Sunday, August 16, 2026
E-PAPER
Homeచౌరస్తాకాటు వేసే మనుషులు

కాటు వేసే మనుషులు

- Advertisement -

ఏంటి ఒళ్లు ఇలా తడిసిపోతున్నది అన్నాడు భర్త. ఇదేం పాలు పోసే సీజన్‌ కాదు వర్షం పడుతున్నది కదా ఇల్లు కురుస్తున్నది అన్నది భార్య. కురిస్తే కురిసింది ఇన్నాళ్లు లోపల వేడికి చిరాగ్గా వుండేది, ఇప్పుడు చల్లగా హాయిగా వుంది. అలా అలా హాయి హాయిగా, జోరుజోరుగా షికారుకెళ్దామా అన్నాడు భర్త. ఈ వానలో తడిసి ముద్దయిపోతాం బాబూ. నే రాలేను. అలాగనకు డియర్‌! నోరంతా తిమ్మిరిగా ఉంది. ‘స్టాకేమో’ చీదర పుట్టిస్తున్నది. వదిలించుకోకపోతే తేలికపడలేను.
మొండోడు రాజు కన్నా గొప్పోడంటారు. ఒకటి మనసులో పడితే ఇంక అంతే వస్తాను మహానుభావా రాక చస్తానా. పదండి అంటూ కదిలింది భార్య.
పుట్ట మెయిన్‌ డోర్‌లోంచి బయటకు చూసింది గోధుమరంగు ఆడ నాగు. వర్షం తగ్గింది. వాతావరణం బాగుంది. రండి రండి అంటూ బయటకు సుతారంగా, వయ్యారంగా జారింది. దాని తోక వెంటే బయటకు వచ్చి ఠీవీగా తల ఎత్తి చుట్టూ చూసి నేల మీదకు హుందాగా పాకింది మగ నాగు.
రెండు నాగులూ ఒకదాని వెంట ఒకటి రోడ్డు దగ్గరకి వచ్చాయి. ఈ దారంట ఎవడైనా వస్తే వాడి పని అవుటే. తీపులు పెడ్తున్న కోరల్లో స్టాకంతా ఒక్క కాటుతో ఖతమే అన్నాడు భర్త.

నాకు నమ్మకం లేదు. ఈ దారిన ఎవడూ నడుస్తూ రాడు. ఈ మధ్య మనుషులు నడక మానేశారు. బైకులూ, కార్లూ తప్ప నడిచేవాడే ఉండడు. పైగా చీకటి పడుతున్నది. కాటు వేయాలనుకుని ప్రాణాలమీదికి తెచ్చుకోకు అని కోప్పడింది భార్య.
నువ్వన్నది నిజమే. ఈ దారంట నా కాటు కోసం ఎవడూ రాదు. కానీ మనమే ఊళ్లోకి వెళ్దాం. బోలెడు ఇళ్లూ, ఇళ్లల్లో మనుషులూ పదపద అంటూ రోడ్డు దాటి జరజరమని పాకాడు మగడు. భర్త పాకిన జాడను అనుసరించింది భార్య.
పెద్ద బిల్డింగ్‌. కాంపౌండ్‌లో నుంచి లోపలికి దూరిన భర్త కిటికీలోంచి లోపలికి జారాడు. మంచం మీద మనిషి ఒకడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. వీణ్ణి కాటేస్తే ఓ పనైపోతుంది అన్నాడు భర్త.

వద్దు వద్దు.. వీడి ముఖం చేస్తే తెల్సిపోయింది. వీడు ఒక రియల్‌ ఎస్టేట్‌ దందా చేసే మోసగాడు. అమ్మిన భూములే మళ్లీ అమ్మి, చెరువులు ఆక్రమించి, ప్రభుత్వ భూమి హాంఫట్‌ చేసిన దుర్మార్గుడు. ‘వీడి ఒంటి నిండా విషమే. వీడ్ని కాటేస్తే నీ ప్రాణాలకే ముప్ప్పు. వదిలెయ్యి! రా మరో ఇంటికి పోదాం అంది భార్య.
నీ మాట నేనెప్ప్పుడు కాదన్నాను అంటూ భార్య వెంట కిటికీలోంచి బయటకు జారాడు భర్త.
భార్యా భర్తా మరో భవనంలోని పడక గదిలో ఓ మనిషి మంచం మీదకి పాకారు. నాకు చాలా తొందరగా ఉంది. వీడ్ని వేసేయ్యనా అన్నాడు భర్త.
ఉండు, వీడి ముఖం చూసి చెప్తా అంటూ ఆ మనిషి ముఖాన్ని చూసింది భార్య. అమ్మో వీడా! వీడు ఓ పెద్ద కల్తీ వ్యాపారి. ఉప్పులో, పప్పులో, కారంలో, నూనెలో మనుషులు తినే వస్తువులన్నింటిలోనూ కల్తీ చేసి వాళ్ల జబ్బులకూ, చావులకూ కారణమయ్యాడు. ‘వీడి ఒంటినిండా విషమే. వీడ్ని కాటేస్తే నీ ప్రాణాలకే ముప్పు. వదిలెయ్యి! రా పోదాం అంది భార్య.

కిటికీలోంచి బయటకు పాకిన దంపతులు మరో మేడమీది గదిలోకి వచ్చారు. మెత్తటి పరుపు మంచం మీద భారంగా ఉన్న బాడీని మొయ్యలేక కుయ్యో మొర్రో మంటున్నది. వీడి ముఖం చూడగానే బయోడేటా తెల్సిపోయింది. వీడు రంగులు మార్చే ఓ ఊసరవెల్లి. పదవుల కోసం ఎన్ని పార్టీలు మార్చాడో. రాజకీయంలో రాటుదేలి ఎంత సంపాదించాడో, ఎంత మంది ఉసురు పోసుకున్నాడో. వీడి ఒంటినిండా విషమే. వీడ్ని కాటేస్తే నీ ప్రాణానికే ముప్పు. వదిలెయ్యి! అంది భార్య.
భార్యా భర్తలిద్దరూ అనేక ఇళ్లు కలియదిరిగారు కిటికీల్లోంచి, పైపుల్లోంచి, రంధ్రాల్లోంచి. ఒకచోట మనుషుల ప్రాణాలతో ఆడుకునే డాక్టర్‌, ఒకచోట తెగ లంచాలు తిని బలిసిన ప్రభుత్వ ఉద్యోగి, ఒక చోట సెటిల్‌మెంట్లు, హత్యలు చేసి పెద్దమనిషిగా చెలామణి అవుతున్న గూండా ఇలా ఎక్కడికి వెళ్లినా నిలువునా విషం ఉన్న మనుషులే కనిపించడం, భార్య వద్దు వద్దనడంతో తను కాటువేయడానికి ఒంట్లో విషం లేని మనిషే దొరకడా అని బెంగ పడ్డాడు భర్త.
పాములమైన మనకు తలలో, తోకలో తేలుకూ విషం ఉంటుందన్నారు కానీ, నిలువెల్లా విషం వుండేది మనిషికే. అవసరం లేకపోయినా అపకారం చేసే మనిషిని కాటెయ్యలేం. అలాగని అమాయకులనూ, మంచివాళ్లనీ కాటేసి పాపం మూటకట్టుకోలేం. పదండి చెరువు గట్టుకు వెళ్దాం. మన ఆహారం మనకు దొరక్కపోదు అంటూ వయ్యారంగా వడివడిగా ముందుకు పాకింది భార్య. సాటి మనుషుల్ని కాటు వేసే మనుషులకు కనబడితే మన ప్రాణాలకే ముప్పు ‘పెళ్లాం చెప్తే వినాలి’ అనుకుంటూ ఎత్తిన పడగను దించి ఆమెతో కల్సి వంపులు తిరుగుతూ పాకాడు భర్త.

– చింతపట్ల సుదర్శన్‌
9299809212

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -