Thursday, May 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుచెరువుల్లో పట్టా భూములు

చెరువుల్లో పట్టా భూములు

- Advertisement -

ఇరిగేషన్‌ రికార్డుల్లో చెరువులు..రెవెన్యూ రికార్డుల్లో పట్టాలు
ప్రభుత్వ రికార్డుల్లో గందరగోళం
చెరువుల భూములు కబ్జా
540 ఎకరాలకు పట్టాలు
పట్టించుకోని అధికారులు

నవతెలంగాణ- 
నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
భూగర్భ జలాలు పెంచేందుకు.. తాగు, సాగు నీటికి ఇబ్బంది ఉండొద్దని.. గ్రామం నాలుగు కాలాలపాటు పచ్చగా ఉండాలని కోరుకొని ప్రభుత్వ భూమితోపాటు పట్టా భూములతో కలిపి గతంలో గ్రామస్తులు రెండు చెరువులను ఏర్పాటు చేసుకున్నారు. కాలానుగుణంగా మనుషులు మారారు.. భూముల ధరలు పెరిగాయి.. అదే సమయంలో అధికారుల నిర్లక్ష్యం తోడై రెవెన్యూ రికార్డుల్లో చెరువులు మాయమయ్యాయి. దీన్ని ఆసరాగా చేసుకుని ఆ గ్రామంలో కొంతమంది అధికార పార్టీ నాయకులు 540 ఎకరాల భూమిని పట్టా చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి రైతుబంధు, బ్యాంకుల ద్వారా రైతు పెట్టుబడి పొందడమే కాకుండా లోన్లు, చేపల చెరువులు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా లబ్ది పొందుతున్నారు. ఇదీ నల్లగొండ జిల్లా నల్లగొండ మండలంలోని నర్సింగ్‌బట్ల గ్రామం చెరువు పరిస్థితి. 1964లో నర్సింగ్‌బట్ల గ్రామంలోని 310 సర్వే నెంబర్‌లో 315 ఎకరాల నాలుగు గుంటల భూమిలో గంగాదేవి చెరువును ఏర్పాటు చేశారు. దాని ఏర్పాటుకు ప్రభుత్వ భూమితోపాటు గ్రామస్తులు కొంత భూమి ఇచ్చారు. మరోటి కొత్త చెరువు 225ఎకరాల 28 గుంటల విస్తీర్ణంలో ఉంది.

గంగాదేవి చెరువు 315 ఎకరాలు, కొత్త చెరువు 225 ఎకరాల విస్తీర్ణం ఇరిగేషన్‌ శాఖ రికార్డులో నమోదైనట్టు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం చెరువుల కోసం రైతుల నుంచి సేకరించిన భూముల వివరాలను తొలగించకపోగా.. అసలు చెరువులే లేనట్టు అధికారులు ధ్రువీకరించారు. కొత్తచెరువును 1979లో ఏర్పాటు చేశారు. అందులో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కూడా ఇచ్చారు. కానీ ఆ రైతుల వివరాలు రికార్డుల నుంచి నేటికీ తొలగించలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది అధికార పార్టీ నాయకులు భూములను కబ్జా చేసి పట్టా చేసుకున్నారు. చెరువు భూములను పట్టా చేసుకొని చెరువును మింగేశారు. ఆ భూములను పట్టా చేసుకున్న నాయకులు చేపల చెరువుగా ఏర్పాటు చేసుకున్నారు. మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్తే.. ‘‘ఈ భూములు మావి.. మాకే హక్కులున్నాయి.. ఇక్కడికి ఎవరూ రావద్దు’’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. రెవెన్యూ రికార్డులో ఎలాంటి చెరువులూ లేవని, పట్టా భూములు మాత్రమే ఉన్నాయని ఆర్డీవో ఇటీవల పేర్కొన్నట్టు గ్రామస్తులు పేర్కొంటున్నారు.. ఇరిగేషన్‌ శాఖ మాత్రం చెరువు ఉందని, అధికారులు రికార్డులు చూపిస్తున్నారు.

ఆ భూములకు పట్టాలు
గంగాదేవి చెరువు, కొత్త చెరువులకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో చెరువు ప్రస్తావన లేకుండా 80 మంది రైతులకు వ్యవసాయ భూములు ఉన్నట్టు ధ్రువీకరించి నమోదు చేశారు. తద్వారా చెరువు శిఖం భూముల్లో పంటలు వేసుకుంటున్నారు. కొందరు చేపల చెరువు ఏర్పాటు చేసుకున్నారు. నిద్రావస్థలో రెవెన్యూ శాఖ 62 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన చెరువుల వివరాలు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయకపోగా.. ఆ భూముల్లో 80 మంది రైతులకు పట్టా భూములు ఉన్నట్టు రికార్డు అయింది. ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్య ఏర్పడింది. అయితే, నేటికీ చెరువులు ఉన్నట్టు ఇరిగేషన్‌ శాఖ రికార్డులు చూపడంతోపాటు వాస్తవంగా గ్రామంలో రెండు చెరువులు కొంతమేరకు సజీవంగా కనిపిస్తున్నాయి. కొంత భూములు కబ్జాకు గురయ్యాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం మాత్రం ఆ గ్రామంలో చేరువులే లేవు.

ప్రభుత్వ ఖజానాకు గండి..
గ్రామ మేలు కోసం రైతులు త్యాగం చేసి చెరువులను ఏర్పాటు చేసుకుంటే కొంతమంది అధికార బలంతో పట్టాలు చేసుకున్నారు. ప్రభుత్వం ద్వారా రైతుబంధు, పంట రుణ సహాయం, ఇతర లబ్ది పొందుతున్నారు. నర్సింగ్‌బట్ల చెరువులను కాపాడాలి సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నలపరాజు సైదులు నర్సింగ్‌ బట్ల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గంగాదేవి చెరువు, కొత్తచెరువులను ఆక్రమించి పట్టాలు చేసుకున్న వారి పట్టాలను రద్దుచేయాలి. పట్టాలు చేసుకున్న వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని నల్లగొండ మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశాం. పట్టాలు రద్దయ్యే వరకు పోరాటాలు చేస్తాం. అవసరమైతే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తాం.

విచారించి చర్యలు తీసుకుంటాం
నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్‌ రెడ్డి నర్సింగ్‌బట్ల గ్రామం చెరువుల వివరాలు పరిశీలిస్తాం. రెవెన్యూ రికార్డులు, ఇరిగేషన్‌ రికార్డులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -