Tuesday, May 12, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిదెబ్బమీద దెబ్బ

దెబ్బమీద దెబ్బ

- Advertisement -

ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న వేళ.. ఎరువుల కంపెనీలు అదను చూసి రైతులను దెబ్బకొట్టాయి. అమెరికా- ఇరాన్‌ యుద్ధం వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయంటూ దేశంలోని ఎరువుల కంపెనీలు ధరలను భారీగా పెంచేశాయి. ఈ ధరలు తక్షణం అమల్లోకొస్తాయని తెలిపాయి. అంతర్జాతీయంగా గ్యాస్, చమురు, ముడి సరుకుల ధరల పెరుగుదల, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను సాకుగా చూపి సబ్సిడీ పెంచాలని కంపెనీలు కేంద్రాన్ని కోరాయి. కానీ, సబ్సిడీ పెంపునకు అంగీకరించకుండా కంపెనీలే ధరలు పెంచుకోవడానికి ‌మోడీ సర్కార్‌ అనుమతినిచ్చింది. అంతర్జాతీయంగా ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు కేంద్రమే ఆ భారాన్ని భరించి రైతులపై పడకుండా చూడాలి.

కానీ, కంపెనీలకే ఆ అధికారాన్ని అప్పగించడం ద్వారా ఈ ప్రభుత్వం రైతులపక్ష‍ం కాదు, కార్పొరేట్‌ ‌పక్ష‍మేనని మరోసారి రుజువైంది. ప్రస్తుతం కాంప్లెక్స్ ఎరువుల ధర యాభై కిలోల బస్తాపై రూ.225 నుంచి 300 వరకు, ఎంఓపీ (పొటాషియం) రేటు బస్తాకు రూ.125 పెరిగింది. ఇలాంటి ప్రభావం ఉన్నప్పుడు ఉత్పత్తి ఖర్చులు పెరిగితే కేంద్రం సబ్సిడీ ఇవ్వాలి. అంతేగాని ధరలు పెంచు కోవడానికి అనుమతి ఇవ్వడమేంటని రైతుసంఘాలు, మేధావుల ప్రశ్న. ప్రపంచ దేశాల్లో రైతు లను, వ్యవసాయాన్ని ఆదుకోవా లంటున్న ఆయా ప్రభుత్వాలు.. మన దేశంలో పాలకులు రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ వారిని సాగుకు దూరం చేస్తున్నాయి. ఇప్పటికే ధర బాగున్నా చీడపీడలతో మిరప దిగుబడులు పతనమయ్యాయి. ఎక్కువ మొత్తంలో మక్కలు దిగుబడులొచ్చినా ధర లేదు. వానాకాలంలో పత్తి, పెసర పంటలు అధిక వర్షాలతో దెబ్బతిన్నాయి. వరి పంట పరిస్థితి అప్పుడు ఇప్పుడూ అదే పరిస్థితి. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలై ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

పంటను అమ్ముకోలేకఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. కుప్పల మీదే ప్రాణాలు విడుస్తున్నారు. ఈ సమయంలో రైతులకు భరోసా కల్పించాల్సిన కేంద్రం ఎరువుల ధరలు పెంచడానికి అనుమతినివ్వడం బాధ్యత నుంచి తప్పుకోవడమే అవుతుంది. వ్యవసాయ రంగంలో విత్తనం తర్వాత అత్యంత కీలకమైనది ఎరువు. ముఖ్యంగా యూరియా, డీఏపీ, పొటాష్, ఎన్పీకే వంటి ఎరువులు లేకుండా సాగు అసాధ్యం. కానీ ఈ ఎరువుల ధరలు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి సరుకుల ధరలు పెరిగాయని, దిగుమతి ఖర్చులు అధికమ య్యాయని, ఉత్పత్తి వ్యయం పెరిగిందని కంపెనీలు చెబుతుంటాయి. పైకి కంపెనీలు చెప్పినట్టు కనిపిస్తున్నా.. ప్రభుత్వమే వారి చేత ఈ మాటలు చెప్పిస్తున్నదన్న విమర్శల్ని కొట్టిపారేయలేం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారాలను తమ మీద వేసుకోవడానికి సిద్ధపడటం లేదు.

గ్యాస్ ధరలు పెంచినప్పుడే ఒక్కొక్క దానిపై కేంద్రం భారాలు వేయడానికి సిద్ధమైంది. కాకపోతే రైతుల వ్యతిరేకత తమ వైపునకు రాకుండా జాగ్రత్తలు పడినట్టు అర్థమవుతోంది. యూరియా, డీఏపీలను మినహాయించి మిగతా కాంప్లెక్స్ ధరలు పెంచుకునేందుకు అంగీకారం తెలిపినా, వాటి ధరలు కూడా త్వరలో పెరగడం ఖాయం! ప్రభుత్వాలు రైతును దేశానికి అన్నదాత అని కొనియాడుతుంటాయి. ఎన్నికల సమయంలో రైతు సంక్షేమం గురించి పెద్ద పెద్ద హామీలిస్తాయి. కానీ వాస్తవ పరిస్థితుల్లో రైతుకు అత్యవసరమైన సబ్సిడీలు ఇవ్వడానికి సంకోచిస్తున్నాయి. కంపెనీల లాభాల కోసం రైతు ప్రయోజనాలను పక్కనపెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తున్నామని చెప్తున్నా అదంతా ఒక బూటకం. సబ్సిడీ ఎక్కువగా ఎవరికి అందుతున్నదో అందరికీ తెలిసిన విషయమే.

సాగు ఖర్చులు మరింత పెరిగితే రైతులు వ్యవసాయం వదిలేయడమేనా? రైతు బలహీనపడితే దేశం బలహీనపడినట్టే అనే విషయాన్ని పాలకులు ఎందుకు గుర్తించడం లేదు? వ్యవసాయరంగం ఇప్పటికే అనేక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితులతో కుదేలవుతున్నది. అస్థిర మార్కెట్, పంటలు సరైన దిగుబడులు రాకపోవడం, గిట్టుబాటు ధరలు లభించకపోవడం, పెరుగుతున్న సాగు వ్యయం, అప్పులభారం వంటి సమస్యలతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు’ ఎరువుల ధరలు పెంచుకునేందుకు కంపెనీలకు కేంద్రం అనుమతినివ్వడం అన్యాయం. ఇది భవిష్యత్తులో వ్యవసాయరంగానికి పెద్ద ప్రమాదంగా పరిణమించనుంది. ఎందుకంటే, వ్యవసాయానికి ప్రాణాధారమైన ఎరువుల ధరలు పెంపుదల కేవలం రైతుపైనే కాదు, దేశ ఆహార భద్రతపై కూడా తీవ్రమైన ప్రభావం చూపే నిర్ణయం. ఇప్పటికైనా కంపెనీల లాభాల కంటే రైతు ప్రయోజనాలను ‌కాపాడే విధంగా కేంద్రసర్కార్‌ ‌వ్యవహరించాలి. లేదంటే రైతుక్ష‍ేత్రంలో దోషిగా నిలబడక తప్పదు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -