Sunday, July 19, 2026
E-PAPER
Homeసినిమారోజంతా కాదు... ఒక్క నిమిషం చాలు

రోజంతా కాదు… ఒక్క నిమిషం చాలు

- Advertisement -

ఆ రోజు మొత్తం ఆమెతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఉదయం నుంచే మీటింగ్‌లు. మధ్యలో కాల్స్‌. ఆఫీస్‌ హడావిడి. ఫోన్‌ సైలెంట్‌లోనే ఉంది. మధ్యాహ్నం ఒకసారి చూసేసరికి ఆమె నుంచి ఐదు మెసేజ్‌లు.
”తిన్నావా?”
”కాఫీ తాగావా కనీసం?”
”ఇంకా బిజీనా?”
”ఈరోజు మాట్లాడతావా లేక దేశరక్షణలో ఉన్నావా?”
చివరగా ఒక angry emoji.. నేను చూసి నవ్వుకున్నాను. రిప్లరు ఇవ్వాలనుకున్నాను. అప్పుడే ఎవరో ఫైల్‌ తీసుకొచ్చారు. మళ్లీ పని మొదలైంది. సాయంత్రానికి మరో మూడు మెసేజ్‌లు.
”హలో మిస్టర్‌ బిజీ.”
”జీవించే ఉన్నావా?”
”సరే.. మాట్లాడొద్దు.”

ఆ చివరి మెసేజ్‌ దగ్గర ఎందుకో గుండెల్లో చిన్న గిల్ట్‌ గుచ్చుకుంది. ఎందుకంటే.. ఆమె ”సరే” అంటే నిజంగా సరే కాదు అని నాకు తెలుసు. రాత్రి పది అయ్యేసరికి పని అయింది. బయటికి వచ్చేసరికి నగరం మొత్తం అలసిపోయినట్టుంది. బైక్‌ స్టార్ట్‌ చేసేలోపు మళ్లీ ఫోన్‌ చూశాను. కొత్త మెసేజ్‌ లేదు. అదే ఎక్కువగా బాధ పెట్టింది. బైక్‌ నడుపుతున్నా ఆమె గురించే ఆలోచన.. రోజంతా నిజంగా అంత బిజీనా నేను? కాదేమో. ఇంటికి చేరేసరికి రాత్రి పదకొండు దాటింది. బట్టలు మార్చుకోకుండానే ఆమెకు కాల్‌ చేశాను. రెండు రింగులకే లిఫ్ట్‌ చేసింది. అంటే ఆమె ఇంకా ఎదురుచూస్తూనే ఉంది.

”హలో..” అంది.
ఆ ఒక్క మాటతోనే అర్థమైంది. ఆమెకు కోపం వచ్చింది.
”సారీ,” అన్నాను వెంటనే.
”ఎందుకు?”
”రోజంతా మాట్లాడలేకపోయాను..”
”అది కొత్తేం కాదు కదా” అంది ప్రశాంతంగా.
ప్రేమలో కొన్నిసార్లు ప్రశాంతతే ప్రమాదకరం. ఆమె గట్టిగా అరిస్తే నాకు అంత భయం ఉండదు. కానీ ఇలా నెమ్మదిగా మాట్లాడితే.. ఆమె నిజంగానే బాధపడిందని అర్థమవుతుంది.
”నిజంగానే బిజీ అయిపోయాను” అన్నాను.
”నేను అబద్ధం అన్నానా?”
ఆమె గొంతులో కోపం లేదు. కానీ చిన్న బాధ మెల్లగా వినిపిస్తోంది. కొద్దిసేపు ఇద్దరం మౌనంగా ఉన్నాం. ఆ మౌనంలో కూడా ఆమె శ్వాస వినిపిస్తోంది. తర్వాత ఆమె మెల్లగా అంది..
”రోజులో ఒక్క నిమిషం కూడా నా కోసం దొరకలేదా?”
ఆ ప్రశ్న చాలా చిన్నదే. కానీ.. కొన్ని ప్రశ్నలు గుండెల్లోకి నేరుగా దిగిపోతాయి. నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. కాసేపటి తర్వాత ఆమె చిన్నగా నవ్వింది. ఆ నవ్వు వెనుక అలసట ఉంది.
”నీకో విషయం తెలుసా.. నీ సమయం నాకు రోజంతా అవసరం లేదు.” నేను మౌనంగా విన్నాను.
”కానీ ఏదో ఒక సమయంలో.. ఏం చేస్తున్నావ్‌? అని అడిగితే చాలనిపిస్తుంది.”
ఆ మాట విన్నాక గదిలోని నిశ్శబ్దం ఒక్కసారిగా భారంగా మారిపోయింది. మనిషి ప్రేమను చాలా పెద్ద పెద్ద రూపాల్లో ఊహిస్తాడు. కానీ.. కొన్ని మనసులకు కావాల్సింది రోజులో ఒక నిజమైన పలకరింపు మాత్రమే.
”సారీ” అన్నాను మెల్లగా.
ఆమె వెంటనే అంది..
”అంత ఈజీగా సారీ చెప్పొద్దు.”
”మరి?”
”కొన్నిసార్లు.. మనుషులు క్షమాపణ కంటే ప్రాధాన్యం కోరుకుంటారు”
ఆ మాట తర్వాత నేను చాలా సేపు మాట్లాడలేకపోయాను. ఆమె మళ్లీ మెల్లగా అంది..
”నాకు నీ టైమ్‌ మొత్తం అవసరం లేదు. కానీ.. నీ అలసటలో, నీ హడావిడిలో, నీ రోజులో.. నాకో చిన్న చోటు ఉందని అనిపించాలి.”
ఆ క్షణంలో నాకు ఒక్కసారిగా ఆమె మీద చాలా ప్రేమ వచ్చింది. ఎందుకంటే.. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్లు ఎప్పుడూ అసాధ్యమైనవి అడగరు. వాళ్లు కోరుకునేది.. మన జీవితంలో తాము మరిచిపోబడలేదనే చిన్న నిర్ధారణ మాత్రమే.
”ఇప్పుడు ఏం చేస్తున్నావ్‌?” అన్నాను అకస్మాత్తుగా.
ఆమె కొద్దిసేపు మౌనంగా ఉంది. తర్వాత,
”ఇదిగో.. నీ మీద కోపంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను.”
”అయితే,?”
”కుదరట్లేదు.”
”మరి”
”నీమీద మరింత ప్రేమలో పడుతున్నాను”
నేను నవ్వాను. కొద్దిసేపు ఇద్దరం ఏమీ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దం ఇప్పుడు భారంగా లేదు. చాలా దగ్గరగా ఉంది. తర్వాత ఆమె గొంతు నెమ్మదిగా మదువైంది.
”తెలుసా..” అంది.
”రోజంతా నువు మెసేజ్‌ చేయకపోయినా.. ఫోన్‌ వెలిగిన ప్రతి సారి అది నీదే అయి ఉంటుందని చూశాను.”
ఆ మాట విన్నాక.. ఎదురుచూడటం కూడా ప్రేమలో ఒక భాష అనిపించింది.
”ఇక నుంచి జాగ్రత్త,” అంది.
”అలాగే”
”అది నువ్వు ప్రతి సారి అంటావు.”
”ఈసారి నిజంగా.”
”చూద్దాం..”
కొద్దిసేపటికి ఆమె గొంతులో మెల్లగా నిద్రమత్తు వినిపించింది.
”నిద్ర వస్తోందా?” అన్నాను.
”కొంచెం..”
”పడుకో…” అన్నాను.
”ఊ… కానీ కాల్‌ కట్‌ చేయొద్దు.”

”సరే” ”నీకు తెలుసు కదా… నువ్వు చదివితే నాకు త్వరగా నిద్ర వస్తుంది. రవీంద్రుని గీతాంజలిలో ఏదైనా చదువు…” నేను టేబుల్‌ మీద ఉన్న పుస్తకం తీసుకున్నాను. పేజీలు మెల్లగా తిరిగాయి. గదిలో నా స్వరం తప్ప ఇంకేమీ లేదు. ఆమె అటువైపు నిశ్శబ్దంగా వింటోంది. కొద్దిసేపటికి… అవతల నుంచి మాటలు వినిపించడం ఆగిపోయింది. నిద్ర మాత్రం వినిపిస్తోంది. చిన్నపిల్లలా ప్రశాంతంగా… నేను కాల్‌ కట్‌ చేయలేదు. చదవడం ఆపలేదు. ఆ రాత్రి నాకు ఒక చిన్న నిజం అర్థమైంది. ప్రేమంటే… రోజంతా కలిసి ఉండటం కాదు. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండటం కాదు. ఎదుటివారి మనసు ప్రశాంతంగా నిద్రపోయేంత భద్రతగా మారిపోవడం.
– రామ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -