Friday, July 31, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచిగురుటాకులా వణుకుతున్న మధ్యప్రాచ్యం

చిగురుటాకులా వణుకుతున్న మధ్యప్రాచ్యం

- Advertisement -

వారం విరామం తర్వాత ఉధృత దాడులు
జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడి
ప్రతిగా టెహ్రాన్‌లోని లక్ష్యాలపై విరుచుకుపడిన అమెరికా

నవ తెలంగాణ – జనరల్‌ డెస్క్‌
సుమారు వారం రోజుల విరామం తర్వాత దాడులు, ప్రతి దాడులతో మధ్యప్రాచ్యం మరోసారి అట్టుడికి పోతోంది. జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడి చేయగా అందుకు ప్రతీకారంగా టెహ్రాన్‌ లక్ష్యాలపై అమెరికా పెద్ద ఎత్తున దాడులు చేసింది. దీంతో గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియా ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతోంది. ఇరాన్‌ ప్రయోగించిన ఐదు క్షిపణులను అడ్డుకున్నామని జోర్డాన్‌ సైన్యం గురువారం ఉదయం తెలుపగా సైనిక కమాండ్‌ కేంద్రాలు, క్షిపణి-డ్రోన్‌ స్థావరాలు, తీర గస్తీ ప్రాంతాలు సహా అనేక ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) లక్ష్యాలపై దాడులు జరిపామని అమెరికా కమాండ్‌ సెంటర్‌ చెప్పింది. ఖుజెస్థాన్‌ రాష్ట్రంలోని అనేక నగరాలు, గల్ఫ్‌లోని ఖెష్మ్‌ దీవిపై దాడులు జరిగాయని ఇరాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా వివరించింది. ఖుజెస్థాన్‌లోని అబాదన్‌, షాదెగాన్‌, అర్వంద్‌కెనార్‌, అహ్వజ్‌ నగరాలు దాడులతో దద్దరిల్లాయి. మరోవైపు ఇరాక్‌లో కూడా దాడులు జరిగాయి.

ఖెష్మ్‌ దీవిలోని నివాస భవనంపై అమెరికా వైమానిక దాడి జరిపిందని, శిథిలాల కింద చిక్కుబడిన వారిని కాపాడేందుకు సహాయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని హార్మోజ్‌గన్‌ రాష్ట్ర డిప్యూటీ గవర్నర్‌ చెప్పారు. ఈ ఘటనలో రెండు సంవత్సరాల చిన్నారి, తల్లిదండ్రులు చనిపోయారని అన్నారు. డ్రోన్‌ దాడిలో ఈజిప్ట్‌లో ఓ అమెరికా ట్యాంకర్‌ సహా రెండు నౌకలు మంటల్లో చిక్కుకున్నాయి. అయితే ఈ రెండు నౌకలు హార్ముజ్‌ జలసంధిలో సురక్షితం కాని మార్గంలో ప్రయాణించేందుకు ప్రయత్నించాయని ఐఆర్‌జీసీ తెలిపింది. చైనా కంపెనీకి చెందిన ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ జరిపిన దాడిలో ఒక కార్మికుడు మరణించగా భవనం బాగా దెబ్బతిన్నదని కువైట్‌ సైన్యం తెలియజేసింది. అయితే దాడికి గురైన చైనా కంపెనీ పేరును మాత్రం చెప్పలేదు.

ఇక మా వంతు : ట్రంప్‌
ఇరాన్‌ చమురు నిల్వలు, రిఫైనరీలకు కేంద్రమైన హార్మోజ్‌గన్‌, ఖుజెస్థాన్‌ రాష్ట్రాలపై అమెరికా భీకర దాడులు జరిపింది. బుషెహర్‌, కజెరన్‌ నగరాలలోని చమురు శుద్ధి కర్మాగారాలు, ఖెష్మ్‌, కిష్‌ దీవులను లక్ష్యంగా చేసుకొని అమెరికా సేనలు శక్తివంతమైన వైమానిక దాడులు చేశాయి. బందర్‌ అబ్బాస్‌ సహా అనేక నగరాలలో పేలుడు శబ్దాలు వినిపించాయి. దాడులకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫాక్స్‌ న్యూస్‌తో మాట్లాడుతూ ‘మేము వారిపై తీవ్రంగా దాడులు చేస్తాం. ఇక మా వంతు’ అని చెప్పారు. ఇరాన్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆయుధాలు సరఫరా చేస్తే తాను నిరుత్సాహానికి గురవుతానని తెలిపారు.

మూడు మార్గాలపై దృష్టి
ట్రంప్‌, నెతన్యాహూ మధ్య జరిగిన చర్చలలో ఇరాన్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. ఆక్సియాస్‌ వార్తా సంస్థ అందించిన వివరాల ప్రకారం… చర్చల ద్వారా ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇరాన్‌ అధికారులతో ట్రంప్‌ దూతలు స్టీవ్‌ విట్‌కాఫ్‌, జేర్డ్‌ కుష్నర్‌ ప్రస్తుతం చర్చలు కొనసాగిస్తున్నారు. అయితే ఇరు పక్షాల మధ్య అనేక అంశాలలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ తన అణు కార్యక్రమానికి స్వస్తి చెప్పి ఒప్పందం కుదుర్చుకుంటుందా అని నెతన్యాహూ సందేహం వ్యక్తం చేశారు. ఇక రెండో మార్గంగా ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధాన్ని కొనసాగించాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చింది. అదే సమయంలో అదనపు చర్యల ద్వారా ఆర్థికపరమైన ఒత్తిడి తెచ్చే విషయంపై కూడా చర్చ జరిగింది. ఒకవేళ దౌత్య యత్నాలు, ఆంక్షల ఒత్తిడులు విఫలమైతే సైనిక చర్యను తిరిగి ప్రారంభించడం, దానిని మరింత విస్తరించడంపై సమాలోచనలు జరిగాయి.

ఇరాన్‌పై ఏం చేద్దాం?
ట్రంప్‌, నెతన్యాహూ రహస్య చర్చలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ మధ్య మంగళవారం శ్వేతసౌధంలో చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఇరాన్‌ విషయంలో ఏం చేద్దామనే దాని పైనే వారు ఈ రహస్య భేటీలో ప్రధానంగా సమాలోచనలు సాగించారని తెలుస్తోంది. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో…మరో యుద్ధానికి తెగబడడం కంటే దౌత్యం, ఆర్థిక ఒత్తిడికి ప్రాధాన్యత ఇవ్వాలని నెతన్యాహూ సూచించారని ఇజ్రాయిల్‌ అధికారులు తెలిపారు. ఓ వైపు ఇరాన్‌పై భారీ స్థాయిలో సైనిక చర్యకు పూనుకోవడానికి సన్నాహాలు చేస్తున్న ట్రంప్‌…మరోవైపు ఇరాన్‌తో చర్చలకు సిద్ధపడుతున్నారు. సమావేశం ముగిసిన కొన్ని గంటలకే జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. దీనికి ప్రతిగా అమెరికా సేనలు కూడా ఇరాన్‌ లక్ష్యాలపై పెద్ద ఎత్తున దాడులు జరిపాయి.

దాడులపై ఒత్తిడి చేయని నెతన్యాహూ
‘అన్ని అంశాల పైన కూలంకషంగా, నిక్కచ్చిగా చర్చలు జరిగాయి. ఒక దాని తర్వాత ఒక మార్గాన్ని అనుసరించడం గురించి కాదు. ఏ మార్గాన్ని అనుసరిస్తే ఎలాంటి ఫలితం వస్తుందనే దానిపై చర్చ జరిగింది’ అని ఇజ్రాయిల్‌ అధికారి ఒకరు ఆక్సియాస్‌కు తెలిపారు. ఇరాన్‌పై తక్షణమే దాడులను పునఃప్రారంభించాల్సిందిగా ట్రంప్‌పై నెతన్యాహూ ఒత్తిడి చేయలేదని రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలియజేసింది. ఏదేమైనా అంతిమ నిర్ణయం ట్రంప్‌దేనని నెతన్యాహూ స్పష్టం చేశారని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -