నవతెలంగాణ-వనపర్తి: భవిష్యత్తులో వచ్చే ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోడానికి జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో వచ్చే పర్యావరణ విపత్తులను ఏవిధంగా ఎదుర్కోవాలి ఎలా సన్నద్ధం కావాలి అనే అంశాల పై కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా టేబుల్ ప్రాక్టీస్ కు ఆదేశించగా శుక్రవారం కలెక్టర్ ఎన్.ఐ.సి. హాల్లో ఆయా శాఖల అధికారులు టేబుల్ టాప్ శిక్షణ పొందారు.
హైదరాబాద్ నుండి కేంద్ర పర్యావరణ విపత్తు సంస్థ మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ డైరెక్టర్ నుండి మేజర్ జనరల్ సుధీర్ బేహాల్, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ హరిచందన దాసరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వివరిస్తూ వనపర్తి జిల్లాలో సాధారణంగా కృష్ణా నదిలో ప్రవాహం పెరిగి వరదలు వచ్చే ప్రమాదం ఉంటుందని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ప్రమాదాలు సంభవిస్తే, ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ఆయా ప్రభుత్వ శాఖలు ఏ విధంగా స్పందించాలి, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు ఏమిటి అన్నదానిపై కార్యాచరణ రూపొందించుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే సిద్దం చేసుకున్న కార్యాచరణ ప్రణాళికతో మే 18వ తేదీన ఉదయం 9 గంటల నుండి జిల్లాలోని ఎంపిక చేసిన 7 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ చేయనున్నట్లు తెలిపారు.
మాక్ డ్రిల్ చేసేందుకు 1. గడ్డ బస్వాపూర్ గ్రామం, చిన్నంబావి మండలం, 2.జూరాల ప్రాజెక్ట్ ఎడమ కాలువ, అమర్చింత మండలం, 3.శంకరంపేట వాగు, మదనపూర్ మండలం, 4.భగీరథ కాలనీ, వనపర్తి 5. నల్లచెరువు, 6. మర్రికుంట 7.ప్రభుత్వ ఆసుపత్రి, వనపర్తి ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. గుర్తించిన అన్ని 7 ప్రాంతాలకు ఇంచార్జి అధికారులను నియమించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ మీనా, అందరూ జిల్లా అధికారులు పాల్గొన్నారు.



