ప్రతి అమ్మాయి జీవితంలో తల్లి ప్రాత ఎంతో ముఖ్యమైనది. ఏది మంచి ఏది చెడు, ఏది ఎంత వరకు అవసరం వంటివి నేర్పించడంలో అమ్మ పాత్ర చాలా ఉంటుంది. కానీ అది ఒక వయసు వచ్చేంత వరకు మాత్రమే బాగుంటుంది. ప్రతి చిన్న విషయంలోనూ పిల్లలను ఆలోచించకుండా మొత్తం తల్లే చేస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత స్వతంత్ర్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దలు కూడా పిల్లలకు ఆ స్వేచ్ఛ ఇవ్వాలి. అలా కాకుండా పెండ్లి తర్వాత కూడా నా పిల్ల నాకు ఇంకా చిన్నపిల్లే అంటూ ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ వారం ఐద్వా అదాలత్ (ఐలమ్మ ట్రస్ట్)లో….
రమ్యకు దాదాపుగా 28 ఏండ్లు ఉంటాయి. పెండ్లి జరిగి మూడేండ్లు అవుతుంది. ఆమె ఒక ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంది. భర్త రమేష్ కూడా ఒక ప్రయివేటు సంస్థలో ఉద్యోగి. వీరిద్దరూ అత్తా, మామలతో కలిసి ఉంటున్నారు. రమేష్‌కు ఇద్దరు అక్కలున్నారు. వారికి పెండ్లి అయిపోయింది. అయితే రమ్యకు ఇంకా పిల్లలు లేరు. ‘మీరు ఏదైనా ఆస్పత్రిలో చూపించుకోండి. మేమింకా ఎన్నేండ్లు పిల్లల కోసం ఎదురు చూడాలి, మీ అమ్మ వాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించమను’ అంటూ అత్తామామ గొడవ చేస్తున్నారు. అంతేకాదు ‘ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు. వంట రాదు, భవిష్యత్తులో పిల్లలను ఎలా చూసుకుంటావు’ అంటూ అత్త ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. రమ్య వాళ్ల అమ్మ కూడా ‘ప్రతి చిన్న విషయానికి రమ్యను తిట్టడం, నీకు సరిగ్గా సమాధానం చెప్పడం చేత కాదు, వాళ్లు ఇలా అంటుంటే నువ్వెందుకు పడాలి, ఎదురు తిరిగి మాట్లాడు. పెండ్లయి మూడేండ్లే కదా అవుతుంది, అప్పుడే పిల్లలంటూ గోల చేస్తారా’ అనేది. వాళ్లూ వీళ్లు ఎందుకులే అనీ ఒకసారి రమ్య, రమేష్ ఇద్దరే వెళ్లి ఆస్పత్రిలో చూపించుకున్నారు.
దాంతో రమ్య తల్లి ‘ఎవరికీ చెప్పకుండా మీరెలా చూపించుకుంటారు’ అంటూ మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లి రమ్యను మాట్లాడనీయకుండా డాక్టర్‌తో ఆమె మాట్లాడుతుంది. రమ్య ఏమైనా అంటే ‘నీకేమీ తెలియదు, నువ్వు చిన్నపిల్లవి’ అంటుంది. ‘నా సమస్య నాకు కాకుండా మీకెలా తెలుస్తుంది. చెప్పినా అర్థం చేసుకోదు. దాంతో డాక్టర్ వాళ్ల అత్తను, అమ్మను ఇద్దరినీ బయటకు పంపించేసి రమ్యతోనే మాట్లాడింది. దాంతో వాళ్లు డాక్టర్‌నే మార్చేశారు.రమ్య తల్లి అయితే రమ్య వాళ్ల ఇంట్లో ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకోవాలని, ప్రతి విషయంలో కూతురికి సలహాలు ఇవ్వాలని చూస్తుంది. ఆమె చెప్పింది వినకపోతే, పొరపాటున ఏమైనా జరిగితే ‘నేను చెబితే వినలేదు, అందుకే ఇలా జరిగింది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో పో’ అంటుంది. దీని వల్ల రమేష్‌కు రమ్యకు మధ్య దూరం పెరిగింది. తన సమస్య నుండి ఎలా బయటపడాలో అర్థం కాక రమ్య సలహా కోసం ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది. మేము రమ్య తల్లిని, అత్తను, రమేష్‌ను పిలిచి మాట్లాడితే ‘రమ్య వాళ్ల అమ్మ మాకు సంబంధించిన ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటుంది, సలహాలు ఇస్తుంది.
ఒకవేళ మాకు నచ్చక పాటించకపోతే ఏదో ఒకటి అంటుంది. ఇలా ఆమె ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటే ఎలా? పెండ్లి తర్వాత కూడా ఆడపిల్లను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది. మా ఇంటికి వచ్చినపుడు మేము ఆమెకు సేవలు చేసి పెట్టాలి. రమేష్‌తో పని చేయించుకోవాలని కూతురుతో చెబుతుంది. భార్యాభర్తలు కలిసి పని చేసుకుంటారు కదా! కానీ ఆమె రమ్య పనెందుకు చేయాలి అంటుంది. మా ఇంటికి వచ్చిన తర్వాత ఆమె మా కోడలు. మేము ఎలా అయితే ఉంటామో ఆమే అలాగే ఉంటుంది. మేముగానీ, రమ్య గానీ ఆమె సలహాలు తీసుకోవాలని అనుకోవడం లేదు. అయినా ప్రతి విషయంలో కలగజేసుకోవాలని చూస్తుంది. మీరైనా కాస్త ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పండి’ అన్నది రమ్య అత్త. రమేష్‌తో మాట్లాడితే ‘నేను ఏం చెప్పినా రమ్య ముందు నేను మా అమ్మను అడిగి చెబుతాను అంటుంది. మా పెండ్లి జరిగి మూడేండ్లు అవుతుంది. పిల్లలు లేరు. వాళ్లు వచ్చే సరికి కొంత మొత్తం పొదుపు చేసుకుందామనీ, ఒక ఆరోగ్య బీమా కోసం ఆలోచిస్తున్నాం. ఇందులో ఒకదానికి నేను కడతాను, మరోదానికి నువ్వు కట్టు అంటే నేను మా అమ్మను అడిగి చెప్తాను అంటుంది. ఆస్పత్రికి వెళదామంటే కూడా మా అమ్మను అడగాలి అంటుంది. ఇలా వాళ్ల అమ్మ దూరంగా ఉన్నా మా ఇంట్లో పెత్తనం చెలాయిస్తుంది.
రమ్య కూడా వద్దన్నా వినకుండా వాళ్ల అమ్మకు అన్నీ చెబుతుంది’ అన్నాడు. రమ్య తల్లిని పిలిచి మాట్లాడితే ‘మా అమ్మాయి చిన్న పిల్ల. నేను కొన్ని విషయాల్లో సలహా ఇస్తుంటాను. అంతకు మించి ఏమీ లేదు’ అంది. రమ్యనే మీ గురించి చెప్పింది. మీరు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారా? అంటే, ‘అవును మేడమ్ అప్పుడే ఆమెకు పిల్లలు ఎందుకు. ఇంకా రెండు మూడేండ్ల తర్వాత ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పినా వినకుండా రమేష్ వాళ్ల అమ్మ మాటలు విని ఆస్పత్రికి వెళ్లారు. ఏదైనా అయితే ఎవరిది బాధ్యత. మళ్లీ నేనే కదా చూసుకోవల్సింది. అందుకే చెబుతున్నాను. ఇల్లు కొనుక్కోవడం, పొదుపు చేయడం అంటే రమ్య సంపాదించిన డబ్బులు ఎందుకు వాడుకోవాలి. రమేష్ సంపాదించిన వాటితో చేసుకోవచ్చు కదా? మా అమ్మాయి తన డబ్బులు రమేష్‌తో సంబంధం లేకుండా పొదుపు చేసుకుంటుంది. అంతేకానీ ఇద్దరివీ కలిపి ఎందుకు చేస్తుంది. మీరే చెప్పండి. నా కూతురు ఏ ఫంక్షన్‌కి వెళ్లాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ నగలు వేసుకుంటే బాగుంటుంది అనేది ఆమె చిన్నప్పటి నుండి నేనే చెప్పేదాన్ని. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను.
అందులో తప్పేముంది’ అంది. దానికి మేము ‘ఓ తల్లిగా మీరు ఆలోచిస్తుంది సరైనదే. కానీ పెండ్లి తర్వాత అమ్మాయి జీవితంలోకి భర్త, అత్త, మామ అంటూ కొందరు వస్తారు. వాళ్ల మాటలకు కూడా కొంత విలువ ఇవ్వాల్సి వస్తుంది. అంతకు మించి మీ అమ్మాయి కూడా చిన్న పిల్ల ఏమీ కాదు తన నిర్ణయాలు తాను తీసుకోగలదు. ఏమైనా సలహాలు అవసరమైతే ఆమే అడుగుతుంది. అంతే కానీ మీ అంతట మీరు జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు. చివరకు వాళ్ల వ్యక్తిగత విషయాల్లో కూడా కల్పించుకుంటున్నారు. దీని వల్ల భార్యా భర్తల మధ్య సమస్యలు వస్తున్నాయి. అది మీరు గుర్తించడం లేదు. మీ జోక్యం వల్ల వాళ్ల జీవితం బాగుపడాలి కానీ ఇలా ఇబ్బందులు కలిగించకూడదు. అందుకే మీరు కాస్త మీ జోక్యాన్ని తగ్గించుకోవడం మంచిది. పిల్లల విషయం కూడా వాళ్లే నిర్ణయించుకుంటారు. ఇప్పటికే 28 ఏండ్లు వచ్చాయి. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. వాళ్ల సంపాదన వాళ్లకు నచ్చినట్టు ఖర్చు చేసుకుంటారు. మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. మీ అమ్మాయి కాపురాన్ని నాశనం చేయవద్దు’ అని చెప్పి పంపించాము.
అమ్మాయి ఆలోచించగలదు…
- Advertisement -
- Advertisement -



