నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన ఫోక్సో కేసు నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) పార్టీ డిమాండ్ చేసింది. గురువారం చౌటుప్పల్ బస్టాండ్ ఎదుట సీపీఐ(ఎం) మున్సిపల్, మండల కమిటీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 17 ఏళ్ల మైనర్ బాలికను మానసికంగా, లైంగికంగా వేధించిన కేసులో భగీరథ్‌పై ఫిర్యాదు నమోదైనా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. బేటీ బచావో అని చెప్పే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో మౌనంగా ఉండడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఫోక్సో కేసు నమోదైన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహించి బండి సంజయ్ మంత్రి పదవికి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు నాయకులు చీక సంజీవరెడ్డి,బత్తుల శ్రీశైలం గౌడ్,చీర్క అలివేలు,బోయ యాదయ్య, పొట్ట శ్రీనివాస్, ఆకుల ధర్మయ్య,కందగట్ల ఆనంద్, కొండే శ్రీశైలం, కొంతం శ్రీనివాస్ రెడ్డి, బత్తుల రామచంద్రం, బాలగోని బాలరాజు, ఫక్కీరు పెంటారెడ్డి, జగ్గం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


