Saturday, September 5, 2026
E-PAPER
Homeఖమ్మంఆయిల్‌ఫెడ్‌ భూమికి ఫ్రీహోల్డ్‌ హక్కులు కల్పించాలి

ఆయిల్‌ఫెడ్‌ భూమికి ఫ్రీహోల్డ్‌ హక్కులు కల్పించాలి

- Advertisement -

– సీఎస్‌కు ఆయిల్‌ఫామ్‌ రైతుల సంఘం వినతి
– ఆయిల్ ఫెడ్ డీఎం శంకర్ కు పత్రం అందజేత 
నవతెలంగాణ – అశ్వారావుపేట

హైదరాబాద్ ఇండస్ట్రియల్‌ ఏరియాలోని 15,984.50 చదరపు గజాల భూమిని తెలంగాణ స్టేట్‌ కోఆపరేటివ్‌ ఆయిల్‌సీడ్స్‌ గ్రోయర్స్‌ ఫెడరేషన్‌ (టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌)కు ఫ్రీహోల్డ్‌ హక్కులు కల్పించాలని తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ అస్వారావుపేట జోన్‌ ఆయిల్‌పామ్‌ గ్రోయర్స్‌ సొసైటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు తుంబూరు ఉమా మహేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య లు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు పేరుతో అశ్వారావుపేటలో ఆయిల్ ఫెడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శభావత్ శంకర్ కు వినతిపత్రం సమర్పించారు.

ముందుగా ఆయిల్ ఫాం రైతు సమాఖ్య ఆధ్వర్యంలో ఆయిల్ ఫెడ్ స్థానిక డివిజనల్ కార్యాలయంలో సమాఖ్య బాధ్యులు ఆయిల్ ఫెడ్ ఆస్తులు కాపాడాలని, ఆయిల్ ఫెడ్ లో ప్రైవేటీకరణ ను నిలువరించాలని ప్రదర్శన చేసారు. అనంతరం సమాఖ్య బాధ్యులు మాట్లాడారు. వినతి పత్రంలో పొందుపరిచిన సమాచారం మేరకు.. 1991 మార్చి 16న జారీ చేసిన G.O.Ms.No.93 ప్రకారం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ప్లాట్‌ నం.1లో 15,984.50 చదరపు గజాల భూమిని అప్పటి ఏపీఓఐఎల్‌ఫెడ్‌ కు ప్రభుత్వం కేటాయించిందని వారు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం 2003 డిసెంబర్‌ 23 న జారీ చేసిన G.O.Ms.No.366 ద్వారా ఈ భూమి టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ ఆధీనం లోకి వచ్చిందని పేర్కొన్నారు.

అయితే భూమికి సంబంధించిన పాత లీజు, హక్కుల అంశాల కారణంగా ఇప్పటికీ సమస్య కొనసాగుతోందని సంఘం తెలిపింది. 1974 మార్చి 20న జారీ చేసిన లీజు ఉత్తర్వులను, అనంతరం వచ్చిన న్యాయస్థాన తీర్పులను పరిగణనలోకి తీసుకుని భూమిపై టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ కు పూర్తి హక్కులు కల్పించాలని కోరింది.

ల్యాండ్‌ అండ్‌ బిల్డింగ్స్‌ విభాగం జారీ చేసిన షోకాజ్‌ నోటీసు నేపథ్యంలో 2022 మార్చి 31న హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సంఘం విజ్ఞప్తి చేసింది. సంబంధిత భూమిపై టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌కు ఫ్రీ హోల్డ్‌ హక్కులు మంజూరు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరింది.

ఆయిల్‌ఫామ్‌ రైతుల ప్రయోజనాలకు ఉపయోగపడేలా భూమిని వినియోగించాలి
రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆయిల్‌ఫెడ్‌ పరిధిలోని భూమి ఎంతో కీలకమని సంఘం పేర్కొంది. రైతులకు మేలు చేసే విధంగా ఆయిల్‌పామ్‌ కార్యకలాపాలకు ఈ భూమిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. కాపీలు వ్యవసాయ శాఖ ఐఏఎస్‌ అధికారి కే. సురేంద్ర మోహన్‌, టీజీ ఆయిల్‌ఫెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా లకు పంపినట్లు సంఘం తెలిపింది.

ఈ కార్యక్రమంలో దొడ్డా లక్ష్మి నారాయణ, మోరంపుడి శ్రీనివాస్ రావు,ఊగంటి రవి,సీసం రాము, కారం శ్రీరాములు,చక్రధర్ రెడ్డి, దుర్గారావు,గడ్డం సత్యనారాయణ, చిరంజీవి, పిట్టల అర్జున్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -