Sunday, July 19, 2026
E-PAPER
Homeచౌరస్తాడెత్‌ ట్రాప్‌

డెత్‌ ట్రాప్‌

- Advertisement -

యు ఆర్‌ బ్యూటీఫుల్‌, యు ఆర్‌ వెరీ బ్యూటీఫుల్‌, యు ఆర్‌ సింప్లీ బ్యూటీఫుల్‌ అన్నాడతను. యు ఆర్‌ స్మార్ట్‌, యు ఆర్‌ హేండ్‌ సమ్‌, యు ఆర్‌ ఆసమ్‌ అందామె
వారి మాటలు ఎవరికీ వినపళ్ళేదు. అవుడీకి తప్ప. వాళ్ళిద్దరూ అవుడీలో ఉన్నారు కనక. అవుడీ ఎ4 రోడ్డు మీద పరుగెడ్తున్నది కావున. కారు పరిగెడ్తుంటే చెట్టు వెనక్కి పరిగెత్తసాగాయి. చెట్లు వెనక్కి పరు గెడ్తుంటే, మేం మాత్రం నించున్న చోటే ఉండాలా అని వెనక్కి పరుగెడ్తున్నవి కరెంటు స్తంభాలు కూడా. కారు ముందుకు పరుగెడ్తుంటే, వెనక చక్రాలయినంత మాత్రాన మేం వెనక్కి పరుగెట్టాలా అంటూ ముందు చక్రాల్ని అందుకోవడానికి వెనక చక్రాలు ముందుకు పరుగెడ్తున్నవి
ఆల్చిప్పల్లాంటి కనురెప్పలున్న కళ్ళు ఆమెవి. సంపెంగ లాంటి ముక్కుకింద పగడాల్లాంటి పెదవులు సెటిలవడంతో ఆమె ముఖం ఎంతందంగా ఉందో చెప్పడం అంత ఈజీ కాదు. మెడని చుట్టుకున్న టైతో, ఫుల్‌ సూట్‌లో ఉన్న అతని ముఖం.. అందం ఎవడడిగాడు. కారు స్టీరింగ్‌ మీద కదుల్తున్న వేళ్లకు వున్న వజ్రపుటుంగరం, మణికట్టుమీదవున్న వాచీ ఎంత కాస్ట్‌లీయో అతను చెప్తే తప్ప తెలీదు, కానీ అతను ఎంత రిచ్చో చెప్పడం అంత కష్టమైన పనేం కాదు.
కారు ముందుకు దూసుకు వెళ్తుంటే ఆమె కళ్లు మూసుకుంది.

మూసుకున్న కళ్లు రెండువారాల కిందటి దృశ్యం చూడసాగాయి. అతనా డ్రైవింగ్‌ చేస్తూ మధ్యమధ్య ఆమె చెంపల మీద పూసిన గులాబీల వంక చూడసాగాడు. అలా చూస్తూ ఉన్న అతని కళ్లు రెండు వారాల తర్వాతి దశ్యం చూడసాగాయి. ఆమె కుడిచేయి అతని కుడిభుజం మీద నుంచి ఎడం భుజం దాకా సాగింది. ఇప్పుడామె ప్రయాణిస్తున్న వాహనానికి నాలుగు కాళ్లు లేవు. రెండే చక్రాలమీద రోడ్డుంట పరుగెడ్తున్నది బైకు. ఇంకా ముందుకు పరిగెడ్దామనుకుంటున్న అది ‘కీచు’ మని ఆగిపోయింది. సడన్‌ బ్రేక్‌కి ఆమె గడ్డం అతని మెడ వంపులోకి వెళ్లి ఆగింది. పార్క్‌ వచ్చేసింది అన్నాడతను. అతను వేసుకున్నది సూట్‌ కాదు, సాదాసీదా డ్రస్సే. వేళ్లకి ఉంగరాలు లేవు కానీ పొడవాటి ముక్కు కింద కోరమీసం ఉంది. పార్క్‌లో ఓ చెట్టుంది. దాని కొమ్మల నిండా పచ్చదనం వుంది. చెట్టుకింద మెత్తటి వెచ్చటి గ్రాస్‌ ఉంది. వాళ్ళు అంటే ఆమే అతనూ రెగ్యులర్‌గా వెళ్ళి కూచునే చోటుంది. ఆమె అతనూ చాలాసేపటి వరకూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ కూచున్నారు. ఆ నాలుగు కళ్లను చూస్తూ కదలకుండా నుంచుంది చెట్టు. ఎప్పటి లాగా ‘స్వీట్‌ నథింగ్స్‌’ చెప్పుకోడం లేదే అని ఆశ్చర్య పడ్డది కూడా. వాళ్లమధ్య మాటల్ని మౌనం మింగేసింది.

పడమటి ఆకాశం వైపు తెల్లముఖంతో పరుగెత్తిన సూర్యడు ఆరెంజ్‌ కలర్‌లోకి మారుతున్నప్పుడు ఐయాం సిన్సియర్‌ లవర్‌, ఐయాం ఫెయిత్‌ ఫుల్‌ లవర్‌ అన్నాడతను కళ్ళనిండా దిగులు నింపుకుని. డోంట్‌ వర్రీ డియర్‌… నువ్వన్నట్టు ఇంట్లో చెప్పి ఒప్పించడం మాత్రం ఏమాత్రం కుదరదు. హిట్లర్‌ మా డాడీగా మళ్లీ పుట్టాడు. అందువల్ల అటునుంచి లాభం లేదు. ఇటునించే ఏదైనా చెయ్యాలి. చేస్తాను అంటూ లేచి నిలబడ్డ అతనికి చేయి అందించింది ఆమె. ఏం చేస్తావు అన్నాడు అందుకున్న చేతిని పట్టుకుని, ఆమెను పైకి లేపిన అతను. ‘నువ్వే కాదు ఐయాం ఆల్సో ఫెయిత్‌ ఫుల్‌ లవర్‌, ఐయాం ఆల్సో సిన్సియర్‌ లవర్‌ వెయిట్‌ అండ్‌ సీ’ అందామె మెరిసే దానిమ్మ గింజల నవ్వుతో. అతని కళ్లల్లో ఎల్‌ఇడి బల్బులు తళుక్కుమన్నాయి. కారు హారన్‌ చప్పుడుకు ఆమె ఉలిక్కిపడి కళ్లు తెరిచింది. రెండు వారాల తర్వాత ఆమె చేతిలో చెయ్యి వేసి తాము వెళ్లబోతున్న హనీమూన్‌ టూర్‌ గురించి ఆలోచిస్తున్న అతను ఎదురుగా వచ్చిన బైక్‌ను తప్పించడానికి బ్రేకూ, హారన్‌ బలంగా నొక్కాడు. గతంలో నుంచి ఆమే, భవిష్యత్తులో నుంచి అతనూ ఒక్కసారే వర్తమానంలోకి వచ్చిపడ్డారు. కారు ఆగిన రోడ్డు పక్కన పెద్ద పెద్ద బండ రాళ్ళను ఎన్నో ఏళ్లుగా మోస్తున్న కొండ ఉంది. ‘వా క్యాసీన్‌ హై’ అందామె కళ్ల్లల్లో నుంచి తేనె చుక్కలు అతనిపై రాలుస్తూ. దిగి చూద్దామా అన్నాడతను పీక చుట్టూ ఉన్న టై ని బిగిస్తూ.

అనే కదా నేనన్నది. కొండమీద సెల్ఫీ తీసుకుందాం అందామె. ఆనందంలో పైకి ఎగరాలనుకున్న అతను కార్‌ టాప్‌ తగులుతుందని మానేసి డోర్‌ తీశాడు. హంసలా ముందుకు నడుస్తున్న ఆమెను వెనుక నించి చూస్తూ, ‘షీ విల్‌ బి మైన్‌ వెరీ సూన్‌’ అనుకున్నాడతను. వాళ్లను అనుసరిస్తూ కొండమీదికి వచ్చింది కడుపు నిండా నీళ్ళు తాగిన ఓ నల్లటి మేఘం. కొండ చివరన నిలబడ్డారు అతనూ, ఆమే. నల్లటి మేఘంలో పోటీపడుతూ గాలిలో అలలు అలలుగా కదల సాగింది ఆమె సిల్కీ హెయిర్‌. ఆ దృశ్యం చూడలేక పట్టు తప్పుతాననుకున్నాడతను. ఆమె నడుం మీద చేయి వేసి నిలదొక్కు కుందామనుకున్నాడు. ఎడమ చేత్తో సెల్‌ఫోన్‌ పైకి ఎత్తి పట్టుకుంది ఆమె. పైనున్న మేఘం ఒక్క మెరుపుతో రెండుగా చీలి రాళ్ళ మీద ఒక్క పెట్టున నీళ్లు గుమ్మరించింది. కాలు జారుతుందేమో అనుకున్నాడతను. ఆమె కుడి చేత్తో తన్ను పట్టుకుంటున్నదనుకున్నాడు. దగ్గర్లో ఒక పిడుగు పెద్ద శబ్దం చేసింది. అతని కాలికి దగ్గరగా ఉన్న బండరాయి ఒకటి గాలిలోకి డైవ్‌ చేసి లోయలోకి పరుగు తీసింది. అది నేలను చేరుటప్పటికి అతను నేలమీద బోర్లా పడి వున్నాడు. ఇటు నుంచి ఏదైనా చేయాలి అనుకున్న ఆమె సెల్ఫీ తియ్యకుండానే సెల్‌ఫోన్‌ బ్యాగ్‌లో పడేసింది.

– చింతపట్ల సుదర్శన్‌
9299809212

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -