జులై 1న పంచాయతీ కార్యాలయాల ఎదుట ధర్నాలు
నేటికీ 60 నుంచి 70 శాతం దళితులు, గిరిజనులకు భూముల్లేవు
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
-మహబూబ్ నగర్ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామీణ పేదల బతుకులకు ఆశాదీపంగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పిలుపునిచ్చారు. వీబీ గ్రామ్‌జీ పథకాన్ని అమలు చేయొద్దనీ, ఉపాధి చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలనీ, 200 రోజుల పని కల్పించి రోజువారీ కూలి రూ.700 ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్లపై జులై ఒకటో తేదీన దేశంలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల ఎదుట పెద్ద గ్రామీణ కూలీలతో ధర్నాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. దేశంలో నేటికీ 60 నుంచి 70 శాతం మంది దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల పేదలకు భూముల్లేవని తెలిపారు. గ్రామీణ ప్రజల శక్తి పడిపోతున్నదనీ, దీంతో వారు ఉపాధి కోసం పట్టణాలకు వలసెళ్తున్నారని చెప్పారు. గ్రామాల్లో పేదలపై నూతన ధనిక వర్గం ఆధిపత్యం చెలాయిస్తున్నదనీ, గ్రామాల్లో ఫర్టిలైజర్ షాపులు, ట్రాక్టర్లు, విద్యాసంస్థలు, ఇలా అన్నీ ఆ వర్గం చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందని వివరించారు. ఉపాధి హామీ చట్టం వచ్చాక గ్రామాల్లో కూలీలకు బేరమాడే, కొనుగోలు శక్తులు పెరగడంతో పాటు అన్ని ఉత్పత్తి తరగతులు ఒకే చోట పనిచేయడంతో సామాజిక సమతుల్యత పెరిగిందని చెప్పారు. ఇది ఇప్పుడు 20 శాతం గ్రామీణ ధనికవర్గానికి కంటగింపుగా మారిందనీ, కూలీలు ఆత్మగౌరవంతో బతకడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు కూడా ఇష్టం లేదని చెప్పారు. గ్రామీణ ధనిక వర్గాన్ని సంతృప్తిపరిచేందుకు, పట్టణాల్లో నిరుద్యోగులను ఎక్కువ తయారు చేసి యజమానులకు తక్కువ వేతనంతో ఉద్యోగులు, కూలీలను అందించేందుకు ఉపాధి హామీ చట్టాన్ని మోడీ సర్కారు రద్దు చేసిందని విమర్శించారు. కూలీలను నూతన బానిసలుగా మార్చే కుట్ర దీని వెనుక ఉందని ఎత్తిచూపారు. అటు కార్పొరేట్లు, ఇటు గ్రామీణ ధనిక వర్గాల చేతిలో సంపద పోగు కావడం దేశాభివృద్ధికే నష్టదాయకమని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి సర్కారు మహిళలకు, పింఛన్‌దారులకు బకాయిపడ్డ లక్ష కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హైదరాబాద్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రేషన్‌కార్డుపై ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం ఇవ్వాలనీ, నిత్యావసర సరుకులన్నీ అందజేయాలని కోరారు. భూమి, ఉపాధి, ఇండ్ల స్థలాల కోసం తమ సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేయనున్నట్టు తెలిపారు.
ఉపాధి రక్షణ కోసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



