Thursday, May 21, 2026
E-PAPER
Homeజాతీయంరూ.5,000 కోట్ల ప్రత్యేక సహాయం ఇవ్వండి

రూ.5,000 కోట్ల ప్రత్యేక సహాయం ఇవ్వండి

- Advertisement -

​కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
​కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వినతి ​ఎస్ఏఎస్‌సీఐ కింద రూ.5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని, విద్యా రంగ పెట్టుబడులకు ఎఫ్ఆర్బీఎం మినహాయింపు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. బుధవారం నాడిక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిశారు. రాష్ట్ర అభివృద్ధి, విద్యా రంగంలో చేపడుతున్న భారీ పెట్టుబడులు, మూలధన వ్యయాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ఇప్పటికే రూ.4,208 కోట్లు మంజూరైన విషయాన్ని ప్రస్తావిస్తూనే రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు మరింత ఆర్థిక మద్దతు అవసరమని వివరించారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో నూతనంగా ఏర్పడిన రాష్ట్రాలలో ఒకటిగా వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, 2014 నుంచి 2023 మధ్య ప్రత్యేక ప్రయోజన సంస్థలు (ఎస్పీవీలు) ద్వారా చేపట్టిన అప్పుల భారం, వాటి చెల్లింపుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు. అయినప్పటికీ విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో పెట్టుబడులు కొనసాగిస్తోందని తెలిపారు.

​ప్రత్యేకంగా “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్” ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. జిల్లాల వారీగా కొత్త మెడికల్ కళాశాలలు, గ్రామీణ ఆరోగ్య సేవల విస్తరణ, విద్యా మౌలిక వసతుల బలోపేతం వంటి కార్యక్రమాలు సామాజిక సమానత్వంతో కూడిన సుస్థిర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. అదేవిధంగా, విద్యా రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న భారీ పెట్టుబడులకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రికి మరో వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ రూపాంతరానికి మొత్తం రూ.30,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళిక రూపొందించిందని, ఇందులో రూ.21,000 కోట్లతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ క్యాంపస్‌ల నిర్మాణం, మరో రూ.9,000 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, సాంకేతిక విద్యాసంస్థలు, డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధి చేపడుతున్నట్టు వివరించారు.

​ఈ క్రమంలో ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) సహకారంతో రూ.4,049.11 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రాజెక్ట్, ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సహకారంతో రూ.4,903.44 కోట్ల వ్యయంతో తెలంగాణ ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడేషన్ మిషన్ ప్రాజెక్టులకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆమోదం తెలిపినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన రుణాలను రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని ఉప ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇవి సాధారణ ఖర్చులు కాకుండా, భవిష్యత్ తరాల మానవ వనరుల అభివృద్ధికి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యా సాధికారతకు దోహదపడే దీర్ఘకాలిక మూలధన పెట్టుబడులని పేర్కొన్నారు. “వికసిత భారత్–2047” లక్ష్య సాధనలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విద్యా, మౌలిక వసతుల పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని, కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన మద్దతు లభిస్తే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉప ముఖ్యమంత్రి వెంట ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ గౌరవ్‌ ఉప్పల్ ఉన్నారు.

సింగరేణికి సహకారం అందించండి : కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి ‌డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి
సింగరేణికి సహకారం అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. బుధవారం నాడిక్కడ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు . ఈ సమావేశంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భవిష్యత్ ప్రణాళికలు, బొగ్గు గ్యాసిఫికేషన్ అవకాశాలు, కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపు, తాడిచెర్ల కోల్ బ్లాక్–II మైనింగ్ లీజ్ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ బొగ్గును కేవలం సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికే పరిమితం చేయకుండా, భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విలువ ఆధారితంగా వినియోగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా బొగ్గు గ్యాసిఫికేషన్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, సింగరేణి కూడా ఆ దిశగా ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రికి వివరించారు. కోల్ ఇండియా చేపడుతున్న గ్యాసిఫికేషన్ కార్యక్రమాల తరహాలోనే, సింగరేణి కూడా తన బొగ్గు వనరులను ఆధునిక సాంకేతికతతో మరింత సమర్థవంతంగా వినియోగించే అవకాశాలను పరిశీలిస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు వనరులకు అదనపు విలువ కల్పించడంతో పాటు, ఇంధన భద్రత, పారిశ్రామిక వినియోగాలు, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని అన్నారు. ఇందుకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకత్వం, విధానపరమైన సహకారంతో పాటు కేంద్ర పథకాల అనుసంధానంలో బొగ్గు మంత్రిత్వ శాఖ సహకారం అందించాలని కోరారు. విష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సింగరేణికి కొత్త బొగ్గు వనరుల సమీకరణ అత్యవసరమని తెలిపారు.

రాష్ట్ర విద్యుత్‌ అవసరాలకు కొయ్యగూడెం బ్లాక్‌ 3 ‌కీలకం
గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్స్ పరిధిలోని కొయ్యగూడెం బ్లాక్–3 తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలకు కీలకమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఈ బ్లాక్ వేలంలో కేటాయించబడినప్పటికీ నాలుగేండ్లు గడిచినా కార్యకలాపాలు ప్రారంభం కాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో కొయ్యగూడెం బ్లాక్–3ను సింగరేణికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తాడిచెర్ల కోల్ బ్లాక్–II అంశంపైనా సమావేశంలో చర్చించారు. ఈ బ్లాక్‌కు సంబంధించి సింగరేణి ఇప్పటికే ప్రీ-మైనింగ్ కార్యకలాపాలు, అన్వేషణ పనులు చేపట్టిందని, మైనింగ్ లీజ్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి వివరించారు. తాడిచెర్ల కోల్ బ్లాక్–II అభివృద్ధి సింగరేణి భవిష్యత్ అవసరాలకు, తెలంగాణ విద్యుత్ భద్రతకు కీలకమని చెప్పారు. ​తాడిచెర్ల కోల్ బ్లాక్–IIకు ఎంఎండీఆర్‌ చట్టం, 1957లోని సెక్షన్–5 కింద ముందస్తు అనుమతి మంజూరు చేసి, మైనింగ్ లీజ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకోరారు.ఈ అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సింగరేణి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రణాళికలు, కొయ్యగూడెం బ్లాక్–III కేటాయింపు, తాడిచెర్ల కోల్ బ్లాక్–II మైనింగ్ లీజ్ అంశాలపై సంబంధిత కేంద్ర, రాష్ట్ర అధికారులు, సింగరేణి ప్రతినిధులతో త్వరలో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, డైరెక్టర్, పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ గౌతమ్ పొట్రు, డైరెక్టర్, ప్రాజెక్ట్స్ కె. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -