రాత్రి పదకొండు దాటింది. న్యూస్‌రూమ్‌లో ఇంకా గోల తగ్గలేదు. నేను కాసేపు స్క్రీన్ నుంచి కళ్లు తిప్పాను. అప్పుడే ఫోన్ వైబ్రేట్ అయింది. ఆమె మెసేజ్.
”బయటికి రా…”
”ఎక్కడికీ?” అని పంపాను.
ఒక లొకేషన్ వచ్చింది. కింద.. ”నువ్వు ఎప్పుడూ చూడని నా ప్రపంచానికి”
ఆసక్తి కలిగింది. అరగంట తర్వాత నేను ఓ కమర్షియల్ కాంప్లెక్స్ నాలుగో అంతస్తులోని చిన్న స్టూడియో ముందు నిలబడి ఉన్నాను. గ్లాస్ డోర్ మీద చిన్న ప్రకాశించే బోర్డు..CITY AFTER MIDNIGHT. . లోపల డిమ్ లైట్స్. గోడల మీద పాత సంగీత పోస్టర్లు. ఒక మూలలో కాఫీ మెషిన్. మధ్యలో చిన్న సౌండ్‌ప్రూఫ్ గది. అందులో ఆమె. హెడ్‌ఫోన్స్ పెట్టుకుని మైక్ ముందు కూర్చుంది. నన్ను చూసి చిన్నగా నవ్వి మైక్ వైపు తిరిగింది. అప్పుడే ఎర్ర లైట్ వెలిగింది. ON AIR
”ఇంకా నిద్రపోని వాళ్లందరికీ.. శుభరాత్రి. ఇది City After Midnight.. నేను మీ…”
ఆమె గొంతు ఎప్పుడూలేనంత మృదువుగా మారిపోయింది.
”ఈ రోజు మనం ఎవరికీ చెప్పకుండా మనలో పెట్టుకునే విషయాల గురించి మాట్లాడుకుందాం.”
ఫోన్ లైన్ వెలిగింది. మొదటి కాలర్ ఒక ఇంజినీరింగ్ విద్యార్థి.
”అక్కా.. నాకు ఏదీ చేయాలనిపించడం లేదు.”
ఆమె వెంటనే సలహా ఇవ్వలేదు. ఆ నిశ్శబ్దం తర్వాత అతనే మళ్లీ మాట్లాడాడు.
”ఇంట్లో అందరూ ర్యాంకులు, ఉద్యోగాల గురించే మాట్లాడుతుంటారు. కానీ నాకు ఉదయం లేవాలన్న ఆసక్తి కూడా ఉండట్లేదు.”
ఆమె కొద్దిసేపు మౌనంగా ఉంది.
”చివరిసారి మనస్ఫూర్తిగా నవ్వింది ఎప్పుడు?”
”గుర్తులేదు అక్కా.”
”సరే.. ఈ రాత్రికి దేనిగురించీ ఆలోచించకు. ముందు బాగా నిద్రపో.”
అబ్బాయి మెల్లగా నవ్వాడు
”థాంక్స్ అక్కా” కాల్ కట్ అయిపోయింది. తర్వాతి కాలర్ ఓ మహిళ. ఆమె మాట్లాడే ముందు కొంతసేపు లైన్లో నిశ్శబ్దం మాత్రమే వినిపించింది. తర్వాత నెమ్మదిగా..
”హలో..” అంది ఆ మహిళ.
”వింటున్నాను… చెప్పండి,”
అవతల నుంచి అలసిపోయిన గొంతు.
”రోజంతా అందరికీ అందుబాటులో ఉంటాను మేడమ్.. ఆఫీస్.. ఇల్లు.. పిల్లలు.. కానీ నేను అలసిపోయానని అడిగే మనిషి ఒక్కరూ లేరు.”
ఈసారి కూడా ఆమె వెంటనే మాట్లాడలేదు.
”మీరు చివరిసారి మీకోసం ఏం చేశారు?”
అవతల మౌనం. చాలాసేపటి తర్వాత… ”గుర్తులేదు.”
”మనల్ని మనం చూసుకోవడం కూడా అవసరమే కదా…” ఆ మాట చెబుతున్నప్పుడు ఆమె గొంతులో చిన్న కంపనం వినిపించింది. కొద్దిసేపటికి మ్యూజిక్ బ్రేక్ లో ఆమె బయటికి వచ్చింది.
”ఏంటి? అంతగా గమనిస్తున్నావు?” అంది కళ్లెగరేస్తూ.
”ఇది ఎప్పటి నుంచి చేస్తున్నావు?”
”కొన్ని నెలలుగా.”
”నాకు చెప్పలేదే.”
ఆమె కాఫీ మెషిన్ దగ్గర నిలబడి కప్ నింపుకుంది.
”కొన్ని పనులు చెప్తే చిన్నవైపోతాయి.”
”ఇంత రాత్రి.. ఇవన్నీ ఎందుకు?”
”రాత్రిళ్లు మనుషులు కొంచెం నిజాయితీగా మాట్లాడతారు రామ్… పగలు అందరూ పాత్రలు పోషించడంలో బిజీగా ఉంటారు.”
నేను ఆమెను జాగ్రత్తగా చూశాను. ఆమె గురించి నాకు తెలియని ప్రపంచం ఇంకా చాలా ఉందనిపించింది. లోపల నుంచి ప్రొడ్యూసర్ పిలిచాడు. ఆమె వెళ్లబోతూ అడిగింది.
”నువ్వెప్పుడైనా రేడియోకి కాల్ చేస్తావా?”
”లేదు.”
”తెలుసు. నువ్వు అన్నీ రాసేస్తావు”
అంటూ లోపలికి వెళ్లింది. బయట వర్షం మొదలైంది. ఆమె మైక్ దగ్గరికి వాలి అంది
”ఈ రోజు మాట్లాడిన వాళ్లందరికీ.. ఒక విషయం చెప్పాలనిపిస్తోంది. జీవితం మనమనుకున్నట్టుగా ఉండకపోవచ్చు… కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి.. మన మాట వినే ఒక్క మనిషి ఉన్నా చాలాసార్లు అదే సరిపోతుంది.”
ఆ మాట నన్ను ఎక్కడో తాకింది. కార్యక్రమం పూర్తయ్యేసరికి రాత్రి ఒకటి దాటింది. మేము టెర్రస్ మీదకి వెళ్లాం. వర్షం ఆగిపోయింది. ఆమె పారపెట్ మీద కూర్చుంది. నేను కొంచెం దూరంగా నిలబడ్డాను.
”ఇంతమంది అపరిచితుల బాధలు వింటుంటే నీకు భారం అనిపించదా?” అడిగాను.
”అనిపిస్తుంది రామ్.. కానీ సాటి మనిషి బాధలు వినకుండా ఉండటం ఇంకా ఎక్కువ భారం.”
కాసేపు ఆగి అంది.. ”వాళ్ల భారాన్ని దించలేకపోవచ్చు.. కానీ వాళ్లు ఒంటరిగా లేరని మాత్రం గుర్తు చేయొచ్చు.”
నేను ఏమీ మాట్లాడలేదు. వెళ్లి పక్కన కూర్చున్నాను. కొన్ని మాటలకు సమాధానం చెప్పకపోవడమే బాగుంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె మెల్లగా అడిగింది.
”ఈ రోజు నా గురించి కొత్తగా ఏమైనా తెలిసిందా?”
”నువ్వు నేను అనుకున్నదానికంటే చాలా పెద్ద ప్రపంచంలో ఉంటావు.”
”కొన్ని ప్రపంచాలు.. అందరికీ చూపించలేం రామ్.”
”మరి నాకు ఎందుకు చూపించావు?”
”నువ్వు ఎప్పుడూ నా ప్రపంచంలోకి రావాలని ప్రయత్నించలేదు. అందుకే.. నీకు చూపించాలనిపించింది.”
ఆ మాటతో నా లోపల ఏదో నెమ్మదిగా కదిలింది. గాలి ఒక్కసారిగా చల్లగా వీచింది.
”దగ్గరికి జరుగు” అంది.
నేను దగ్గరగా జరిగాను. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఆమె నెమ్మదిగా నా భుజంపై వాలి మెల్లగా అంది
”రామ్… ఈ రాత్రి గురించి రాయకు. కొన్ని రాత్రులు.. జ్ఞాపకంగా ఉండాలి. కథగా కాదు.”
నేను నవ్వాను. ఆ రాత్రి నాకు అర్థమైంది.. నాకు ఆమె తన ప్రపంచాన్ని చూపించలేదు. అందులో కొంచెం చోటిచ్చింది. కానీ ఆ చిన్న చోటు చాలా పెద్దదైపోయింది.
– రామ్
ON AIR
- Advertisement -
- Advertisement -


