నవతెలంగాణ-హైదరాబాద్: ట్రంప్ ప్రభుత్వ హయాంలో విధించిన సుంకాల పేరుతో తమ నుండి అక్రమంగా వసూలు చేసిన అదనపు ఖర్చులను తిరిగి చెల్లించాలని కోరుతూ ‘అమెజాన్’పై వినియోగదారులు శుక్రవారం సియాటిల్‌లోని ఫెడరల్ కోర్టులో దావా వేశారు. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపిస్తూ, అమెజాన్ వందల మిలియన్ల డాలర్లను అక్రమంగా తన వద్దే ఉంచుకుందని పిటిషనర్లు ఆరోపించారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (ఐఇఇపిఎ) ఉపయోగించి భారీ సుంకాలను విధించడంలో అధ్యక్షుడు ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని గత ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తీర్పును వెలువరించింది. తీర్పులో ఆ సుంకాల విధింపు చట్టవిరుద్ధమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే, టారిఫ్‌ల పేరుతో అమెజాన్ దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలను భారీగా పెంచి, వినియోగదారుల నుండి వందల మిలియన్ల డాలర్లను అక్రమంగా వసూలు చేసిందని వినియోగదారులు దావాలో ఆరోపించారు.
కోర్టు తీర్పు తర్వాత అమెరికాలోని వేలాది కంపెనీలు ప్రభుత్వం నుండి బిలియన్ల డాలర్ల రీఫండ్లను కోరాయి. అయితే, అన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ అమెజాన్ మాత్రం ప్రభుత్వం నుండి రీఫండ్ కోరలేదు. ఆ నిధులు ట్రంప్ ప్రభుత్వానికే దక్కేలా చేయడం ద్వారా ఆయనను మెప్పించేందుకు అమెజాన్ ప్రయత్నించిందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇప్పటికే రద్దయిన ఐఇఇపిఎ టారిఫ్‌లను భర్తీ చేయడానికి వసూలు చేసిన ఈ నిధులు ముమ్మాటికీ వినియోగదారులవేనని దావా పేర్కొంది. వీటిని రీఫండ్ చేయకపోవడం ద్వారా అమెజాన్ అక్రమంగా లాభపడటమే కాకుండా, ‘వాషింగ్టన్ రాష్ట్ర వినియోగదారుల రక్షణ చట్టాన్ని’ ఉల్లంఘించిందని స్పష్టం చేశారు. కాస్ట్‌కో , నైక్, ఫెడెక్స్ వంటి ప్రముఖ సంస్థలు టారిఫ్ రీఫండ్లను చెల్లించడంలో విఫలమయ్యాయంటూ గతంలో వినియోగదారులు కోర్టులను ఆశ్రయించారు.



