Wednesday, May 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవెంటిలేటర్‌పై కాల్పుల విరమణ : ట్రంప్

వెంటిలేటర్‌పై కాల్పుల విరమణ : ట్రంప్

- Advertisement -

భారీ సైనిక చర్య అంటూ కవ్వింపులు… దాడి చేస్తే ప్రతిఘటిస్తాం : ఇరాన్

నవతెలంగాణ – జనరల్ డెస్క్
అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పరం ఒకరి శాంతి ప్రతిపాదనను మరొకరు తోసిపుచ్చిన నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుం టున్నాయి. ఇరాన్‌తో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ‘వెంటిలేటర’పై ఉన్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై పెద్ద ఎత్తు సైనిక చర్యను తిరిగి ప్రారంభించే విషయాన్ని ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నారని ఆయన సహాయకులు కొందరు తెలిపారు. కాగా ట్రంప్ బుధవారం చైనా పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చలు జరిపే వరకూ ఇరాన్‘అమెరికా మధ్య సంప్రదింపులలో పురోగతి ఉండక పోవచ్చునని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

అది ఓ చెత్త ప్రతిపాదన : ట్రంప్
అమెరికా శాంతి ప్రతిపాదనను ఇరాన్ తోసిపుచ్చిన తర్వాత ట్రంప్ ఒక ప్రకటన చేస్తూ టెహ్రాన్‌తో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ‘వెంటలేటర్’పై ఉన్నదని వ్యాఖ్యానిం చారు. ‘ఇరాన్ పంపిన చెత్తను చదివాను. పూర్తిగా కూడా చదవలేదు. అది చాలా పేలవంగా ఉంది. ఇప్పుడు కాల్పుల విరమణ లైఫ్ సపోర్ట్ మీద ఉంది’ అని అన్నారు. అమెరికా జనరల్స్‌తో సమావేశం అవుతానని, ఇరాన్ విషయంలో ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పారు.
దౌత్య యత్నాలు కొనసాగించండి : ఖతార్, కువైట్
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యం లో దౌత్య యత్నాలు కొనసాగించాలని ఖతార్ ప్రధాని మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, కువైట్ విదేశాంగ మంత్రి జర్రా జబర్ అల్ సబహ్ సూచించారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ప్రాంతీయ పరిణామాలు, కాల్పుల విరమణ, ప్రాంతీయ భద్రత`స్థిరత్వం కోసం ఉద్రిక్తతల నివారణకు జరుగుతున్న ప్రయత్నాలు తదితర అంశాలు చర్చకు వచ్చాయి.

అమెరికాను ఆశ్చర్యపరుస్తాం : ఇరాన్
ఒకవేళ అమెరికా దాడికి దిగితే దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం వెంటిలేటర్‌పై ఉన్నదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘలీబఫ్ స్పందిస్తూ ‘పొరబాటు వ్యూహం, పొరబాటు నిర్ణయం ఎప్పుడూ పొరబాటు ఫలితాలకే దారి తీస్తాయి. ఈ విషయం ప్రపంచానికి అంతటికీ తెలుసు. మేము అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాం. అమెరికాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాం’ అని చెప్పారు. కాగా ప్రస్తుతం యుద్ధం ఆగిపోయినందుకు ట్రంప్ సంతోషపడాల్సిన అవసరమేమీ లేదని, దీనిని ఆయన అమెరికా విజయంగా భావించనక్కరలేదని ఇరాన్ సుప్రీం నేత సలహాదారు అలీ అక్బర్ వెలయతి అన్నారు. ‘ఇరాన్ ప్రస్తుతం మౌనంగా ఉన్న విషయాన్ని మీ విజయంగా చూడకండి. బీజింగ్‌లో మీరు ఆనందంతో ప్రవేశించే పరిస్థితి ఏమీ లేదు’ అని చెప్పారు. ‘మేము మిమ్మల్ని యుద్ధ భూమిలో ఓడించాం. దౌత్యంలో విజయం సాధిస్తానని అనుకోకండి’ అని చురక వేశారు.

ట్రంప్‌పై డెమొక్రాట్ సెనెటర్ ఆగ్రహం
అమెరికా ప్రజలపై యుద్ధాన్ని రుద్దిన ట్రంప్‌పై డెమొక్రాట్ సెనెటర్ ఛక్ స్క్రూమర్ మండిపడ్డారు. ఎలాంటి లక్ష్యం లేకుండా సాగిస్తున్న ఈ పోరు చట్టవిరుద్ధమైనదని, ఖరీదైనదని ఆయన విమర్శించారు. వ్యయాన్ని నియంత్రించి, గందరగోళాన్ని నివారించాలంటే యుద్ధాన్ని ముగించడం ఒక్కటే మార్గమని చెప్పారు. యుద్ధ భూమి నుంచి అమెరికా సేనలను వెనక్కి రప్పించేందుకు వార్ పవర్స్ తీర్మానంపై డెమొక్రాట్లు ఏడోసారి ఓటింగుకు పట్టుపడతారని తెలిపారు. ఒకవేళ తీర్మానానికి వ్యతిరేకంగా రిపబ్లికన్లు ఓటేస్తే యుద్ధానికి వారినే నిందించాల్సి ఉంటుందని చెప్పారు.

ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు
ఐఆర్‌జీసీ ప్రయత్నం : బ్యాంకులను

అప్రమత్తం చేసిన అమెరికా తాను విధించిన ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రయత్నిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను అమెరికా అప్రమత్తం చేసింది. ఐఆర్‌జీసీకి ఎక్కడి నుంచి నిధులు అందుతున్నాయో గుర్తించి తమకు సమాచారం ఇవ్వాలని అమెరికా ఆర్థిక శాఖకు చెందిన ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెట్‌వర్క్ ఆయా సంస్థలను కోరింది.

జిన్‌పింగ్ శాంతి ప్రతిపాదనకు
ఇరాన్ మద్దతు

మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చేసిన నాలుగు సూత్రాల ప్రతిపాదనను సమర్ధిస్తామని బీజింగ్‌లో ఇరాన్ రాయబారిగా పనిచేస్తున్న అబ్దుల్‌రెజా రహ్మనీ ఫాజిల్ తెలిపారు. ఇరాన్‌లో చిరకాల భద్రతకు, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అభివృద్ధికి జిన్‌పింగ్ ప్రతిపాదించిన నాలుగు సూత్రాల ప్రణాళికకు మద్దతు తెలిపేందుకు ఇరాన్ సిద్ధమేనని ఆయన చెప్పారు. ఏప్రిల్‌లో అబూధాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జయేద్ అలీ నహ్యాన్‌తో సమావేశమైన సందర్భంగా జిన్‌పింగ్ ఈ ప్రతిపాదన చేశారు. ఇదిలావుండగా తాజా పరిణామాలపై ఇరాన్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులు మరోసారి టెలిఫోన్ సంభాషణ జరిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -