశంలో భాగం అయినప్పుడు మన చట్టానికి, రాజ్యాంగానికి లొంగి ఉండాలి కదా. ఆ లెక్కలు, ఆ కార్యక్రమాలు పారదర్శకంగా ఉండాలని కర్నాటక హోం మంత్రి ప్రియాంక ఖర్గే న్యాయబద్దంగా కోరుతుంటే, మేం చట్టానికి అతీతులం అని బోర విరుచుకుని నడిచేవాని మాటలు చట్టాన్ని ఎందుకు వినాలి? ఎందుకు గౌరవించాలి?
– కె.శాంతారావు, 9959745723



