తండ్రీ కొడుకుల అనుబంధం ఈనాటిది కాదు. తండ్రుల వల్ల కొడుకులకు తలనొప్పులూ, తలవంపులూ రావడం అరుదేమో కాని కొడుకుల వల్ల తండ్రులకు అవి మాత్రం అరుదుకాదు, సామాన్యం, సాధారణం కూడా. దీన్నే సన్‌స్ట్రోక్ అనాలి.
తండ్రి మామూలు తండ్రి కాదు. మూడు లోకాల్నీ ఏలగలిగిన శక్తి వున్నవాడు. అందువల్లే తన ఏలుబడి కింద వున్న వాళ్లందరూ తననే దేవుడు అనాలని శాసించాడు. ఆయన మాటకు తిరుగులేదని జనం ఫాలో అయ్యేవారు. కానీ కొడుకు తండ్రికి తలనొప్పి అయ్యాడు. తండ్రిని కాదని మరొకడ్ని దేవుడు అన్నాడు. భజనలు చేశాడు. కీర్తనలు పాడాడు. తండ్రి దేవుడు కానేకాడని, వితండవాదం మొదలు పెట్టాడు. తండ్రికి అరికాలిమంట నెత్తిని తాకింది. కొడుకు మీద ప్రేమని చంపుకున్నాడు. కొడుకుని, చంపేయాలనుకున్నాడు. కొండమీది నుంచి దొర్లించాడు. పాముల్తో కాటు వేయించాడు. ఏనుగుల్తో తొక్కించాడు. అయినా కొడుకు చావలేదు. మరొకడ్ని దేవుడు అనడం, భజన చెయ్యడం, కీర్తనలు పాడడం మానలేదు. చివరకు తండ్రి కొడుకు దేవుడని నమ్మినవాడు స్తంభంలో నుంచి వచ్చినవాడి చేతిలో చచ్చాడు. ఇదే ‘సన్ స్ట్రోక్’ కదా!
తండ్రి మామూలు తండ్రి కాదు. మహా సామ్రాజ్యానికే రాజు. గుడ్డివాడయితేనేం అనేక ఏనుగుల బలం కలిగి వున్నవాడు. కొడుకంటే విపరీతమైన ప్రేమ కలిగి వున్నవాడు. తన కొడుకు మాత్రమే ఈ భూమిని ఏలుకోవాలని కోరుకున్నాడు. అయితే తన తమ్ముని కొడుకులు బలమైన వారని, వాళ్ల వల్ల తన కొడుక్కి, వాడి అధికారానికి ముప్పు కలుగుతుందని భయపడ్డాడు. కానీ కొడుకు మీది ప్రేమ వల్ల, గుడ్డితనం సాకుతో ఏ నిర్ణయం తీసుకోకుండా మౌనం పాటించాడు. నిండు సభలో తన తమ్ముని కుమారుల భార్యని అవమానిస్తుంటే పుత్ర ప్రేమ ఆయన్ని మాట్లాడనీయలేదు, రాజ్య భాగం ఇవ్వాల్సి వస్తుందని. దూతగా వచ్చినవాడు తన తమ్ముడి కొడుకులకు అయిదు వూళ్లు ఇచ్చినా చాలు అన్నాడు. తండ్రి, కొడుకు మీది మమకారంతో, అపకారం జరుగుతుందేమోననే భయంతో ‘కుమారా… ఐదు ఊళ్లే కదా ఇచ్చేద్దాం పోనీ’ అన్నాడు. ‘నో పితాశ్రీ! ఐదు ఊళ్లు కాదు, సూది మోపేంత జాగా కూడా ఇచ్చేది లేదని మొండికేశాడు. మహాసంగ్రామం తప్పనిసరి అయింది. యుద్ధంలో మొండికేసిన కొడుకుతో కలిసి నూరుగురు కొడుకులూ యమలోకం పోకతప్పలేదు. యుద్ధంలో వీరమరణం పొందడం వల్ల స్వర్గానికి పోయినా పోయి వుంటారు. అయితే తండ్రికి మిగిలింది మాత్రం తీరని దు:ఖమే. ఇదే ‘సన్ స్ట్రోక్’ కదా!
విశాలమైన సామ్రాజ్యానికి చక్రవర్తి ఆయన. ఆయన ఒక తండ్రే కాదు, గొప్ప ప్రేమికుడు కూడా. తన ప్రేమ చిరస్థాయిగా చరిత్రలో నిలిచి పోవాలని తపించిన ఆయన తన ప్రేయసికి ప్రపంచపు ఎనిమిదవ అద్భుతంగా ప్రసిద్ధికెక్కిన అద్భుతమైన పాలరాతి భవనాన్ని నిర్మించాడు. ఆ తండ్రికి నలుగురు కొడుకులు. తన తర్వాత సామ్రాజ్యానికి తన పెద్ద కొడుకు చక్రవర్తి కావాలని కోరుకున్నాడు. ఆరోగ్యం సరిగ్గా సహకరించలేదు. మూడవ కుమారుడు మిగిలిన ముగ్గురినీ చంపి సింహాసనం ఆక్రమించాడు. ఆరోగ్యం బాగుపడిన తండ్రి జహాపన స్వేచ్ఛగా వుండడం తనకు శత్రుశేషం అవవచ్చని భావించి ఆయన్ని చెరసాలలో బంధించాడు. ఎనిమిది సంవత్సరాల పాటు ఆ తండ్రి పుత్రశోకాన్ని, భార్యా వియోగాన్ని భరించాల్సి వచ్చింది. ‘సన్‌స్ట్రోక్’ కదా!
తల్లి, ఆమె మామూలు తల్లి కాదు, దేశాన్ని ఏలిన ఓ మహానాయకుని కుమార్తె. మామూలు తల్లి. కాని ఆమె తండ్రి వారసురాలిగా దేశానికి ఏలికయింది. ఢిల్లీకి రాణి అయినా కొడుక్కి తల్లే కదా. తల్లి ప్రేమకు అడ్డూ అదుపూ వుండకపోవడంతో ఆ కొడుకు రాజ్యాంగేతర శక్తిగా రూపెత్తాడు. గ్యాంగ్‌స్టరైజేషన్ పాలిటిక్సు మొదలు పెట్టాడు. అధికార దుర్వినియోగం చేశాడు. తల్లిని తప్పుదోవ పట్టించాడు. పోలీసుల అండతో మాస్ స్టెరిలైజేషన్‌లు చేయించాడు. కొడుకు చేతల్ని చెత్త సలహాల్ని ఆమె కాదనలేకపోయింది. ఫలితంగా సార్వత్రిక ఎన్నికల్లో పదేళ్ల పాలనకు ముగింపు పలికి, మరొక పార్టీ చేతిలో ఓడిపోయింది. ‘సన్ స్ట్రోక్’ కదా!
ఒకానొక వెండితెర వేల్పు. ప్రజల కోసం రాజకీయాల్లో ప్రవేశించాడు. రాత్రీపగలూ శ్రమించి ప్రజల అభిమానాన్ని ఓట్లుగా మార్చి పాలకుడయ్యాడు. ఏభై సంవత్సరాలుగా నిరాటంకంగా పరిపాలిస్తూ వచ్చిన ఓ పార్టీ మహావృక్షాన్ని కూల్చేశాడు. అయితే రాజకీయాల్లో రాటుతేలిన వాడు కాకపోవడంతో, ఎత్తులూ జిత్తులూ తెలీకపోవడంతో తను నమ్మిన ‘సన్‌ఇన్‌లా’ స్ట్రోక్ గురయి పదవిని కోల్పోయాడు. అల్లుడైనా కొడుకుతో సమానం అంటారు కదా. అందువల్ల సన్‌ఇన్‌లా స్ట్రోక్ అయితేనేం ‘సన్ స్ట్రోక్’ కదా!
ఒకానొక ఉద్యమనాయకుని కూతురు. తండ్రి అధికారంలో వున్నంత కాలం పదవీ, హోదా అనుభవించింది. దేశం మొత్తం ఔరా! అని ముక్కున వేలేసుకునే స్కాము కారణంగా జైలు పాలయింది. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లు ముఖ్యమంత్రులవడాన్ని ఆదర్శంగా తీసుకుంది. రాజకీయాల్లో బంధుత్వాలకు చోటు లేదని వేరు కుంపటి పెట్టింది. తండ్రి అశక్తుడైనాడని, అసమర్దుడైనాడని, ఆయన చుట్టూ పందులూ, పందికొక్కులూ చేరాయని నోరు పారేసుకుంటూ వుండడం, ప్రత్యర్థిగా మారడం, తండ్రికి ‘డాటర్ స్ట్రోక్’ అయింది. ఈ రోజుల్లో కూతురైనా కొడుకే అంటారు మరి. ‘సన్‌స్ట్రోక్’ కదా!
అప్పుడెప్పుడో ఓ మంత్రి కొడుకు ఒక సినీనటి ఆత్మహత్యకు కారణం అయ్యాడు. ఇప్పుడిప్పుడే ఓ మంత్రిగారి కొడుకు ‘పోక్సో’ కేసులో చిక్కుకున్నాడు. ఇలా తండ్రుల తర్వాత వారసులుగా దేశాన్నేలాల్సిన కొడుకులు కాని పనులు చేయడాన్ని ఏమంటారు.
– చింతపట్ల సుదర్శన్
9299809212



