– పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ రూ.11 వేల కోట్లు విడుదల చేయాలి
– రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి
– హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌ను అమలు చేయాలి: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
నవతెగాణ – కామారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేస్తోందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరంతర పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన పోరుబాటలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ నుంచి బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం కామారెడ్డి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, కళాశాల విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, అర్హులైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని తీవ్రంగా మండిపడ్డారు.

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన రూ.11 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి, నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 97 పేరుతో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆశలను ప్రభుత్వం అడియాశలు చేసిందని గంప గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడకుండా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలకు పరిష్కారం సాధించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గంప శశాంక్, జిల్లా అధ్యక్షులు ఎంకే ముజేబుద్దీన్, మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి స్వామి, నియోజకవర్గ విద్యార్థి, యువజన విభాగం నాయకులు చెలిమెల భానుప్రసాద్, మాజిద్, అనిల్ రెడ్డి, రంజిత్ వర్మ, శేఖర్, రజినీకాంత్, లష్కర్, దేవరాజు, ప్రభాకర్ రెడ్డి, సాయి, పరశురాం గౌడ్, బాబా గౌడ్, రామ్మూర్తి గౌడ్, సమీర్, విజయ్, కృష్ణారెడ్డితో పాటు నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



