Tuesday, May 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డి నీటి సమస్య పరిష్కారానికి షబ్బీర్ అలీ కృషి అభినందనీయం

కామారెడ్డి నీటి సమస్య పరిష్కారానికి షబ్బీర్ అలీ కృషి అభినందనీయం

- Advertisement -

– మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో గతంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కీలక పాత్ర పోషించారని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇరవై సంవత్సరాల క్రితం కామారెడ్డి ప్రాంతంలో వేసవి కాలంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొనేదని, ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో కృషి చేశారని పేర్కొన్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి దాదాపు 110 కిలోమీటర్ల దూరం వరకు పైపులైన్లు వేసి గోదావరి జలాలను కామారెడ్డికి తీసుకువచ్చారని, మల్లన్నగుట్ట వద్ద ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి గ్రామాలకు తాగునీరు అందించారని తెలిపారు.

దీంతో దాదాపు పదేళ్ల పాటు ప్రాంతానికి తాగునీటి సమస్యలేకుండా పోయిందన్నారు. పట్టణ విస్తరణతో నీటి అవసరాలు పెరగడంతో కొత్త పైప్‌లైన్ల ఏర్పాటుకు ఫారెస్ట్, ఆర్‌అండ్‌బి శాఖల అనుమతుల్లో ఎదురైన ఆటంకాలను కూడా షబ్బీర్ అలీ స్వయంగా చొరవ తీసుకుని పరిష్కరించారని చెప్పారు. ప్రస్తుతం పైప్‌లైన్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గత ప్రభుత్వ హయాంలో ఉన్న 4 MLD నీటి సరఫరా 19 MLDలకు పెరగనుందని పేర్కొన్నారు. ఈ వేసవి ప్రారంభం నుంచే షబ్బీర్ అలీ ప్రతిరోజూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పట్టణానికి రోజుకు 8 నుంచి 10 MLD నీటిని అందించేలా చర్యలు చేపట్టారని తెలిపారు. గతంలో ప్రతి వేసవిలో వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వచ్చేదని, ప్రస్తుతం పట్టణంలో ట్యాంకర్ల అవసరం లేకుండా నల్లాల ద్వారానే తాగునీరు సరఫరా అవుతోందన్నారు.

అమృత్ 2.0 పథకం కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో, షబ్బీర్ అలీ సహకారంతో పట్టణానికి మరో 9 వాటర్ ట్యాంకులు మంజూరయ్యాయని చెప్పారు. ప్రస్తుతం 10 ట్యాంకులు ఉండగా, కొత్తగా రూ.11.89 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ట్యాంకులు పూర్తయితే 19 MLD నీటి సరఫరాతో సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని వెల్లడించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న షబ్బీర్ అలీకి కామారెడ్డి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఉమారాణి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంతరావు, ఏఈ వినోద్, కౌన్సిలర్లు వాజీద్, జావేద్, అంజాద్, బబ్లు, కాళ్ల గణేష్, కళ్లెం సత్యం, అన్వర్, లడ్డు, సిద్ధిక్, యూనస్, చిట్టిబాబు, భూపతిపట్టణ అధ్యక్షులు సందీప్, గాజీ, గంప ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -