మద్రాసులో మూకీల నుండి టాకీలకు జరిగిన మార్పు పాశ్చాత్య దేశాల కంటే భిన్నమైన మార్గంలో సాగింది. యూరప్‌లోని ఇతర సినిమాల్లాగ తమిళ సినిమా తన మూకీ దశ నుండి బయటపడలేదు. తద్భిన్నంగా ఇక్కడ అప్పటికే ఉన్న ఒక కళారూపాన్ని తీసుకుని శిక్షణ పొందిన కళాకారులు, రచయితలు, గాయకులు సౌండ్ డిజైన్‌తో సినిమాలలోకి ప్రవేశపెట్టారు. ఈ కళారూపాలను కంపెనీ నాటకాలనీ, వాణిజ్య సంస్థల నాటకాలనీ పిలిచేవారు. ఈ నాటకాలు ప్రధానంగా వినసొంపైన కథాగానాలను ఆధారం చేసుకుని ఉండేది. ఒకరకంగా ఒపెరా లాగా. ఈ ప్రక్రియకు మూలాధారంగా నిలిచినది తమిళనాట సామాజిక సంప్రదాయంగా వేళ్ళూనుకుని వున్న దేవదాసి వ్యవస్థ.
తమిళ సినిమా ఆవిర్భవించిన తొలి నాళ్ళ నుండే దేవదాసి వ్యవస్థతో విడదీయ లేనంతగా ముడిపడి ఉంది. దేవదాసి వ్యవస్థలోని వారంతా తమ సంగీత, నృత్య నైపుణ్యాలతో నాటక కళాకారిణులుగా కొనసాగుతూ సినిమాల్లోకి మారారు. ఈ కారణం చేతనే తమిళ చిత్రాలలో నేటికీ ప్రజాదరణ పొందిన నృత్యగాన శైలికి పునాది పడింది. దక్షిణ భారత సినిమా రంగ చరిత్రలోని మూకీ యుగం (1916-31)లో 130కి పైగా మూకీ చిత్రాలు తయారైనవి. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సైలెంట్ సినిమా ‘కీచక వధం’ తమిళ సబ్ టైటిల్స్‌తో 1916లో నటరాజ మొదలియార్ నిర్మించాడు. దక్షిణ భారత సినిమా రంగంలో టాకీ యుగం 1931లో ‘కాళిదాస్’ చిత్రంతో ప్రారంభమైంది. ఇది తెలుగు, తమిళ భాషలు మాట్లాడిన ద్విభాషా చిత్రం. మొదటి ఐదు సంవత్సరాలలో మద్రాసులో ‘టాకీలను’ నిర్మాణానికి వసతులు లేకపోవడంతో, వాటిని కలకత్తా, కొల్హాపూర్‌లలో నిర్మించారు. సౌండ్ స్టూడియోలు నెలకొల్పిన తర్వాత బొంబాయి, కలకత్తాలతో పాటు మద్రాసులోనూ సినిమా నిర్మాణాలు మొదలైనవి. మూకీ సినిమాలో మూకాభినయం నుండి సంభాషణలతో టాకీలకు మార్పు ఎలా సాధ్యమైంది, తొలి తమిళ టాకీలలో ఇటువంటి కథన పద్ధతులను అనుసరించారనేది, చిత్రనిర్మాతలు తెరమీద బొమ్మకు, శబ్దాన్ని ఎలా అనుసంధానం చేశారనే తొలినాళ్ళ విషయాలు ఏవీ మనకు అందుబాటులో లేవు. ఆ కాలంలోని సినీ సమీక్షలు, పాటల పుస్తకాల ద్వారానే కొంత తెలుసుకోగలుగుతాము.
మధురైలో ‘దాసియాట్టం’ నృత్య శైలి నుండే భరతనాట్యం రూపుదిద్దుకుని కచేరీల రూపంలో ప్రదర్శించబడింది. సాంప్రదాయకంగా దేవాలయాలతో అనుబంధం కలిగి ఉన్న ఇసై వెలలార్ (దేవదాసి) వర్గానికి చెందిన కళాకారులు, తమ సాంప్రదాయ ప్రదర్శనల నుండి కథను, కథనాన్ని అందించడం ద్వారా తొలి టాకీ సినిమాకు ప్రధాన సహకారం అందించినవి. వీటి ద్వారా తమిళ సినిమా తన స్వరూపాన్ని రూపొందించుకున్నది. దేవదాసి వ్యవస్థ రద్దు చేశాక ఆ వర్గానికి చెందిన కళాకారులు, నృత్య గురువులు మరొక చోట జీవనోపాధి వెతుక్కోవడం వల్ల ఈ చారిత్రక పరిణామం సంభవించింది. ఇసై వెలలార్‌లు మొదట కమర్షియల్ నాటక రంగంలోకీ, అటు నుండి సినిమా రంగంలోకి వచ్చారు. అంటే తమిళ సినిమాల్లోని పాటలు, నృత్యాలు తొలి టాకీలలో పనిచేసిన దేవదాసి సామాజిక వర్గానికి చెందిన కళాకారుల కృషి వల్లే ఆవిర్భవించినవన్నది ఒక చారిత్రక సత్యం. టాకీలు రాకముందు, దక్షిణ భారతదేశంలో కంపెనీ నాటకాలే ప్రధాన వినోదంగా ఉండేవి. 1890వ దశకం నాటికి వాణిజ్య నాటక బృందాలు ఏర్పడినవి. ఆ తర్వాత రెండు దశాబ్దాలలో అనేక పట్టణాలలో శాశ్వత నాటకశాలలు ఏర్పడ్డాయి. చెన్నైలోని ప్రఖ్యాత ఒట్రైవడై థియేటర్‌ను 1872లో మింట్‌లో నిర్మించారు.
1920, 30వ దశకాలలో మద్రాసు ప్రెసిడెన్సీలో దాదాపు 240 సంచార నాటక బృందాలు పనిచేసేవి. దేవదాసి సంప్రదాయానికి చెందిన అనేక మంది కళాకారిణులు ఈ కంపెనీ నాటకాలలో చేరిపోయారు. టి.ఎం.కమలావేణికి ‘కమలాంబిగై సభ’ అనే పూర్తిగా మహిళలతో కూడిన బృందం ఉండేది. ఆమె శ్రీలంకలో కూడా పర్యటించింది. తర్వాత ఆమె ‘గోపాలకృష్ణ’ (1935) చిత్రంతో సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత మైనర్ రాజమణి (1937), తెనాలి రామన్ (1938) చిత్రాలలోనూ నటించింది. ఈ కంపెనీలు ప్రదర్శించిన నాటకాలు, సంగీత నాటకాలుగా రాయబడిన కొన్ని పౌరాణికాలకే పరిమితమైనవి. విదూషకుడితో సహా నటులందరూ గాయకులే అయి వుండాలి. నటన కంటే గానానికే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. అచ్చు యంత్రాలు ఆ కాలంలో నాటక బృందాలకు పాటలు, స్క్రిప్ట్‌లను ప్రచురణలో అందించినవి. 1873-1900 మధ్యకాలంలో కనీసం 286 నాటకాలు అచ్చువేశారు. పాటలు, సంభాషణలు సిద్ధంగా అందుబాటులో ఉండటంతో సినిమా మూకీ నుండి టాకీకి మారడం సులభమైంది.
దేవదాసి సంప్రదాయం
సంగీతం, నృత్యంలో నిష్ణాతులైన స్త్రీ పురుషుల సమూహమైన దేవదాసీల జీవితం దేవాలయం చుట్టూ కేంద్రీకృతమై ఉండేది. ఇది తమిళనాడులో ప్రధాన సంగీత సంప్రదాయంగా ఉండేది. శతాబ్దాలుగా ఈ కళాకారిణులు దేవాలయ ఆచారాలలో దేవత ముందే గాక ఉత్సవ విగ్రహం ఊరేగింపులలో కూడా ప్రదర్శనలు ఇచ్చేవారు. దేవదాసీల నృత్యాన్ని సదిర్ అని, దాసియాట్టం అని వివిధ రకాలుగా పిలిచేవారు. ఈ నృత్య శైలి నుండే భరతనాట్యం రూపొంది దాని అసలు సందర్భంతో సంబంధం లేకుండా రూపాంతరం చెందింది.
జలియన్ వాలాబాగ్ ఘటనతో…
దేవాలయ పట్టణమైన కుంభకోణం ఇసై వేలాలర్ సంప్రదాయానికి కేంద్రంగా ఉండేది. ఈ పట్టణంలో సంగీత, నృత్య గురువులు శిక్షణ పొందేవారు. జాతీయోద్యమం ఊపందుకున్న కొద్దీ సంస్కరణవాదులు దేవదాసి వ్యవస్థను అవమానకరమైనదిగా, అనైతికమైనదిగా విమర్శించడం ప్రారంభించారు. ఆ వర్గానికి చెందిన మహిళా నేతలు మూవలూరు రామమిర్ధం అమ్మయ్యార్, డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి ఈ ఆచారాన్ని రద్దు చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1925లో జరిగిన ఒక సమావేశంలో ‘సంగీత రైతులు’ అని అర్థం వచ్చేలా ‘ఇసై వెలాలర్’ అని ఆ వర్గానికి రామమృతం అమ్మయ్యార్ కొత్త పేరు పెట్టాడు. దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా తీసుకునే చర్యలకు గాంధీజీ, పెరియార్. ఈ.వి. రామసామి మద్దతు తెలిపారు. ఫలితంగా 1924లో ‘దేవదాసి నిర్మూలన చట్టం’ వచ్చింది. 1919లో పంజాబ్‌లోని జలియన్ వాలాబాగ్ మారణకాండ దేశాన్ని కుదిపేసింది. ఈ సంఘటన వినోద రంగ కళాకారులను దేశం కోసం తమ కార్యాచరణకు పురికొల్పింది. క్రమంగా కంపెనీ నాటక ప్రపంచం జాతీయవాద దృక్పథంతో నిండిపోయింది. అది వారి ప్రదర్శనలలో వ్యక్తమైందికూడా. రంగస్థలంపై దేశభక్తి గీతాలు పాడటంతో ఈ ధోరణి ప్రారంభమైంది. కళాకారులు తమ ప్రదర్శనల సమయంలో సందర్భోచితంగా ఈ పాటలను పాడేవారు. వాటిని రాజకీయ వేదికల నుండి కూడా ఆలపించారు. తదుపరి దశ దేశభక్తి నాటకాలను ప్రదర్శించారు.1876 నాటి అణచివేత నాటక ప్రదర్శనల చట్టం ఉన్నప్పటికీ ‘కాదరిన్ వెట్రి’ వంటి అనేక జాతీయవాద నాటకాలు ప్రదర్శించారు.
1920లో దేశవ్యాప్తంగా వ్యాపించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో నాటక కళాకారులు పాలుపంచుకోవడంతో వారి ప్రత్యక్ష రాజకీయ కార్యాచరణ తదుపరి సామాజిక స్పృహ దశగా నిలిచింది. చాలామంది సత్యాగ్రహంలో పాల్గొన్నారు. విదేశీ వస్త్రాలను తగలబెట్టారు. మద్యం దుకాణాల వద్ద పికెటింగ్ చేశారు. అరెస్టులను ఎదుర్కొన్నారు. ఈపరిణామంతో ఆలయం నుండి ఆ వర్గానికి లభించే స్థిరమైన ఆదాయం ఆగిపోయింది. అంతే గాక సంస్థానాలు, జమీందారులు క్రమంగా తమ అధికారాన్ని కోల్పోవడం ప్రారంభించారు. క్రమంగా ప్రదర్శన కళలకు లభించే ఆదరణ తగ్గింది. దాంతో ఈ వర్గానికి చెందిన అనేకమంది కళాకారులు స్థిరమైన ఆదాయాన్ని కల్పించే వాణిజ్య వినోద రంగంలోకి ప్రవేశించారు.
సినిమా రంగంలోకి ప్రవేశం
వాయిద్య సంగీతం, నృత్య శిక్షణలో నిపుణులుగా ఉండే మగవారు చాలామంది నాటక కంపెనీలలో చేరారు. వారు తమతో పాటు తమ ప్రదర్శనల సంకలనాన్ని తీసుకువెళ్లారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పలువురు ఇసై వెలలార్ కళాకారులు కంపెనీ నాటకాలలో చేరారు. గాత్ర సంగీతంలో శిక్షణ పొందడంతో మహిళలు రంగస్థల నటీమణులుగా చేరగా, పురుషులు వాద్యకారులుగా ఆర్కెస్ట్రా బృందంలో చేరారు. కొందరు పురుషులు పాటల రచయితలుగా ప్రవేశించి చివరికి నాటకాలకు దర్శకత్వం వహించారు. ‘సౌండ్ సినిమా’ వచ్చిన తర్వాత ఈ కళాకారులకు సినిమా రంగంలోకి ప్రవేశించడం తప్పనిసరి అయింది. మూకీ చిత్రాల కాలంలోనే గ్రామోఫోన్ డిస్కులు విడుదలైనప్పుడు సంగీతకారులు తమ గాత్రాన్ని రికార్డ్ చేయడానికి సంకోచించారు. కానీ కొంతమంది దేవదాసి గాయనులు మాత్రం తమ గాత్రాన్ని రికార్డ్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇందువల్ల వారిలో కొందరు గ్రామోఫోన్ కళాకారులుగా స్టార్ హోదాను పొందారు. ఓడియన్ వంటి కంపెనీలలో పి. శారదాంబాల్, షణ్ముగవడివు వంటి కళాకారులను ఉద్యోగులుగా ఉండేవారు. రికార్డింగ్ కళాకారులుగా వారికున్న ఖ్యాతి టాకీలలోకి ప్రవేశించడానికి కూడా సహాయపడింది. పి. శారదాంబాల్ ‘ప్రకాలత’ (1933) చిత్రంలో ప్రధాన పాత్రను కూడా పోషించింది.
క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి కళాకారులకు ఒక ప్రోత్సాహం లభించింది. అప్పటివరకు సమాజం నుండి వారు చిన్నచూపుకు, అవమానాలకు గురయ్యారు. తమ రాజకీయ క్రియాశీలత ద్వారా వారు ఇంతకుముందు లేని గౌరవాన్ని పొందారు. శతాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన కళాకారులు ఇప్పుడు రాజకీయ వేదికపై నాయకులతో పాటు గౌరవ స్థానాన్ని పొందారు. ప్రజలను ఆకర్షించడంలో కళాకారులకు ఉన్న సామర్థ్యాన్ని నాయకులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. అందుకే చలనచిత్ర నిర్మాతలు ఈ కళాకారుల కోసం వెతుక్కుంటూ వచ్చే సమయానికి ఆ నాటక సంస్థలు అప్పటికే రాజకీయమయం అయిపోయాయి. తమ ప్రదర్శనలలో అంతర్భాగంగా మారిన రాజకీయ భావజాలంతోనే ఈ కళాకారులు సినిమా రంగానికి వచ్చారు. తమిళనాట రాజకీయాలకు, సినిమాకు మధ్య సంబంధం మొదలవ్వడానికి ఇదే నాంది పలికింది. మొట్టమొదటి తమిళ టాకీ చిత్రం ‘కాళిదాస్’ పౌరాణిక ఇతివృత్తంతో కూడినదైనప్పటికీ, అందులో గాంధీజీని కీర్తించే ఒక పాట ఉండటం వెనుక కారణం ఇదే. ఈ వ్యాసంలో ఒకచోట ప్రస్తావించిన దేవదాసి షణ్ముఖవడివు కూతురే కర్ణాటక సంగీత విద్వన్మణిగా పేరుందిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి. చరిత్రకెక్కని ఈ అంశాలన్నింటినీ పై వారం ప్రస్తావించుకుందాం.
హెచ్.రమేష్‌బాబు,
93916 34727



