ఉదయాన్నే పక్షులు నిద్ర లేపితే మెలకువ వచ్చిన సాంబయ్యకు ఆరోజు తను చెయ్యాల్సిన పని గుర్తుకు వచ్చింది. ఉదయాన్నే గడియారం నిద్రలేపితే మెలకువ వచ్చిన విశ్వేశ్వరావుకు ఆరోజు తను వెళ్ళాల్సిన చోటు గుర్తుకు వచ్చింది. ఉదయాన్నే కాళ్లతీపులు నిద్ర లేపితే మెలకువ వచ్చిన రాజేశ్వరమ్మకు ఆరోజు తను కాళ్ళీడ్చుకుంటూ వెళ్లి ఎవరికి చెప్పుకోవాలో గుర్తుకువచ్చింది . వీధంట నడుస్తున్న సాంబయ్యకు ఎదురుపడ్డాడు విశ్వేశ్వరరావు. ఎక్కడికోరు! పొద్దున్నే బయలుదేరావు అనడిగాడు పెద్దతరహాగా. రోజూ ఉన్న పనులే కదా అని ఇవేళ తీరిక చేసుకుని గుడికి బయలుదేరానన్నాడతను చిన్నతరహాగా. వీళ్ళిద్దరూ తూర్పువీధి వైపు మళ్ళుతుంటే కనిపించింది రాజేశ్వరమ్మ. కాళ్ళీడ్చుకుంటూ వస్తున్న ఆమెనూ పలకరించాడు సాంబయ్య… ఏంటి పిన్నీ! పొద్దున్నే ఎక్కడికి? అని. ఇంకెక్కడికి ఈ కాళ్ళతీపుల సంగతి చెప్పుకుందుకు వెళ్తున్నా వాడిదగ్గరికి అంటూ నుదురు కొట్టుకుంటూ ఆకాశం వైపు చేయి ఎత్తి చూపింది ఆమె. ఇలాగిలాగ ఊళ్లో అన్ని వైపులనుంచీ పక్షులు నిద్రలేపిన వాళ్ళు, గడియారాలు నిద్రలేపినవాళ్ళు, కాళ్ళతీపులు నిదర్లేపిన వాళ్ళూ తాము వెళ్ళాలనుకున్న చోటికి వచ్చారు. ఊరిపొలిమేరలో, ఊరిపేరు శివన్నపేట అనే బోర్డుకు వంద గజాల దూరంలో ఉన్న గుడికి. ఎన్నో యేళ్ళనించీ అక్కడ ఉన్న గుళ్ళో లింగాకారంలో శివుడున్నాడు. కూచున్న చోటినుంచి అంగుళం కూడా కదలని నల్లరాతి నందీశ్వరుడున్నాడు. మేం వచ్చాం అని భక్తులు కాలింగ్‌బెల్ వాయించడానికి గణగణ గంటలూ, కానుకలు వెయ్యడానికి హుండీ ఉన్నాయి.
గుళ్లో దేవుడి దర్శనానికి వచ్చిన వాళ్లందరికీ నిన్నటి దాకా అక్కడ ఉండిన దేవాలయం కనిపించలేదు. కళ్ళు విప్పి చూశారు. కళ్ళు నులుముకు చూశారు, కళ్ళ జోళ్ళు తీసీ పెట్టీ చూశారు. నిజం!! నిన్నటి దాకా అక్కడ ఉన్న గుడి, గుళ్లో లింగమూ లేవు. ఇదేం కలి కాలం. ఇదేం పిదపకాలం, ఇదేం మాయ. అసలిది మన ఊరేనా అనుకుని బోర్డు చూసుకున్నారు. ఊరదేనని బోర్డు చెప్తున్నది. మరి అక్కడ ఉండాల్సిన గుడి ఏమైంది. రాత్రికి రాత్రి గుడినీ గుళ్లో లింగాన్నీ, నందితో సహా, హుండీతో కూడా, ప్రహరీ గోడ కనిపించకుండా అసలక్కడ గుడి అనేది ఎప్పుడూ లేనట్టుగా మాయం చేశారు. జనం పిచ్చి పట్టినట్టు గ్రామం నాలుగు వైపులకూ పరుగులు తీశారు. గుడి ఆచూకీ దొరుకుతుందేమోనని. వార్త ఊరంతా వ్యాపించింది. జనాలు గుంపులుగా నిలబడి ఈ విచిత్రాన్ని గురించి చెప్పుకోసాగారు. గుడినీ, గుళ్లో లింగాన్నీ మింగేసిన వారెవరా? అని తాము కిందపడకుండా ఆశ్చర్యపడసాగారు. బుల్డోజర్లు వచ్చిన జాడలేదు. గోడలు కూలిన ఆచూకీ లేదు. గుడి ఉండాల్సిన చోట ఏమీలేదు, అంటే ఖాళీ మైదానం అంతే!! ”వార్త తెల్సి చుట్టు పక్కల ఊళ్ళ నించి జనం బస్సుల్లోనూ, బళ్ళమీదా, కాళ్ళమీదా బయలుదేరి వచ్చేశారు, గుడి లేని చోటు చూడ్డానికి. గుడిమాయమైన చోటు చూడ్డానికి.
గుడి ఎలా మాయమైందోనని ముక్కు మీద వేలు వేసుకోడానికి. రాష్ట్రం దాటింది వార్త. దేశం మొత్తం కలయ తిరిగింది వార్త. రాష్ట్రం ‘సిబిసిఐడి’కి అప్పచెప్పింది గుడి ఎక్కడికి పోయిందో తెల్సుకునే పనిని. దేశం సీబీఐకి కబురు పెట్టింది. గుడినీ గుళ్లో లింగాన్ని మింగేసిందెవరో కనిపెట్టాలని. ఇవాళ ఈ ఊళ్లో గుడినీ, లింగాన్నీ మింగినోళ్లు, రేపు మరోఊళ్లో మరో గుడినీ లింగాన్నీ మాయం చెయ్యరా అని కేకలు పెట్టారు జనం. రైళ్ళు ఎత్తుకుపోవచ్చు, బస్సులు మాయం చెయ్యవచ్చు. కానీ గుడినీ లింగాన్ని మాయం చెయ్యడం మామూలు విషయం కాదు. అంతర్జాతీయ సమస్య. ”యూఎన్‌ఓ’లో ఫిర్యాదు చెయ్యాల్సిన సమస్య అన్నారు పార్టీలవాళ్ళు, నాయకులు. ఇవాళ గుడిమాయమైంది. రేపు తాజ్‌మహల్, ఎల్లుండి విమానాశ్రయం, ఆపైన పార్లమెంటు భవనం కూడా ‘హాంఫట్’ అవవచ్చు. ఏదో ఒకటి చెయ్యాల్సిందేనని జనం రోడ్లమీద పడ్డారు.
ఒరిస్సానించి కాద్రాలు దార్కాలు, నేపాళం నుంచి పిల్లిగడ్డం మాంత్రికులు, మరాటీ దేశం నుంచి మాయల పకీర్లు వచ్చి ఈపని చేశారని కొందరంటే, ఈ పని నువ్వు చేశావా అని ఫ్లవర్‌ని కాదు ఫైర్‌ని చెప్పుకునే పుష్పని నిలదీశారు కొందరు. జాతీయ అవార్డ్ వచ్చాక చందనం స్మగ్లింగే మానేశానన్నాడతను. గుడినీ, గుళ్ళో లింగాన్ని మింగేసిందెవరో నాకు తెలుసన్నాడో పిచ్చోడు. ఎవడైతేనేం నిజం చెప్తే చాలునని వాణ్ణి పోలీస్ స్టేషన్‌కు లాక్కువచ్చారు. చెప్తావా? ఎన్‌కౌంటర్‌లో చస్తావా అని బెదిరించాడు ఇన్స్‌పెక్టర్. ఎవడైనా కావచ్చు. ఈ ఊళ్లో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంతా మాయగాళ్ళే! మాటల మాంత్రికులే. లేనిది ఉన్నట్టు చెప్తారు. ఉన్నది లేకుండా చేస్తారు. గుళ్లనీ, గుళ్లల్లో లింగాల్నీ గప్‌చుప్‌గా మింగేసే వారు ప్రతి ఊళ్లో, ప్రతి వీధిలో, ప్రతి ఆఫీసులో, ప్రతి అసెంబ్లీలో… ఆఖరుకు పార్లమెంట్‌లో కూడా ఉండనే వున్నారు. ఎవరూ దొరకరు. దొరికినా చిక్కరు అంటూ వెర్రినవ్వులు నవ్వుతూ కుప్పిగంతులు వెయ్యసాగేడు ఆ పిచ్చోడు.
చింతపట్ల సుదర్శన్
9299809212



