జానకమ్మ…
నీ పేరు పలికితేనే
సప్తస్వరాలు నమస్కరిస్తాయి,
నీ గాత్రం వినిపిస్తేనే
మనసు మౌనంగా పూలవాన కురిపిస్తుంది.
నీవు పాడింది పాటలు కావు,
మనిషి హృదయంలో శాశ్వతంగా చెక్కబడిన
అనుభూతుల అక్షరాలు.
నీ స్వరం ప్రేమకు పరిమళమైంది,
విరహానికి కన్నీటి చినుకైంది,
భక్తికి పారవశ్య గంగైంది,
ఉత్సాహానికి ఉరుములై నడిపించింది.
నవ్వించే గీతమై, ఏడిపించే రాగమై,
తల్లిలాలిపాటై,
దైవానుభూతి కలిగించే స్తోత్రమై,
ప్రతి హదయంలో నిత్యం పలికే
నిత్యనాదమై నిలిచిపోయావు.
ఇరవై భాషల్లో ఆలపించిన
నీ గానగంగ
సరిహద్దులు దాటి ప్రపంచాన్నే
ఒక సంగీత కుటుంబంగా మార్చింది.
భాషలు వేరైనా,
భావం ఒక్కటేనని
నీ స్వరం నిరూపించింది.
అవార్డులు నిన్ను గొప్పదాన్ని చేయలేదు,
నీ గాత్రమే అవార్డుల విలువను పెంచింది.
పద్మభూషణ్ నీ ప్రతిభకు గౌరవమే అయినా,
నీ వంటి గానసరస్వతికి
భారతరత్న మరింత సహజమైన అలంకారం.
పురస్కారాల కొలమానంతో
నీ మహిమను కొలవలేం.
ఎందుకంటే… నీ నిజమైన బిరుదు
ప్రజల హదయాల్లో చెక్కబడిన
”గానకోకిల” అనే అమరశాసనం.
కాలం గడుస్తుంది…
తరాలు మారిపోతాయి…
కానీ నీ పాటలు మాత్రం
ప్రతి ఉదయం కోయిల కూయినట్లు,
ప్రతి సాయంత్రం గాలి తాకినట్లు,
ప్రతి మనసులో
శాశ్వతంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
జానకమ్మ… నీవు కేవలం గాయని కాదు…
భావాలకు భాష, స్వరాలకు శ్వాస,
సంగీతానికి సరస్వతి,
తెలుగు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన
జనహదయాలను మీటిన అమర వీణ.
దేశిని శ్రీధర్ గౌడ్,
9849818284
జనహదయాలను మీటిన అమర వీణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



