– డాక్టర్ కె.వి. రమణాచారికి అంకితోత్సవం
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ప్రముఖ రచయిత డాక్టర్ వై. రామకృష్ణారావు రచించిన తరంగిణి నవల ఆవిష్కరణ సభ వంశీ ఆర్ట్ థియేటర్స్, వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానంద రావు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారులు ఐఏఎస్ (రి) డా. కె.వి. రమణ చారికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా నిత్యానంద రావు మాట్లాడుతూ.. సమాజానికి ఉపయోగపడే ఉత్తమ నవలలను పాఠకులకు అందించడం అభినందనీయమన్నారు.
డాక్టర్ వై. రామకృష్ణారావు లోతైన అధ్యయనం చేసి నవల రచించారని పేర్కొన్నారు. వంశీ సంస్థల వ్యవస్థాపకులు, కళాబ్రహ్మ శిరోమణి డా. వంశీ రామరాజు స్వాగతోపన్యాసం చేసిన సభకు ప్రముఖ బహుగ్రంథ కర్త, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కార గ్రహీత విహారి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఆకాశవాణి పూర్వ కార్యనిర్వహణాధికారి సుధామ, యువభారతిఅధ్యక్షులు డా. ఆచార్య ఫణీంద్ర, ప్రముఖ సాహిత్యవేత్త, సాహిత్య కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు తదితరు పాల్గొన్నారు. వంశీ మేనేజింగ్ ట్రస్టీ శైలజ సుంకరపల్లి, జనరల్ సెక్రటరీ, వ్యాఖ్యాన శిరోమణి సుధామయి కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.



