రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి
నవతెలంగాణ-అచ్చంపేట
పట్టణంలోని మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా వసుతులు, సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి కొనుగోలు జరుగుతున్న ధాన్యం నాణ్యత, తూకాల విధానం, రికార్డుల నిర్వహణ, నిల్వ సదుపాయాలు, హమాలి మరియు రవాణా ఏర్పాట్లపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకున్నారు. హమాలి కొరత, రవాణా ఆలస్యం వంటి సమస్యలను రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి గింజకు సరైన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చినప్పుడు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి లేకుండా త్వరితగతిన ధాన్యం స్వీకరణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా తూకాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితత్వంతో వ్యవహరించాలన్నారు.
రైతుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకత పాటించాలని సూచించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా ధాన్యం కొనుగోలు పూర్తైన వెంటనే సంబంధిత ప్రక్రియలు పూర్తి చేసి వారి బ్యాంకు ఖాతాల్లో త్వరితగతిన డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
అలాగే కొనుగోలు కేంద్రంలో రైతులకు తాగునీరు, నీడ, కూర్చునే సదుపాయాలు, విశ్రాంతి ఏర్పాట్లు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని, పరిశీలన సందర్భంగా కొనుగోలు కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డులను కూడా పరిశీలించి, అన్ని వివరాలు సక్రమంగా నమోదు చేయాలని, ధాన్యం నిల్వ విషయంలో నాణ్యత దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రవాణా ప్రక్రియ వేగవంతంగా ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట అచ్చంపేట ఆర్డిఓ యాదగిరి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.



