Sunday, August 16, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రచార ప్రసంగం

ప్రచార ప్రసంగం

- Advertisement -

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ ప్రజలకు దిశానిర్దేశం చేయాల్సిన స్వాతంత్ర్య దినోత్సవ వేదికను ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రభుత్వ విజయాల ప్రచార వేదికగా మలుచుకున్నారు. సుమారు గంటా పావు సాగిన ప్రసంగంలో వందేమాతరం నుంచి వికసిత్‌ భారత్‌ వరకు, మహిళా రిజర్వేషన్‌ నుంచి ఆత్మనిర్భర్‌ భారత్‌ వరకు ఎన్నో అంశాలను ప్రస్తావించారు. దేశభక్తి, ఆర్థిక శక్తి, స్వావలంబన, భద్రత వంటి పెద్ద మాటలతో ప్రసంగం నిండిపోయింది. అయితే ఆ మాటల వెనుక సామాన్యుడి బతుకులోని వాస్తవాలు ఎంత కనిపించాయి? నిరుద్యోగ యువత, రైతులు, కార్మికులు, మహిళలు, ఆదివాసీల సమస్యలకు ఎంత చోటు దక్కింది? స్వాతంత్ర్య వేదిక నుంచి దేశం ఎదుర్కొంటున్న అసమానతలు, నిరుద్యోగం, ధరల భారం, సామాజిక వివక్షపై ఆత్మపరిశీలన చేయాల్సిన చోట పాలనా విజయాల ఏకపక్ష ప్రచారమే ప్రధానంగా కనిపించింది. మోడీ చెప్పిన మాటలకూ, ప్రజలు అనుభవిస్తున్న వాస్తవాలకూ మధ్య ఉన్న అంతరాన్ని పరిశీలిస్తేనే ఈ ప్రసంగం వెనుక అంతరార్థం బయటపడుతుంది.

వందేమాతరం–దేశభక్తిని ప్రసంగానికి ప్రధాన భావోద్వేగ కేంద్రంగా మోడీ నిలిపారు. ప్రతి హృదయం వందేమాతరంతో మార్మోగుతోందన్నారు. వందేమాతరం మన స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో గొప్ప నినాదం. దానిపై ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ దేశభక్తిని కేవలం జెండా, గీతం, నినాదాలకే పరిమితం చేయడం ద్వారా దేశంలోని ప్రజల అసలు సమస్యలను పక్కకు నెట్టే ప్రయత్నం జరిగితే అభ్యంతరం తప్పదు. ఆకలితో ఉన్న కుటుంబానికి అన్నం, యువతకు ఉద్యోగం, రైతుకు గిట్టుబాటు ధర, కార్మికుడికి భద్రత, పేదలకు విద్య–వైద్యం అందించడం కూడా దేశభక్తే. ప్రజల బతుకులను మెరుగుపరచడమే దేశభక్తికి అసలైన పరీక్ష. నినాదం గొంతెత్తినంత మాత్రాన దేశం బలపడదు, ప్రజల జీవితం బలపడినప్పుడే దేశం బలపడుతుంది. మహిళా రిజర్వేషన్‌ను త్వరగా అమలు చేయాలని మోడీ రాజకీయ పార్టీలను కోరారు. 2023లో చేసిన చట్టం జనగణన, నియోజకవర్గాల పునర్వి భజనతో ముడిపడి ఉండటంతో అమలు ఆలస్యమైంది. ఇప్పుడు దానిని ముందుకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది.

మహిళలకు 33 శాతం రాజకీయ ప్రాతినిధ్యం అవసరమే. కానీ మహిళా సాధికారతను కేవలం పార్లమెంటు సీట్లతో కొలవడం సరిపోతుందా? మహిళలపై హింస, అసమాన వేతనాలు, ఉపాధి లోపం, సామాజిక భద్రత వంటి సమస్యలకు పరిష్కారం లేకుండా రిజర్వేషన్‌ ఒక్కటే సాధికారతగా ఎలా మారుతుంది? రెజ్లర్ల పోరాటం ఈ వైరుధ్యాన్ని మరింత స్పష్టంగా చూపింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై మహిళా క్రీడాకారిణులు వీధుల్లోకి వచ్చి న్యాయం కోరాల్సి వచ్చింది. కేసులో కోర్టు ఇటీవల బ్రిజ్‌భూషణ్‌ను నిర్దోషిగా విడుదల చేసినప్పటికీ, క్రీడాకారిణులు అప్పీల్‌కు వెళ్లారు. మహిళలకు సీట్లు ఇవ్వడం ఎంత ముఖ్యమో, న్యాయం కోసం నిలబడిన మహిళల గొంతును వినడం అంతకంటే ముఖ్యమని ప్రభుత్వం ఎప్పుడు గ్రహిస్తుంది? మావోయిజం–‘దిమాగీ నక్సల్స్‌’ అంశం ప్రసంగంలోని రాజకీయ మర్మాన్ని మరింత బయటపెడుతుంది. సాయుధ మావోయిజాన్ని ఎదుర్కోవడం ప్రభుత్వ బాధ్యతే. కానీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని, ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే వారిని, భిన్న రాజకీయ భావజాలం కలిగిన వారిని ‘దిమాగీ నక్సల్స్‌’గా ముద్రించే ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.

తుపాకీ పట్టినవారిని ఎదుర్కోవడం వేరు, ప్రశ్నించే మెదడును అణచివేయడం వేరు. ఈ సందర్భంలో అడవులు, ఖనిజ సంపదపై కార్పొరేట్ ఆసక్తులను కూడా చూడాలి. హస్దేవ్‌ అరంద్‌లో భారీ అటవీ భూమిని బొగ్గు తవ్వకాలకు మళ్లించేందుకు అనుమతులు ఇవ్వడం, అదానీ గ్రూప్‌ గని నిర్వహణలో ఉండటం, లక్షలాది చెట్ల తొలగింపు ప్రతిపాదన—ఇవి అభివృద్ధి నమూనాపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఆదివాసీలు, పర్యావరణవేత్తలు, ప్రజా ఉద్యమాలు అడవులను కాపాడాలని పోరాడుతుంటే వారిని అభివృద్ధి వ్యతిరేకులుగా, ప్రశ్నించేవారిని ‘దిమాగీ నక్సల్స్‌’గా చిత్రించడం వల్ల లాభం ఎవరికి? అడవి, భూమి, ఖనిజ సంపద ప్రజలదా? కార్పొరేట్లదా? అనే అసలు ప్రశ్నను తప్పించలేం. ఆర్థిక శక్తి గురించి మోడీ గొప్పగా చెప్పారు. భారత్‌ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని, వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ముందుకు సాగుతోందని ప్రకటించారు. ఒకప్పుడు ప్రకటించిన ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. అయితే అంతకంటే ముఖ్యమైనది మరో ప్రశ్న. జీడీపీ పెరిగితే ప్రజల ఆదాయం అదే స్థాయిలో పెరిగిందా? యువతకు స్థిరమైన ఉద్యోగాలు వచ్చాయా? రైతు ఆదాయం పెరిగిందా? కార్మికుడి కొనుగోలు శక్తి పెరిగిందా? దేశ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతున్నప్పుడు దాన్ని ప్రజల ఆర్థిక శక్తిగా ఎలా చెప్పగలం? దేశం ధనికం కావడం ఒకటి, దేశ ప్రజలు ధనికులు కావడం మరోటి. మోడీ ప్రసంగంలో మొదటిది ఉంది, కానీ రెండోదానికి సమాధానం లేదు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో సెమీకండక్టర్లు, రక్షణ ఉత్పత్తి, అణుశక్తి, సాంకేతిక రంగాల్లో స్వావలంబన గురించి చెప్పారు. దేశం స్వయం సమృద్ధి సాధించాల్సిందే. కానీ ఆత్మనిర్భరత అంటే పెద్ద కార్పొరేట్‌ పెట్టుబడులకు అవకాశాలు కల్పించడం మాత్రమే కాదు. చిన్న పరిశ్రమలను కాపాడటం, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడం, రైతుకు భరోసా కల్పించడం, యువతకు ఉపాధి ఇవ్వడం, సహజ వనరులను ప్రజల ప్రయోజనాలకు వినియోగించడం కూడా దానిలో భాగమే. అడవులు, గనులు, భూములు కొద్దిమంది సంస్థలకు అప్పగిస్తూ స్వావలంబన గురించి మాట్లాడితే అది ఎవరి స్వావలంబన? ప్రజలు స్వయం సమృద్ధి చెందుతున్నారా? లేక కార్పొరేట్‌ శక్తులు మరింత స్వయం సమృద్ధి చెందుతున్నాయా? స్వాతంత్ర్య దినోత్సవం వేదిక ప్రభుత్వం తన విజయాలను చెప్పుకునే స్థలం మాత్రమే కాదు. స్వాతంత్ర్య పోరాటం అందించిన ప్రజాస్వామ్యం, లౌకికత, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను గుర్తుచేసుకునే జాతీయ వేదిక. అందుకే ఎర్రకోటపై నుంచి వినిపించే మాటలకు ప్రజల జీవితమే గీటురాయి కావాలి.

వందేమాతరం నినాదం ఎంత గట్టిగా వినిపించినా, నిరుద్యోగ యువత గొంతు అణగిపోతే దేశభక్తి అసంపూర్ణమే. మహిళా రిజర్వేషన్‌ ఎంత గొప్పగా ప్రకటించినా, మహిళకు న్యాయం దక్కకపోతే సాధికారత అసంపూర్ణమే. మావోయిజం అంతమైందని చెప్పినా, ప్రశ్నించే గొంతులపై ముద్ర వేస్తే ప్రజాస్వామ్యం అసంపూర్ణమే. ఆర్థిక శక్తి పెరిగిందని చెప్పినా, సంపద ప్రజలకు చేరకపోతే అభివృద్ధి అసంపూర్ణమే. ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదం వినిపించినా, సహజ వనరులు కార్పొరేట్‌ చేతుల్లోకి జారితే స్వావలంబన అసంపూర్ణమే. కేంద్రం యువత విశ్వాసాన్ని కూడా కోల్పోయింది. దానికి నిదర్శనం జెన్ -జి ఉద్యమం. నీట్ పేపర్ లీకేజీ తర్వాత చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ చేపట్టిన నిరసన దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే లేపింది. దానిపై ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన ప్రధాని ఆ ఊసే ఎత్తకపోవడం విచారకరం. ఎర్రకోటపై ప్రసంగం ముగిసింది. కానీ మోడీ పాలనను అంచనా వేసే అసలు ప్రసంగం దేశంలోని కోట్లాది ప్రజల జీవితాల్లో ప్రతిరోజూ కొనసాగుతూనే ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -