భయం అనేది రెండు పదాల మాట మాత్రమే కాదు. దానికీ విశ్వరూపం ఉంది. ఒకడికి ఎండ అంటే భయం, ఒకడికి వానంటే భయం. ఒకడికి చదువంటే భయం, ఒకడికి కొలువంటే భయం. ఒకడికి చావంటే భయం. ఒకడికి బతుకంటే భయం. ఒకడికి చీకట్లో చింతచెట్టు చూస్తే భయం. ఒకడికి అరవని కుక్కని చూస్తే భయం. ఒకడికి కరవకపోయినా పామంటే భయం. ఒకడిని ఎప్పుడు ఏమవుతుందో నన్న భయం వెంటాడుతుంది. ఒకడిని ఏదో ఒక చెడు జరిగి తీరుతుందనే భయం వెటాడుతుంది. పుడుతూనే భయంతో ఏడుస్తాడేమో మనిషి. భయం లేని మనిషంటూ ఉండడు. కారణం చిన్నదో పెద్దదో ఒకదాని వల్ల కాకపోతే మరొకదాని వల్ల, ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడు భయం భయపెట్టక తప్పదు ఎవరినైనా.
కొందరి భయం మనకు ఆశ్చర్యం కల్గిస్తుంది. ఈ మాత్రానికేనా, ఇంతేనా, ఇందుకేనా భయం అని కొట్టి పారేస్తాం. ఇలాంటి భయం ఇలాగ కొట్టి పారేయాల్సిన భయమే ‘రాజు’ అనే ఒకడిది. పేరులో రాచరికం ఉంది కాని, ఇదేం భయం? ఇదీ ఒక భయమేనా? అనిపించే భయం రాజు అనే వాడిది. అమావాస్య అర్థరాత్రి దూరం నించి వినవచ్చే గజ్జెల చప్పుడుకు భయపడ్డం కాదది. అడవిదారంట వెళ్ళు తంటే అడ్డంగా వచ్చినిల్చున్న పులి ఏక్కడికి పోతావు చిన్నవాడా’ అని పాడితే భయపడ్డం కాదది. మెలకువలోనైనా, కలలోనైనా రాజు భయపడేది ఒక బొద్దింకకు మాత్రమే. అవును… కొండిలో విషం ఉన్న తేలు కాదు, కోరలో విషమున్న కట్లపాము కాదు. ఆఫ్టరాల్ ఒక చిన్న తల, వెడల్పాటి చదునైన శరీరం కలిగి, ఎరుపు గోధుమ రంగులో ఉండే బొద్దింక. తలమీద పొడవైన యాంటెన్నాలు ఉండే బొద్దింక అంటే మామూలు కంటే ఎక్కువ భయం రాజుకి. కొన్ని భయాలు మనుషుల్ని చిన్నప్పట్నించీ పట్టిపీడిస్తుంటాయి, గిల్లి గిచ్చి ఏడిపిస్తుంటాయి. రాజును చిన్ననాటి నుంచే ‘చేజ’ చేస్తున్నది బొద్దింక భయం.
మొదట్లో బొద్దింక కనపడితేచాలు కెవ్వు మనేవాడు. ఆ తర్వాత ఆమడ దూరం వెనక్కితిరిగి చూడకుండా పరిగెత్తేవాడు. వయస్సును బట్టి బొద్దింక భయం రూపు మార్చుకుంది. మూతిమీద మీసం గరిక పోచల్లా మొలవడం మొదలయ్యేక, భయం ఫేస్ టర్నిచ్చుకుంది. బొద్దింక కనబడితే చాలు హార్ట్‌బీటు ‘బీటు కానిస్టేబుల్లా ఈల వేస్తూ పరుగెత్తేది. వెంటనే ఆ చుట్టుపక్కల కాలిచెప్పో, షనో, చీపురో ఉందా అని కళ్ళతోనే ఆరా తీసేవాడు. తక్షణం దానిమీద దాడి చేసి చంపకపోతే అది ఎగిరి ముఖం మీదో వీపుమీదో ల్యాండ్ అవుతుందని ఆయుధం సంపాదించి మహాసంగ్రామానికి సిద్ధపడేవాడు. బొద్దింక చూపుకు చిన్నదే అయినా దాని సిక్తు సెన్స్ చాలా గొప్పది. రాజు జోడందుకున్నది గ్రహించి ఆరు కాళ్లతో దౌడుతీసి కిటికీ రెక్క వెనుక, స్టీలు డబ్బాల వెనుక, కర్టన్ మీద, గోడ వ¶లల్లోనూ కదలికే లేకుండా దాక్కునేది. రాజుకు మాత్రం అది తప్పించుకుంటే అన్న భావంలో ఒళ్లు ఒణికేది. దాన్ని ఒకటికి పది, పదికి ఇరవై దెబ్బలు వేసి, అది వెల్లకిల్లా పడి కాళ్ళు ఢ కొట్టుకోవడం ఆగిపోవడం చూసే దాకా మనసు మనసులో ఉండేదికాదు.
ఇప్ప్పుడు రాజు ఏం చేస్తున్నాడో చూద్దాం. పైన ఫ్యాను ఏ క్షణాన్నయినా ఊడిపడుతుందేమోనన్నట్టు ఊగుతూ తిరుగుతూ వుంది. అది ‘సప్లరు’ చేస్తున్న గాలి సరిపోక బోర్లా పడుకుని దిండులో తలదూర్చి నిదురపోవడానికి రెండు కళ్లనీ, బతిమాలుకుంటున్నాడు. వీధి తలుపు తీసి బయట గాలిలో పచార్లు కొడుతూ ఈ ఎండలు ఎప్పుడు రుతుపవనాలకు జడిసి పోరిపోతాయో అనుకుంటుంటే వీపు మీద ఏదో పాకినట్టు అనిపించి ఉలిక్కిపడ్డాడు. బొద్దింక కాదు కదా అనుకుంటూ చొక్కా చివరను పట్టుకుని ఓ దులుపు దులిపాడు. చాలాసార్లు ఎవరైనా ఏదైనా అనుకుంటే నిజం కాదుకాని ఒక్కోసారి నిజంగా నిజమైపోతుంది. నిజమే, రాజు వీపు మీద గిరికీలు కొట్టిన ప్రాణి బొద్దింకే. రాజు షర్టు మీది నుంచి బంగీజంపు చేసి నేలమీద సరదాగా ఆంటెన్నాలు రెండూ ఊపుతూ నిలబడింది. ఎప్పటిలాగే రాజు గుండె వందేభారత్ ట్రైన్ స్పీడందుకుంది. కళ్లు పరిసరాలను స్కాన్ చేశాయి. లైటు వెలుతురుకి మెరుస్తూ కనిపించింది ‘బాటా టోకింగ్ మెన’ చెప్పుల జత. ఒక్క గెంతులో అవసరమైన ఒక్కటీ అందుకున్నాడు. రాజు చేతిలో చెప్పు చూసిన బొద్దింక బతుకు బొద్దింకా అనుకుంటూ రెండు జతల కాళ్ళకు పని చెప్పింది. చేత ఆయుధమ్ము ధరించి వెంట పడ్డాడు రాజు.
దాన్ని వదిలితే అది కిటికీలో నుంచో, తలుపు సందునుంచో వచ్చి మీద పడుతుందన్న భయంతో. వెలుతుర్లో మట్టిమీద ఎగురుతూ, పాకుతూ వెళ్తున్న దాన్ని అనుసరించి చేతికి అందుతుందన్న నమ్మకం కలిగాక బలంగా విసిరాడు చెప్పు. ఆ ఊపుకి ముందుకు తూలిపడి మట్టి లోపలికి జర్రున జారిపోయాడు. ఏం జరగుతున్నదో తెలిసే లోపున చుట్టూ వేలసంఖ్యలో బొద్దింకలు, ఎదురుగ్గా చిన్నసైజు విమానం అంత పెద్ద బొద్దింక కనిపించాయి. ఈ బొద్దింకలన్నీ తన పైకి పాకితే… చెమటతో ఒళ్ళు తడిపి పోయింది రాజుకు. జెయింట్ సైజ్‌లో ఉన్న బొద్దింక ‘భయపడకోరు… మేం ఇప్పుడు చాలా హేపీగా ఉన్నాం. మీలాంటి యువకుల పుణ్యమా అని మా జాతి లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ‘ఎవ్రీడాగ్ హాజ్ ఇట్స్ డే’ అనే మాట ఇప్పుడు ”ఎవ్రీ కాక్రోచ్ హాడ్ ఇట్స్ డే’ అయ్యింది. ఇన్నాళ్ళు డ్రైనేజి పైపుల్లో అనామకంగా బతుకుతున్న మాకు ఓ పేరూ ప్రఖ్యాతి వచ్చాయి.
మేమేం సామాన్య కీటకాలం కాదు. నెలరోజులు తిండి లేకుండా వుండగలం. పాతాళంలోనూ, పైపుల్లోనూ దాక్కుని ఆటంబాంబు పేల్చినా బతికుండగలం. ఇనుము, కర్ర, కాగితం ఏది పడితే అది కొరుక్కుతినగలం. ఆ మహానుభావుడెవరో ఈ దేశంలో యువకులను మాతో పోల్చాడట కదా! మా సత్తా నీకు తెలిసే వుంటుంది. ఎగిరి ముక్కుమీద వాలితే ఏం జరుగుతుందో అనుభవించే వుంటావు. మా స్పీడూ, చచ్చిపడ్డట్టు మోసం చేసి పారిపోయే స్టాటజీలు నీకు తెల్సు కదా. బొద్దింకే కదా అని తీసిపారేసేవాళ్లకు మా సత్తా తెలిసి రావాలి. చూడు… మా పేరుతో ఒక్కటయి మీరూ మీ హక్కులకోసం పోరాడండి’ అంది. అన్ని వేల బొద్దింకల్ని ఒక్కసారి చూసిన రాజు కెవ్వుకెవ్వుమని కేకలు వేస్తూ మంచం మీది నుంచి కిందికి దొర్లిపడ్డాడు. కల కనుక బతికిపోయాను అనుకుంటూ మంచం మీది బెడ్ షీట్ తీసి దులిపాడు. బొద్దింకేమైనా వుందేమోనని.
– చింతపట్ల సుదర్శన్, 299809212
బొద్దింక… జిందాబాద్
- Advertisement -
- Advertisement -



