ఉధృతమైన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు
తీవ్రమైన ఆర్థిక సంక్షోభం.. ఇంధన సబ్సిడీల్లో కోతతో వెల్లువెత్తిన ప్రజాగ్రహం
సుక్రే : బలీవియాలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు దేశాధ్యక్షుడు రోడ్రిగో పాజ్ శనివారం ప్రకటించారు. పెరుగుతున్న జీవన వ్యయం, ఆర్థిక ఒత్తిడుల కారణంగా ఉధృతమవుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు రాజకీయ సంక్షోభాన్ని తీవ్రతరం చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పాజ్ తన పదవికి రాజీనామా చేయాలని కార్మిక సంఘాలు, రైతులు, మాజీ అధ్యక్షుడు ఎవో మోరల్స్ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించడంతో కొన్ని ప్రాంతాలలో ఆహారం, ఇంధనం, మందుల సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. గత యాభై రోజులుగా దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ‘రహదారుల దిగ్బంధనాన్ని తొలగించేందుకు నేను అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నాను’ అని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పాజ్ చెప్పారు. ఈ చర్య శాంతి భద్రతల పునరుద్ధరణకు సైన్యానికి, పోలీసులకు అవకాశం ఇస్తుందని తెలిపారు.
దేశంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకే ఎమర్జెన్సీని విధించామని పాజ్ వివరించారు. దేశాన్ని స్తంభింపజేయడానికి కొన్ని వ్యవస్థీకృత గ్రూపులు హింసకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆంతరంగిక ఘర్షణలలో సైనిక జోక్యాన్ని అనుమతిస్తూ పాజ్ గత నెలలోనే ఓ చట్టాన్ని ఆమోదించారు. చర్చలకు అన్ని దారులు మూసుకుపోయాయని, చట్టబద్ధమైన డిమాండ్లు లేవనెత్తిన వారితో ఒప్పందాలు కుదుర్చుకున్నామని అంటూ దేశాన్ని అస్థిరపరచేందుకు హింసకు పాల్పడుతున్న వారిని గుర్తించామని, ఈ నేపథ్యంలోనే అత్యవసర పరిస్థితిపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
పాజ్ ఏడు నెలల క్రితమే బలీవియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆర్థిక లోటును పూడ్చడానికి ఇంధన సబ్సిడీలలో కోత విధించడంతో గత నెలలో ఆందోళనలు మొదలయ్యాయి. ఒకప్పుడు సహజవాయువు ఎగుమతులతో గణనీయంగా ఆదాయాన్ని పొందిన బలీవియా ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. 40 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంగా ద్రవ్యోల్బణం పెరిగింది. ఇంధన కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అధ్యక్షుడు రాజీనామా చేయడంతో పాటు తమ వేతనాలు పెంచాలని, ఇంధనం-డాలర్ కొరతను తీర్చాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బొలీవియాలో ఎమర్జెన్సీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



