Sunday, June 7, 2026
E-PAPER
Homeసోపతిరుబాయిల ప్రవాహం

రుబాయిల ప్రవాహం

- Advertisement -

ఏనుగు నరసింహారెడ్డి చేసిన కవిత్వ ప్రయోగాలలో తెలంగాణ రూబాయిలు అనే ప్రక్రియ ఒకటి. వారి రుబాయిలలో తాత్వికత కనిపిస్తుంది ఆ తాత్వికత ఎక్కడో దూరంగా చిన్నప్పుడు పదాలు పాడుకుంటూ పోతున్న ఏదో గొంతుక మన కనుల ముందు నుండి నడుచుకుంటూ తెల్లారి ఉదయపు మంచు తెరలోకి పయనం అవుతున్న రూపం ఒకటి మనల్ని దాటుకుంటూ పోతున్నట్టు ఉంటుంది ఊరిని వాన వెలసిన దశ్యాలను ఆకాశం భూమితో మాట్లాడుతున్న ముచ్చట్లు వాన లేక ఎండిన గొంతుకల గీతమై వినిపిస్తుంది కొన్ని గజల్లు ఎప్పుడు విన్నపట్టికీ అలా గుర్తుండిపోతాయి. దీనికి వాటిలో భావం కారణమా, శైలి కారణమా, అనుభూతియా? ఏదైనా కావచ్చు, అన్నీ అయి ఉండవచ్చు. ఇది ఎక్కువగా ఉర్దూ గజల్స్‌ లో, హిందీలో కనబడుతుంది. తెలుగులో రూబాయిలు అన్నప్పుడు తాత్వికత, విఫలమైన ప్రేమ, అనుభూతికి ప్రధానమైనవి మాత్రమే అని ఇప్పటివరకు చూసాం. కానీ వీటికి భిన్నంగా ఏనుగు నరసింహారెడ్డి రూబాయిలు కనిపిస్తాయి, వైవిద్యమైన వస్తు సేకరణ కనిపిస్తుంది. రుబాయిలలో ఒక రైతు కన్నీటిని వాన, లేక కన్నీళ్ళతో తడిసిన మట్టిని తెలంగాణకు చుట్టిన సిరిసిల్ల చీర లాంటి రుబాయి ఏనుగు నరసింహారెడ్డిది.

”సిరిసిల్ల చీరల ఉంది సోయగం/ నిర్మల్‌ లక్క బొమ్మల్లో ఉంది సోయగం.. అంటారు ఆయన. తెలంగాణ అనగానే మెరుపులా కనిపించేది బతుకమ్మ పండుగ. చెట్ల మీద సింగారించు కట్ల పువ్వులు/ పులకరించు రంగుల గోలిమాల పువ్వులు/ గుడిసె కొప్పు మీద నవ్వు బీర పువ్వులు” అంటూ బతుకమ్మను కీర్తిస్తారు. మనిషి మనసు నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ ప్రయాణం సమూహం నుండి ఒంటరితనంలోకి ఒంటరితనం నుండి సమూహంలోకి. ఈ పయనంలో అనేక సంఘటనలు అనుభూతులు ఊహలు భావుకతతో నిండిన ఆలోచనలు అలలై తాకుతూనే ఉంటాయి చెట్ల మీద వాలేందుకు పిట్టలు తిరిగి వచ్చినరు/ నీటిలోన ఈదాలని చేపలు తిరిగి వచ్చినరు/ రేగుపండ్ల తీపి ఎరిగినోళ్లమే/ ముల్ల వనం మూలమంతా తెలిసినోల్లమే/ పరికపండ్ల జిగురు రుచి ఎరిగినోళ్లమే/ పుట్టుకనుండి పోరి పోరి బతికినోళ్ళమే…

గతాన్ని మరువని మనిషి ఎప్పటికప్పుడు హదయాంతరాలలో దాచుకున్న అనేక అనుభవాలకు అక్షర రూపం ఇస్తూ పోతే అదే ఏనుగు నరసింహారెడ్డి రుబాయిల ప్రవాహం. మనిషి మనుగడకు చెట్టు, అడవి అవసరం. ఆ అడవిని నరుకుతూ కాంక్రీట్‌ అడవిని పెంచుతున్న మనిషికి ఒక ప్రశ్న అయ్యి తాకుతుంది.
ఖాళీ కడుపుతో అలసిన రోజులు/కాళీ జేబులతో తిరిగినప్పటి రోజులు/చెప్పిన పాఠాలే ఏ గురువూ చెప్పలేదు/ దిక్కుతోచని పక్షులైనప్పటి రోజులు.. జీవితం ఎంత అనుభవం ఇస్తే ఈ అక్షరాలు అల్లుకుంటాయి? మనిషికి గతం ఇచ్చిన అనుభవాలే వర్తమానంలో నడిపిస్తాయి. వర్తమాన బాటలు అయితే ఇప్పటి నడకకు అప్పటి ఆ జీవనం కంటే గొప్ప గురువు ఉంటాడా? సాంకేతికంగా మనిషి చాలా గొప్పస్థాయిలో ఉన్నాడు కానీ దానిని గౌరవిస్తూనే మానవత్వాన్ని మరువకు అనే భావన మనలను ఆలోచనలో పడేస్తుంది. వైవిద్య భరితం, అనుభూతుల మాలై.. మన మనసులలో ఏనుగు నరసింహారెడ్డి ఈ తెలంగాణ రూబాయిలు జీవనదుల ప్రవాహమై సాగుతూనే ఉంటాయి.

సి.హెచ్‌. ఉషారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -