Thursday, May 21, 2026
E-PAPER
Homeజాతీయంప్రశ్నే నేరమా?

ప్రశ్నే నేరమా?

- Advertisement -

పాత్రికేయుల ప్రశ్నలకు ముఖం చాటేస్తున్న మోడీ
విదేశాల్లో అభాసుపాలవుతున్న భారత పత్రికాస్వేచ్ఛ


న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం గత పుష్కర కాలంగా మీడియా గొంతు నొక్కుతూనే ఉంది. పాత్రికేయులు సంధించే ప్రశ్నల నుచి తప్పించుకోవడం లేదా సమాచారాన్ని నిరాకరించడం లేదా ఆ సమాచారం వారికి అందుబాటులో లేకుండా చేయడం సర్వసాధారణంగా మారింది. సాక్షాత్తూ ప్రధానమంత్రి ఈ కాలంలో స్వదేశంలో కనీసం ఒక్కటంటే ఒక్క పత్రికా సమావేశాన్ని కూడా నిర్వహించలేదు. స్వతంత్ర భారత చరిత్రలో ఈ విధంగా జరగడం ఇదే మొదటిసారి. అయితే కొన్ని సందర్భాలలో పాత్రికేయుల ప్రశ్నలను ఎదుర్కోవడం ప్రధానికి తప్పడం లేదు. ముఖ్యంగా విదేశీ పర్యటనలలో ఈ అనుభవం ఎదురవుతోంది. తాజాగా నార్వేలో పర్యటించిన ప్రధాని మోడీని డాగ్సావిసెన్‌ పత్రిక వ్యాఖ్యాత హెల్‌ లింగ్‌ కొన్ని ప్రశ్నలు అడిగారు. మోడీతో పాటు భారత అధికారుల బృందం కూడా వాటిని విన్నది. అయితే ఆమె ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే మోడీ పత్రికా సమావేశం నుంచి నిష్క్రమించారు.

ప్రశ్నించే అవకాశమే ఉండదు
ఆ తర్వాత భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి హెల్‌ లింగ్‌ను ఆహ్వానించారు. ఆమె అడిగిన ప్రశ్నలకు డొంకతిరుగుడు సమాధానాలే ఇచ్చారు తప్పించి సూటిగా బదులివ్వలేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా మోడీ భారత పత్రికల నుంచి విమర్శనాత్మక ప్రశ్నలు స్వీకరిస్తారా అని లింగ్‌ ప్రశ్నించగా దౌత్యవేత్త సమాధానం ఇవ్వలేదు. ఇదిలావుంటే మరో ప్రభుత్వాధినేతతో కలిసి పత్రికల వారితో మాట్లాడేటప్పుడు ప్రశ్నలను ఎదుర్కోవడానికి మోడీ ఇష్టపడరని అనేక సందర్భాలలో రుజువైంది. ప్రధానిని ప్రశ్నించే అవకాశమే ఉండకపోవడం దీనికి కారణం. ఉదాహరణకు మోడీ తన నివాసంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆతిథ్యం ఇచ్చినప్పుడు వాషింగ్టన్‌ పాత్రికేయులకు ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఇవ్వలేదు.

ప్రజలకు సమాచారం చేరేదెలా?
పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వాధినేత సమాధానాలు ఇవ్వనప్పుడు ప్రజలకు సమాచారం ఎలా చేరుతుంది? జరుగుతున్న పరిణామాలను వారు ఎలా అర్థం చేసుకుంటారు? ఆందోళనలు, సందేహాలు వ్యక్తం చేయడానికి, సమస్యలను లేవనెత్తడానికి దారులు అంతకంతకూ మూసుకుపోతాయి. ప్రజాస్వామ్యం అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటేసి ఆ తర్వాత నోరు మూసుకోమని చెప్పడం కాదు. అది నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వ పాలనలో అయినా అది తప్పదు. ప్రజలకు సరైన సమాచారాన్ని చేరవేసేది మీడియాయే. కాబట్టి మీడియాను తన పని తాను చేసుకోనివ్వాల్సి ఉంటుంది. సమాధానాలు చెప్పకపోయినా ప్రశ్నలను స్వీకరించడం అనేది ప్రధాని జవాబుదారీతనాన్ని సూచిస్తుంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీకి ఓటరు వేసే ప్రతి ఓటు తనకేనని మోడీ విశ్వసిస్తారు. అధికారాన్ని అనుభవించే వ్యక్తులకు బాధ్యతలు కూడా ఉంటాయి. తన పదవి ‘దైవికమైనది’ అని మోడీ తరచూ చెబుతుంటారు. మరి అలాంటప్పుడు ప్రశ్నలను ఎదుర్కోవడానికి ఆయన ఎందుకు ఇబ్బంది పడుతున్నారో అర్థం కాదు. పైగా పాత్రికేయులు అడిగే ప్రశ్నలు వర్తమానానికి సంబంధించినవే. వాటికి కూడా జవాబు ఇవ్వకపోవడం అంటే అన్నింటికీ తాను అతీతుడినని చెప్పడమే అవుతుంది.

మీడియా ఏం చేయాలి?
కార్యనిర్వాహక వ్యవస్థ నేరుగా పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది. కానీ ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాతో సహా అనేక సంస్థలకు కూడా అది జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది. మీడియా కూడా కార్యనిర్వాహక వ్యవస్థను ప్రశ్నించాలి. సమాధానాన్ని నిరాకరించడం అంటే కార్యనిర్వాహక వ్యవస్థకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమే అవుతుంది. కేవలం పాలకులు, అధికారులు చెప్పే విషయాలను వినడం, వారిని పొగడ్తలతో ముంచెత్తడం మీడియా పని కాదు. అది ప్రభుత్వం తరఫున మాట్లాడే వారి పని. ఇక్కడ లింగ్‌ చెప్పిన మాటలను ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఆమె ఏమన్నారంటే ‘పాత్రికేయ వృత్తి కొన్ని సందర్భాలలో ఘర్షణపూరితంగా ఉంటుంది. మేము సమాధానాలను ఆశిస్తాము. ఒకవేళ నా ప్రశ్నలకు సరైన సమాధానాలు రాకపోతే అడ్డుపడి మరింత స్పష్టమైన సమాధానాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తాను. అది నా పని…కర్తవ్యం. నాకు సమాధానాలు కావాలి. కేవలం వారు చెప్పేది మాత్రమే కాదు’. ప్రజలను గొర్రెల మందలా మార్చకూడదని అనుకుంటే లేదా వారిని మౌనంగా ఉంచకూడదని అనుకుంటే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిందే.

దిగజారిన ‘ఫోర్త్‌ ఎస్టేట్‌’ పరిస్థితి
ప్రభుత్వ మద్దతుదారులు, పాత్రికేయుల గొంతు నొక్కాలని చూసేవారు గతంలో లింగ్‌ను వ్యక్తిగతంగా ట్రోల్‌ చేసిన ఉదంతాలు ఉన్నాయి. 2023లో ఆమె ఆన్‌లైన్‌ వేధింపులకు గురయ్యారు. మైనారిటీల విషయంలో భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మోడీని ప్రశ్నించిన అమెరికా మహిళా పాత్రికేయురాలి విషయంలో కూడా గతంలో ఇలాగే జరిగింది. అసభ్యకరమైన, అశ్లీలమైన ట్రోల్స్‌తో బాధించడంతో చివరికి శ్వేతసౌధం ఆమెకు మద్దతుగా నిలిచింది. అత్యున్నత స్థానాలలో ఉన్న కొందరు వ్యక్తులు ఇలంటి ట్రోల్స్‌ను ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో నార్వే ఒకటో స్థానంలో ఉండగా భారత్‌ 157వ స్థానంలో ఉండడాన్ని చూస్తుంటే దేశంలో ‘ఫోర్త్‌ ఎస్టేట్‌’ పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -