Thursday, May 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమెడికల్ రిప్‌లు.. వైట్‌కాలర్ బానిసలు

మెడికల్ రిప్‌లు.. వైట్‌కాలర్ బానిసలు

- Advertisement -

మెడికల్ ఏజెన్సీలకు సొంత వేతనాల నుంచి చెల్లింపులు
అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్ మీటింగ్‌లు
వైద్యుల వద్ద గంటల పాటు పడిగాపులు
కార్మిక చట్టాల రద్దుతో అదనపు పని గంటల కోసం కంపెనీల ఒత్తిడి

నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఐరన్ చేసిన షర్ట్, ప్యాంట్‌తో టక్ వేసుకొని, టై కట్టుకొని డ్యూటీకి వెళ్తుంటే.. చూసే వారికి ఎంత పెద్ద డ్యూటీ చేస్తున్నారో, ఎన్ని లక్షల జీతం వస్తుందోనని భావిస్తుంటారు. కానీ ఆ టక్, టై వెనుక లెక్కలేనన్ని టెన్షన్‌లతో మెడికల్ రిప్రజెంటెటీవ్‌లు విధులు నిర్వర్తిం చాల్సిన వస్తోందని ఎంతమందికి తెలుసు. పొద్దున లేచింది మొదలు వేధింపులు.. వైద్యుల వద్దకు వెళ్తే గంటల పాటు పడిగాపులు నిత్యకృత్యం. దీనికి తోడు అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్ మీటింగ్‌లు. ఇంత చేసినా వచ్చే వేతనం అంతంత మాత్రమే. పైగా బిల్లింగ్ చేసినందుకు మెడికల్ రిప్‌ల వేతనాల నుంచి ఎంతో కొంత చెల్లించాల్సిన పరిస్థితి. రిప్‌ లు పేరుకు వైట్ కాలర్ జాబ్ చేస్తున్నా ఫార్మా కంపెనీలకు కట్టు బానిసలుగా మారారు. దీనికి తోడు తాజాగా కార్మిక చట్టాలు రద్దు, నాలుగు లేబర్ కోడ్‌లు అమల్లోకి రావడంతో వారి ఉద్యోగ భద్రతే ప్రశ్నార్థకంగా మారింది. వారి సాధకబాధకాలపై ‘నవతెలంగాణ’ ప్రత్యేక కథనం.

మెడికల్ రిప్రజెంటెటీవ్‌లు అటు ఫార్మా కంపెనీలకు, ఇటు వైద్యులకు వారధిగా ఉంటూ ఆయా కంపెనీలు తీసుకొచ్చే మెడిసిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8500 మంది మెడికల్ రిప్‌లున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి మందికి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వీరి రక్షణకు గతంలో 1976- ఎస్‌పీఈ (సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్) అమల్లో ఉండేది. దాంతో పని గంటలు మొదలు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, సెలవులు, గ్రాడ్యూటీ తదితరాలు అమల్లో ఉండేవి. అంత పకడ్బందీగా చట్టం అమల్లో ఉన్నప్పటికీ కంపెనీలు రిప్‌లపై అనేక ఒత్తిళ్లు పెట్టేవి. ప్రధానంగా ప్రతి నెలా ఒక్కో కంపెనీ ఒక్కో ఉద్యోగికి రూ.5 లక్షలు మొదలు రూ.15 లక్షల వరకు టార్గెట్ విధిస్తుండటం గమనార్హం. దాంతో నిత్యం టార్గెట్‌పైనే టెన్షన్ టెన్షన్‌గా బతుకులు సాగిస్తున్నారు.

జీపీఆర్‌ఎస్‌తో నిత్యం ట్రాకింగ్
సాధారణంగా సాయంత్రం 6 గంటలకు మెడికల్ రిప్స్ విధులు పూర్తి కావాల్సి ఉండగా.. అర్ధరాత్రి 11, 12 గంటల వరకు ఆన్‌లైన్‌లో మీటింగ్‌లు పెడుతూ ఒత్తిడి చేస్తుంటారని రిప్స్ వాపోయారు. చేసేది ఫార్మా కంపెనీల్లో అయినా చిన్న వయస్సులోనే బీపీ, షుగర్ లాంటి రోగాల బారిన పడుతున్నారు. పైగా 150 కిలో మీటర్ల పరిధిలో ఉన్న చుట్టుపక్కల జిల్లాలకు తిరగాల్సిందే. నిజామాబాద్ కేంద్రంగా పని చేసే వారు.. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి తదితర జిల్లాలకు సైతం నిత్యం వెళ్లిరావాల్సిందే. ఇంత చేస్తున్నా వేతనాలు పెరగకపోగా.. ప్రతి నెలా టార్గెట్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఫార్మా కంపెనీలు ఒక వైపు ఆన్‌లైన్‌లో మందులు విక్రయిస్తూ.. మరో వైపు ఆఫ్‌లైన్‌లు రిప్‌లకు టార్గెట్ విధిస్తున్నారు.

లేబర్ కోడ్‌లతో ఉద్యోగ భద్రతకు ముప్పు
గతంలో చట్టాలు బలంగా ఉండటంతో కొంత మేర ఉద్యోగ భద్రత ఉండేది. ప్రస్తుతం కార్మికచట్టాలన్నీ రద్దు చేయడంతో 1976- ఎస్‌పీఈ చట్టం రద్దయ్యి లేబర్ కోడ్‌లు అమల్లోకి రావడంతో ప్రస్తుతం ఉద్యోగ భద్రతకు ముప్ప్పు వాటిల్లిందని మెడికల్ రిప్‌లు వాపోతున్నారు. సమయానికి తిండి, నీళ్లు లేక తిరుగుతున్న తమకు.. లేబర్ కోడ్‌లతో పని గంటల్లో మార్పు వచ్చిందని, కంపెనీలు
మరింత ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.

ఉద్యోగం నుంచి
తొలగిస్తామని బెదిరింపులు
పేరుకు వైట్ కాలర్ జాబ్ చేస్తున్నా.. లోపల అంతా డొల్ల. నిత్యం టార్గెట్ కోసం వేధింపులు. టార్గెట్ చేరుకోకపోతే ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఇందుకోసం కంపెనీలు ప్రతి నెలా మీటింగ్ పెట్టి టార్చర్ పెడుతున్నాయి. కార్మిక చట్టాల రద్దుతో మా ఉద్యోగ భద్రతే ప్రశ్నార్థకంగా మారింది. పాత చట్టాలనే అమల్లోకి తీసుకురావాలి.
శ్రీనివాస్ రాజ్, టీఎంఎస్‌ఆర్‌యూ అధ్యక్షులు, నిజామాబాద్

జాబ్ పర్మినెంట్ కలే
గతంలో 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారికి గ్రాడ్యూటీ వచ్చేది. దాన్ని ఒక సంవత్సరానికి మార్చడంతో మా ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఏడాది సర్వీస్ పూర్తి కాగానే ఏదో ఒక కారణంతో తొలగించే అవకాశం ఉంది. ఇక పర్మినెంట్ చేసే అవకాశం లేదు. గంగమోహన్. టీఎంఎ‌స్ఆర్‌యూ జిల్లా కార్యదర్శి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -